ఐకేపీ, డీఆర్‌డీఏ జేఏసీ ఏర్పాటు | ikp,drda jac formed | Sakshi
Sakshi News home page

ఐకేపీ, డీఆర్‌డీఏ జేఏసీ ఏర్పాటు

Published Mon, Aug 19 2013 5:31 AM | Last Updated on Fri, Sep 1 2017 9:55 PM

ikp,drda jac formed

ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనేందుకు ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ), జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) ఉద్యోగులు జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ)గా ఏర్పాటయ్యారు. రాష్ర్ట విభజనకు వ్యతిరేకంగా ఈ నెల 20వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నారు. స్థానిక డ్వాక్రాబజార్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఐకేపీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జి.రాంబాబు ఆ వివరాలు వెల్లడించారు. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ నాయకుడు అశోక్‌బాబు అధ్యక్షతన శుక్రవారం గుంటూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఐకేపీ జేఏసీ ఏర్పాటైనట్లు చెప్పారు. శనివారం నుంచి నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతామని, సోమవారం పీడీలకు సమ్మె నోటీసులు అందజేస్తామన్నారు. మంగళవారం నుంచి నిర్వహించనున్న నిరవధిక సమ్మెలో సీమాంధ్రలోని 13 జిల్లాల్లో గల 70 లక్షల మంది ఐకేపీ ఉద్యోగులు పాల్గొంటారని చెప్పారు. విలేకర్ల సమావేశంలో ఐకేపీ అధికారులు కృష్ణకుమారి, అంబేద్కర్, సురేష్, సాల్మన్, ప్రసాద్, పి.రాంబాబు, డేవిడ్, కృష్ణారావు పాల్గొన్నారు.
 
 రేపటి నుంచి పశుసంవర్థకశాఖ వైద్యులు...
 ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సమైక్యసెగ పశుసంవర్థకశాఖను తాకింది. ఇప్పటికే ఆ శాఖ సిబ్బంది నిరవధిక సమ్మెలోకి దిగగా, తాజాగా పశువైద్యులు, పశుసంవర్థకశాఖ అసిస్టెంట్ డెరైక్టర్లు సమ్మెబాట పట్టనున్నట్లు ప్రకటించారు. గజిటెడ్ ఆఫీసర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీ నుంచి సమ్మెలోకి దిగుతున్నట్లు వెల్లడించారు. ఆ మేరకు పశుసంవర్థకశాఖ డెరైక్టర్‌కు సమ్మె నోటీసు కూడా అందించారు. జిల్లాలోని 110 మంది పశువైద్యులు, 17 మంది అసిస్టెంట్ డెరైక్టర్లు సమ్మెలోకి దిగనున్నారు. ఇప్పటివరకు పశుసంవర్థకశాఖ ఆధ్వర్యంలోని మినిస్టీరియల్ సిబ్బంది సమ్మె చేస్తున్నారు. అయితే, సేవలపై వారి సమ్మె ఎలాంటి ప్రభావం చూపలేదు. పశువైద్యులు, అసిస్టెంట్ డెరైక్టర్ల సమ్మెతో సేవలకు విఘాతం కలగనుంది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనివల్ల పశువులు వ్యాధుల బారినపడే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో పశువైద్యులు సమ్మెలోకి దిగడంతో పశుపోషకులు ఆందోళన చెందుతున్నారు.
 
 అత్యవసర సేవలకు ఆటంకం కలగకుండా చర్యలు...
 పశువైద్యులు, అసిస్టెంట్ డెరైక్టర్లు ఈనెల 19వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి దిగుతుండటంతో అత్యవసర వైద్య సేవలకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పశుసంవర్థకశాఖ గజిటెడ్ ఆఫీసర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా కన్వీనర్ డీ సురేంద్రప్రసాద్, కార్యదర్శి పీ వెంకటసుబ్బయ్య తెలిపారు. సంతపేటలోని బహుళార్ధ పశువైద్యశాల ఆవరణలో సమ్మెకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను శనివారం వారు వెల్లడించారు. నిరవధిక సమ్మెలోకి దిగినప్పటికీ అత్యవసర సేవలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు ప్రతి పశువైద్యశాలలో సంబంధిత పశువైద్యాధికారి ఫోన్ నంబర్‌ను అందుబాటులో ఉంచుతామన్నారు. పశువులకు అత్యవసర వైద్యం అవసరమైతే ఫోన్‌చేసిన వెంటనే వైద్యుడు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు వారు వివరించారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement