బాసర ట్రిపుల్‌ఐటీ నోటిఫికేషన్‌ విడుదల.. | - | Sakshi
Sakshi News home page

బాసర ట్రిపుల్‌ఐటీ నోటిఫికేషన్‌ విడుదల..

Published Tue, May 28 2024 6:15 AM | Last Updated on Tue, May 28 2024 11:11 AM

ట్రిపుల్‌ఐటీ నోటిఫికేషన్‌ విడుదల

ట్రిపుల్‌ఐటీ నోటిఫికేషన్‌ విడుదల

‘ఇంటిగ్రేటెడ్‌’ విద్యపై విద్యార్థుల చూపు

ఆరేళ్ల సాంకేతిక విద్యతో అద్భుతాలు

ఏటా వందలాది మందికి ఉద్యోగాలు

రాష్ట్రవ్యాప్తంగా సీట్ల కోసం పోటీ 

మంచిర్యాల: ప్రతిష్టాత్మక బాసర ట్రిపుల్‌ఐటీలో నూతన విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించి వర్సిటీ అధికారులు సోమవారం ఆన్‌లైన్‌లో నోటిఫికేషన్‌ విడుదల చేశారు. జూన్‌ 1 నుంచి 22 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. www.rgukt.ac.in వెబ్‌సైట్‌లో, ఈమెయిల్‌ ద్వారా admissions@rgukt.ac.in సందర్శించాలని సూచించారు.

ఆరేళ్ల సమీకృత(ఇంటిగ్రేటెడ్‌) ఇంజనీరింగ్‌ కోర్సు కోసం ఆసక్తి ఉన్న విద్యార్థులు టీజీ ఆన్‌లైన్‌, మీసేవ, యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చని ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్‌ వెంకటరమణ తెలిపారు. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలు ముగిసి ఫలితాలు కూడా వచ్చేశాయి. ఉత్తమ జీపీఏ సాధించిన విద్యార్థులంతా కోర్సుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఏ కాలేజీలో చదివించాలో.. ఏ కోర్సులు చేయించాలో.. అనే విషయంపై విద్యావేత్తల సలహాలు తీసుకుంటున్నారు.

ప్రస్తుతం ఎక్కడ చూసినా విద్యార్థుల చదువులపైనే ప్రత్యేక చర్చ కొనసాగుతోంది. తెలంగాణలోనే ఏకై క విద్యాలయ ప్రాంగణాన్ని కలిగి ఉన్న బాసర ట్రిపుల్‌ఐటీ నోటిఫికేషన్‌ విడుదల కావడంతో ఇక్కడ దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. చాలామంది తల్లిదండ్రులూ తమ పిల్లలను ఇక్కడే చదివించాలనుకుంటున్నారు.

గ్రామీణ విద్యార్థులకు వరం..
గ్రామీణ విద్యార్థులకు అత్యుత్తమ సాంకేతిక విద్య ను అందించే బాసర ట్రిపుల్‌ఐటీలో ప్రవేశాలకు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు పోటీపడుతుంటారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన పల్లె విద్యార్థులకు బాసర ట్రిపుల్‌ఐటీ సువర్ణ అవకాశంగా మారింది. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుకు సంబంధించి బాసర ట్రిపుల్‌ఐటీలో ఏటా పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించి అందులో అర్హత ఉన్నవారిని ఎంపికచేసి సీట్లను కేటాయిస్తుంది. మూడేళ్లక్రితం ప్రవేశాలకు సంబంధించి మొదటిసారిగా పాలిసెట్‌ అర్హతను జోడించి సీట్లను కేటాయించారు. అప్పట్లో కోవిడ్‌ నేపథ్యంలో పాఠశాలలు మూసి ఉండడంతో పదో తరగతి విద్యార్థులను పరీక్షలు లేకుండానే ఉత్తీర్ణులు చేశారు. అలాంటి పరిస్థితుల్లో విద్యార్థుల సీట్ల కేటాయింపు ప్రక్రియలో పాలిసెట్‌ అర్హతను జోడించి సీట్లు కేటాయించారు. ఈ యేడు పాత విధానంలో సీట్లు భర్తీ చేయనున్నారు.

వేల సంఖ్యలో దరఖాస్తులు..
బాసర ట్రిబుల్‌ ఐటీలో దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. 2020–21లో 32వేల మంది విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోగా 2021–22లో 20,178 మంది, 2022–23లో 31,432 మంది, 2023–24లో 32,635 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

సమీకృత విద్యావిధానం..
ట్రిపుల్‌ఐటీలో ఆరేళ్లపాటు ఇంటర్‌తో పాటు సమీకృత ఇంజనీరింగ్‌ విద్య కొనసాగుతోంది. మొదటి రెండేళ్లు ఇంటర్‌ తత్సమాన పీయూసీ కోర్సు నేర్పిస్తారు. అనంతరం అందులో మెరిట్‌ ఆధారంగా మరో నాలుగేళ్ల ఇంజనీరింగ్‌ సీట్లను ఎంపిక చేసుకోవచ్చు. పీయూసీ విద్య అనంతరం మెరుగైన అవకాశాలు వస్తే విద్యార్థులు ఇక్కడి నుంచి బయటకు వెళ్లి చదువుకునే అవకాశం కూడా ఉంది. నాలుగేళ్ల బీటెక్‌లో సివిల్‌, కెమికల్‌, కంప్యూటర్‌, ఎలక్ట్రానిక్స్‌, ఐటీ, ఈసీఈ, ఎంఎంఈ కోర్సులు అందిస్తున్నారు.

మొదటి రెండేళ్ల పీయూసీలో సాధించిన మార్కుల ఆధారంగానే బీటెక్‌లో కోర్సులు కేటాయిస్తారు. ఇక్కడ ఎంపికై న విద్యార్థులకు బాసర ట్రిపుల్‌ఐటీ అధికారులు అన్ని వసతులను సమకూరుస్తారు. ల్యాప్‌టాప్‌, అందరికీ ఒకేరకమైన దుస్తులు, షూస్‌, స్పోర్ట్స్‌ డ్రెస్‌ అందిస్తారు. హాస్టల్‌, భోజన వసతి యూనివర్సిటీయే కల్పిస్తుంది. చదివే విద్యార్థుల కోసం శారీరక, మానసిక వికాసానికి ఆటలు, వ్యాయామం, సాంస్కృతిక రంగాల్లో రాణించేందుకు సైతం తరగతులు నిర్వహిస్తున్నారు. బాసర ట్రిపుల్‌ఐటీలో ప్రత్యేక వైద్యశాల, అధునాతనమైన ల్యాబ్స్‌, డిజిటల్‌ లైబ్రరీ అందుబాటులో ఉన్నాయి.

ఏటా భారీగా దరఖాస్తులు..
బాసర ట్రిపుల్‌ఐటీలో చదివేందుకు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఆసక్తి కనబరుస్తారు. నోటిఫికేషన్‌ ప్రక్రియ వెలువడడంతోనే ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తాం. ఇక్కడ సీటు దక్కించుకునేందుకు ఏటా 30 వేలకు పైగానే విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఇక్కడ చదివేందుకు పోటీపడుతున్నారు. – వెంకటరమణ, ఇన్‌చార్జి వీసీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement