‘పచ్చ’ దోపిడీ !
తాడేపల్లి రూరల్: మంగళగిరి శాసన సభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) స్వయంగా పరిశీలించి, అధికారులను రప్పించి ఇసుక అక్రమ నిల్వలు చూపించి, వీటి నిగ్గు తేల్చండని కోరినా, తెల్లవారేసరికి ఆ ఇసుక మొత్తాన్ని తరలించుకుపోయారంటే అక్రమార్కుల ధీమా అర్థం చేసుకోవచ్చు. మూడు రోజుల్లో అక్రమార్కులు రూ. 50 లక్షల ఇసుకను అమ్మేసుకున్నట్టు రెవెన్యూ అధికారుల అంచనా. శుక్రవారం రాత్రి, శనివారం పగలూ సుమారు 725 ట్రక్కుల ఇసుక తోలినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. శుక్రవారం పట్టా భూముల పేరిట ఇసుక తరలించిన వీరు ఎమ్మెల్యే ఆర్కే పర్యటనతో పట్టా భూముల్లో తవ్వకాలకు స్వస్తి చెప్పి పంచాయతీ లంకలకు రాత్రి రాత్రే దారి వేసి లంక భూముల నుంచి శనివారం పగలంతా ఇసుక తోలుకున్నారు.
అనుమతులు అక్రమం ...
►నిజానికి చిర్రావూరు ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇవ్వడమే పెద్ద నాటకం. కృష్ణానదిలో ఇసుక మేట వేసిన భూముల్లో ఎవరి భూమి ఎక్కడో హద్దులు వేసి నిర్ణయించాల్సింది రెవెన్యూ అధికారులు. కానీ ఎలాంటి నిర్థారణ చేయకుండానే సర్వే నంబర్ 100, 106లలో ఇసుక తవ్వుకోండంటూ అనుమతులు ఇచ్చారు.
►ఆ నంబర్ పేరిట నదిలోనూ, లం క భూముల్లోనూ ఇసుక తవ్వేస్తు న్న వైనం విజిలెన్స్ దాడుల్లో బయటపడింది. అక్రమార్కులకు రూ. 26 లక్షల జరిమానా కూడా విధిం చారు. అందులో రూ.18 లక్ష లు చెల్లించి రూ.8 లక్షలు ఎగ్గొట్టారు.
►ఇది తేలకుండానే వారికే మైనింగ్ శాఖ మళ్లీ మరో 1800 క్యూబిక్ మీ టర్ల ఇసుక రవాణాకు అనుమతులిచ్చింది.
►శుక్రవారం మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్వయంగా చిర్రావూరు వెళ్లి ఇసుక క్వారీ పరిశీలించి, భారీగా నిల్వలను కను గొన్నారు. ఆ ఇసుక ఎంతమొత్తమో తేల్చండంటూ అధికారులకు సూచించారు. కానీ తెల్లవారే సరికి ఆ ఇసుకంతా మాయమైంది.
►శాసనసభ్యుని ఆదేశాలతో చిర్రావూరు పట్టా భూముల్లో ఇసుక తవ్వకుండా తాడేపల్లి తహశీల్దార్ చర్యలు తీసుకున్నారు. అయితే రాత్రికి రాత్రి పంచాయతీ ఆధీనంలో లంక భూములకు దారి ఏర్పరచి, అక్కడ నుంచి ఇసుక తరలించారు.
►ఇందుకు మైనింగ్ శాఖ గతంలో ఇచ్చిన వేబిల్లులు వాడుకుంటున్నారు. శాసనసభ్యులు ఆదేశించినా ఆ వే బిల్లులు అధికారులు ఎందుకు స్వాధీనం చేసుకోలేదో తెలియదు.
►మూడు రోజుల్లో రూ. 50 లక్షల విలువైన ఇసుకను తమ్ముళ్లు దోచేసినట్టు అధికారులే గుసగుసలాడుకుంటున్నారు.
►అక్రమార్కులు బరితెగింపుకు, అధికారుల భయానికి ఈ దందా వెనుక ఉన్న వారంతా తెలుగుతమ్ముళ్లు కావడమే కారణంగా కింది స్థాయి అధికారులు చెబుతున్నారు.