తాత్కాలిక రాజధాని ఎక్కడ?
మంగళగిరి : తాత్కాలిక రాజధాని విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. అమరావతి టౌన్‌షిప్‌లో ఓ వైపు భూమిని చదును చేస్తున్నా దీనిపై ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది. మంగళగిరి నియోజకవర్గంలో రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రాక పోతుండడంతో తాత్కాలిక రాజధానిని మంగళగిరిలో ప్రకటిస్తే తుళ్లూరు మండల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తారనే భయంతో ప్రభుత్వం కాలయాపన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 2వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళగిరి పర్యటనలో తాత్కాలిక రాజధానిని పరిశీలిస్తారని, స్పష్టత ఇస్తారని భావించినా ఇక్కడి రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు రాకపోవడంతో పాటు వ్యతిరేకిస్తూ 9.2 ఫారాలు ఇస్తున్నారని అలాంటప్పుడు తాత్కాలిక రాజధానిని సైతం తుళ్లూరు మండలంలోనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రులు అధికారులకు సూచించినట్లు తెలిసింది.
అక్కడకు ఉద్యోగుల రాకపోకలు రవాణా, తాగునీరు తదితర అవసరాలపై సమగ్ర నివేదిక అంద జేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అధికారులు ఆ దిశలో చర్యలు చేపట్టారు. బుధవారం అమరావతిటౌన్‌షిప్‌ను పరిశీలించిన పురపాలక మంత్రి పి. నారాయణ సైతం తుళ్లూరు మండలంలోని కొన్నిగ్రామాల వారు తాము తాత్కాలిక రాజధానికి ఉచితంగా భూములు ఇస్తామని ముందుకు వస్తున్నారని, వారి కోరికను పరిశీలిస్తామని చెప్పడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.