బాసర, న్యూస్‌లైన్ : బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల మృత్యుఘంటికలు మోగుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో విద్యార్థుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. విద్యార్థులకు కనీస రక్షణ లేకపోవడం, రక్షణ సిబ్బంది కూడా అంతంతమాత్రంగా ఉండటం, పట్టించుకునే వారు లేకపోవడంతో విద్యార్థులు ఎప్పుడు వెళ్తున్నారో, వస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. గత నెల లోనే నాగరాజు అనే విద్యార్థి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మరువకు ముందే సోమవారం అర్ధరాత్రి రైలు నుంచి దిగుతుండగా ప్రమాదవశాత్తు తుప్పురా గాంధీ(22) అనే విద్యార్థి కిందపడి మృత్యువాత పడ్డాడు.
బండేపల్లి గ్రామానికి చెందిన తుప్పుర గాంధీ బాసర ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం ఉదయం గాంధీ, శివకుమార్‌లు కలిసి నిజామాబాద్ జిల్లా కామారెడ్డి పట్టణంలోని ఓ శుభకార్యానికి ట్రిపుల్ ఐటీ యాజమాన్యం అనుమతి లేకుండా వెళ్లారు. శుభకార్యం చూసుకుని షాపింగ్ చేసుకుని ఇద్దరు అర్ధరాత్రి ఒంటి గంటకు నిజామాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని అజ్మీర్ వేళ్లే రైలులో బాసర వద్ద దిగాలని చూశారు. బాసరలో స్టాప్ లేకపోవడం, స్టేషన్ వద్ద మరమ్మతు చేస్తుండటంతో రైలు వేగం తగ్గింది. రైలు ఆగుతుందనుకుని మొదట శివకుమార్ దూకగా గాయాలు అయ్యాయి. గాంధీ దూకుతుండగా రైలు వేగం పెరగడంతో ప్లాట్ ఫాం, రైలుకు మధ్యలో ఇరుక్కపోయాడు.
తలకు తీవ్రగాయాలు కాగా, కాళ్లు, చేతులు విరగడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. గాయాలైన విద్యార్థి రైల్వే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ట్రిపుల్ ఐటీ యాజమాన్యానికి సమాచారం చేరవేయడంతో అంబులెన్స్ సంఘటన స్థలానికి వచ్చి గాంధీ మృతదేహాన్ని నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. కాగా, ట్రిపుల్ ఐటీ నుంచి విద్యార్థులు బయటకు వెళ్లేటప్పుడు తప్పకుండా యాజమాన్యం అనుమతి తీసుకోవాలి. అటువంటికి విద్యార్థులు అనుమతి లేకుండానే బయటకు వెళ్లారు. రిజిస్టర్‌లో కూడా వారు బయటకు వెళ్లినట్లు లేదు. కాగా, గాంధీ తల్లిదండ్రులు విజయలక్ష్మి, బస్వరాజు. బసవరాజు రిటైర్డ్ ఆర్మి అధికారి. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు.
రక్షణ కరువు..
బాసర సరస్వతీ అమ్మవారి చెంత 2008లో ట్రిపుల్ ఐటీ నెలకొల్పబడింది. వైఎస్సార్ ఉన్న హయాంలో ఏ లోటు లేకుండా విద్యార్థులు నిశ్చింతగా చదువుకున్నారు. ఆయన మరణానంతరం విద్యార్థులకు కష్టాలు మొదలయ్యాయి. నిధులు విడుదల చేయకపోవడంతో సమస్యలు పేరుకుపోయాయి. ప్రస్తుతం 8 వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ట్రిపుల్ ఐటీలో దాదాపు 150 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. ప్రహరీ నిర్మాణం కాకపోవడంతో యాజమాన్యం అనుమతి లేకుండా విద్యార్థులు బయటకు వెళ్తున్నారు. వారిని పట్టించుకోకపోవడంతో ఎప్పుడు వస్తున్నారో తెలియదు. ఇప్పటివరకు గాంధీ, లక్ష్మన్, నాగరాజు విద్యార్థులు నిండు ప్రాణాలు కోల్పోయారు. ఉన్నతాధికారులు పటిష్టమైన భద్రత ఏర్పరచి, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది.
రక్షణ గాలికి..
Published Wed, Mar 12 2014 2:31 AM | Last Updated on Sat, Sep 2 2017 4:35 AM
Advertisement