- ఎస్‌హెచ్‌జీలకు అందని రుణాలు
- ఏటా ఎదురు చూపులే
- ఈ ఆర్థిక సంవత్సరం కూడా మొండిచేయే
- వడ్డీలేని రుణాలు వట్టిమాటే అంటున్న సభ్యులు
హుకుంపేట/అరకురూరల్, న్యూస్‌లైన్: మహిళల ఆర్థిక స్వావలంబనకు స్వ యం సహాయక సంఘాల సభ్యులకు ఇచ్చే బ్యాంకు లింకేజీ ప్రస్తుతం వారి దరి చేరడం లేదు. బ్యాంకర్లు అనేక లింకులు పెడుతున్నా రు. తీసుకున్న రుణానికి ఎక్కువ వడ్డీ పడుతుండడంతో సభ్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మహిళలకు వడ్డీలేని రుణాలిస్తామం టూ ఊదరగొడుతున్న ప్రభుత్వం హామీలు నీటిమూటలవుతున్నాయి. మహిళల్లో సామాజిక చైతన్యం తీసుకువచ్చేందుకు 2005లో మహానేత వైఎస్‌రాజశేఖరరెడ్డి ఏర్పాటు చేసిన స్వయం సహాయక సంఘాలు మహోజ్వలంగా వెలిగాయి.
గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో పటిష్టమైన మహిళా సమాఖ్యలు ఏర్పడ్డాయి. మహారాణులు స్థాయికి మహిళలు ఎదిగారు. ఆర్థికంగా ఆసరా పొంది నాలుగు డబ్బులు వెనకేసుకున్నారు. చింత లేకుండా పిల్లలను చదివించుకునేవారు. వ్యవసాయ పనుల మదుపులకు ఇబ్బంది పడేవారు కాదు. మహానేత మరణంతో డ్వాక్రా, స్వయం సహాయక సంఘాల పరిస్థితి తారుమారైంది. ఆశించిన పురోగతి కనిపించడంలేదు. ప్రపంచ బ్యాంకు రుణం ఆగిపోవడంతో ఐకేపీ భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. మహిళా స్వయం సహాయక ఉద్యమంలో పంచసూత్రాలు కీలకం. వారంవారం సమావేశాలు, పొదుపు, అంతర్గత అప్పులు, తిరిగి చెల్లింపులు, పస్తకాల సక్రమ నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలి.
ఉపాధిహామీతో అనుసంధానం చేసి కూలీలకు నగదు పంపిణీ బాధ్యతలను మహిళా సమాఖ్యలకు అప్పగిస్తే వాటి ఆదాయం మెరుగుపడే అవకాశముంది. తమ కార్యకలాపాలను తామే నిర్వహించుకునే సత్తాలేనప్పుడు ఈ సమాఖ్యలు నిలబడడం కష్టం. ఉదాహరణకు అరకులోయ మండలంలో 48 గ్రామైక్య సంఘాలు, 818 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వీటిలో కేవలం 65 స్వయం సహాయక సంఘాలకు మాత్రమే బ్యాంకు లింకేజీ రుణాలు రూ. 1.18 కోట్లు అందించారు.
2013-14వ సంవత్సరానికి 168 సంఘాలకు రూ 2.31కోట్లు పంపీణి చేయాల్సి ఉండగా కేవలం 31 స్వయం సహాయక సంఘాలకు రూ. 48,12 లక్షలు మాత్రమే ఇచ్చారు. ఈ ఏడాది స్త్రీ నిధి నిధుల మంజూరుకు గ్రేడింగ్ జాబితా సిద్ధం చేయలేదంటే ఐకేపీ అధికారులు, సిబ్బంది పనితీరు అర్థమవుతోంది. ఆర్థిక ఆసరా పథకం కింద గతేడాది దరఖాస్తులు తీసుకున్నప్పటికీ పాడేరు ఐటీడీఏ ఏ ఒక్క మహిళా సంఘానికి రుణాలు ఇవ్వలేదు.