‘పది’ పరీక్షలు రాసిన విద్యార్థుల ఇంటిబాట పట్టిన పీఆర్వోలు
ఫలితాలు రాక ముందే ఇంటర్ అడ్మిషన్ల వేట
నిబంధనలు పాటించని ప్రైవేట్ కళాశాలలు
‘హలో.. నమస్కారమండి.. మీ పాప/బాబు పదో తరగతి అయిపోయింది కదండి.. ఇంటర్‌కు ఏం ప్లాన్ చేస్తున్నారు.. మాది కార్పొరేట్ కాలేజ్. ఐఐటీ.. మెయిన్స్.. అడ్వాన్స్.. ఏసీ.. నాన్ ఏసీ స్పెషల్ బ్యాచ్‌లున్నాయి. ఇప్పుడు జాయిన్ అయితే డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం.. రిజల్ట్స్ వచ్చాక సీట్లు ఉండవు. ఫీజులు పెరుగుతాయి.. మీ ఇష్టం.. ఆలోచించుకొండి..’ ఇది జిల్లాలో పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు రోజూ వస్తున్న ఫోన్‌కాల్స్. ఇలా ఇంటర్ కాలేజీల యాజమాన్యాలు ప్రత్యేకంగా పీఆర్‌వోలను నియమించుకొని ప్రవేశాల కోసం గాలం వేస్తున్నాయి.
ఆదిలాబాద్‌టౌన్: తాము పడ్డ కష్టాలు తమ పిల్లలు పడకూడదని తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. కూలీ నాలి చేసైనా మంచి కళాశాలలో చదివించాలనే ఆ లోచనలో ఉన్నారు. దీనిని ఆసరాగా చేసుకొని అందినకాడికి దోచుకునేందుకు కార్పొరేట్ కళాశాలలు సిద్ధమవుతున్నాయి. అందించేది అరకొర విద్యే అ యినప్పటికీ.. ఆకట్టుకునేలా బ్యాచ్‌కో పేరు పెట్టి.. రంగురంగుల బ్రౌచర్లు చూపి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. వీరి మాయమాటలు నమ్మి చాలా మంది తల్లిదండ్రులు స్థిరాస్తులు సైతం అమ్ముకొని పిల్లలను చదివిస్తున్నారు. ప్రస్తుతం పదో తరగతి పరీక్ష ఫలితాలు రాక ముందే నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్ల వేట ప్రారంభించాయి.
బంపర్ ఆఫర్లతో ఆకట్టుకునేలా..
ఆయా కళాశాలలు నియమించుకున్న పీఆర్వోలు వి ద్యార్థుల ఇళ్ల వద్దకు క్యూ కడుతున్నారు. మూడు నెలల ముందు నుంచే ఈ తతంగం మొదలైంది. వీరు పాఠశాలలకు వెళ్లి విద్యార్థుల వివరాలు, ఫోన్ నంబర్లు, చిరునామా ఇప్పటికే సేకరించారు. వివరాలు ఇచ్చినందుకు ఆయా పాఠశాలల యాజ మాన్యాలకు విందులు, నజరానాలు సమకూర్చుతున్నారు. నిబంధన ప్రకారం విద్యార్థుల వివరాలు ఎవరికీ ఇవ్వరాదు. కానీకాసులకు కక్కుర్తిపడి కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఈవిధంగా వ్యవహరిస్తున్నా యి. హైదరాబాద్‌కు చెందిన పలు కళాశాలల వారు జిల్లాలో 50 మంది వరకు పీఆర్‌వోలను నియమించుకున్నారు. వారు ఉదయం నుంచి రాత్రి వరకు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి బ్రోచర్లు ఇవ్వడం, వారి కళా శాలల్లో ఇచ్చే బోధన, వసతులు, ఏసీ క్యాంపస్‌లు, తదితర విషయాలను వివరిస్తూ వారిని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు.
టార్గెట్ పెడుతూ..
కొన్ని యాజమాన్యాలు పీఆర్వోలను ప్రత్యేకంగా ని యమించుకొని ఏడాది పాటు వేతనాలు ఇస్తున్నా యి. అడ్మిషన్లు ఎక్కువగా చేసిన వారికి ఇన్సెంటీవ్‌లు సైతం అందజేస్తున్నాయి. మరోవైపు సంబంధి త కళాశాలలో పనిచేస్తున్న బోధన, బోధనేతర అ ధ్యాపకులు, సిబ్బంది తప్పకుండా ప్రతి ఒక్కరు 25 చొప్పున ఆ కళాశాలలో అడ్మిషన్లు తీసుకురావాలని టార్గెట్లు పెట్టారు. వేసవిలో తరగతులు ఉండకపోవడంతో వారికి సగం వేతనమే చెల్లిస్తున్నారు. ప్రవేశాలు చేసిన వారికి మాత్రం ఇన్సెంటీవ్, కొంత కమీ షన్ ఇస్తున్నారు. లెక్చరర్లు, ఇతరులు ఎవరైనా అడ్మిషన్లు చేస్తే సాధారణ కళాశాలకు రూ.వెయ్యి, కార్పొరేట్ కళాశాలకు రూ.5వేల వరకు, హాస్టల్ క్యాంపస్ ఉన్న కళాశాలల్లో చేర్పిస్తే రూ.2500 అందజేస్తున్నా రు. కాగా, ఈ డబ్బంతా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తున్నది కావడం గమనార్హం.
నిబంధనలకు విరుద్ధంగా..
పదో తరగతి పరీక్షల ఫలితాలు వెలువడిన తర్వాత మే, జూన్‌లో అడ్మిషన్లు ప్రారంభించాలి. అయితే నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాల ప్రక్రియ నిర్వహిస్తున్నా విద్యా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికై నా స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
జిల్లాలో..
జిల్లాలో ప్రభుత్వ కళాశాలలు 13
మోడల్, సోషల్, ట్రైబల్ వెల్ఫేర్, కేజీబీవీలు, మహాత్మా జ్యోతిబాపూలే, ప్రభుత్వ యాజమాన్య కళాశాలలు 45
ప్రైవేట్ కళాశాలలు 14
భారీగా ఫీజులు..
హైదరాబాద్‌లోని కార్పొరేట్‌కు సంబంధించి జిల్లా నుంచి ఏటా వెయ్యి నుంచి 2వేల మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందుతున్నారు. ఐఐటీ, నీట్, ఏసీ సౌకర్యాలు ఉన్న కళాశాలల్లో ఏడాదికి రూ.3లక్షలు, సాధారణ చదువుకు రూ.1లక్ష 50వేల వరకు వసూలు చేస్తున్నారు. జిల్లాలోని కొన్ని కార్పొరేట్ కళాశాలలు సైతం రూ.లక్షకు పైగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు సమాచారం.
ప్రభుత్వ కళాశాలల్లో చేర్పించండి
ప్రభుత్వ కళాశాలల్లో అనుభవజ్ఞులైన లెక్చరర్ల ఆధ్వర్యంలో నాణ్యమైన విద్య అందిస్తున్నాం. తల్లిదండ్రులు ఆలోచించి తమ పిల్లలను సర్కారు కళాశాలల్లో చేర్పించాలి. అడ్మిషన్‌తో పాటు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు సైతం ఉచితంగా అందిస్తున్నాం. స్కాలర్‌షిప్ కూడా పొందవచ్చు.
– రవీంద్రకుమార్, డీఐఈవో
Comments
Please login to add a commentAdd a comment