సాక్షి, అమరావతిబ్యూరో: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే పనిలో ప్రభుత్వ పెద్దలు నిమగ్నమయ్యారు. తాజాగా ఫైబర్ గ్రిడ్ టెండర్ల ప్రక్రియలో అక్రమాల పరంపరకు తెరతీశారు. ఇప్పటికే ఫైబర్ గ్రిడ్ రెండో దశ కాంట్రాక్టును రూ.2,200కోట్లతో తమ అస్మదీయ, బినామీ సంస్థలకు కట్టబెట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. అదే ఊపులో రూటర్ల ఏర్పాటు పేరుతో మరో భారీ (రూ.700 కోట్లు) కాంట్రాక్టును వారికి కట్టబెట్టేందుకు ఎత్తుగడ వేశారు.
‘రూటర్ల’తో కాంట్రాక్టుకు రూట్‌క్లియర్...!?
రాష్ట్రంలో రెండో దశలో 60వేల కి.మీ. మేర ఫైబర్‌గ్రిడ్ కేబుల్స్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ (ఏపీఎస్‌ఎఫ్‌ఎల్) ఇప్పటికే టెండర్ల ప్రక్రియను దాదాపు ఓ కొలిక్కితెచ్చింది. రూ.2,200 కోట్లతో ఈ కాంట్రాక్టును ప్రభుత్వ పెద్దల బినామీ, అస్మదీయులకు చెందిన మూడు సంస్థలకు కట్టబెట్టాలని భావిస్తుండటం వివాదాస్పదమ వుతోంది. ఈ నేపథ్యంలోనే ఫైబర్ గ్రిడ్ పనుల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రూటర్లు ఏర్పాటుకు ప్రభుత్వ పెద్దలు ప్రతిపాదించారు. రాష్ట్రంలో మొదటి విడత, రెండో విడతలో ఫైబర్ గ్రిడ్ కేబుళ్లు వేసిన జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో రూటర్లు ఏర్పాటు చేస్తారు. దాదాపు 60వేల కి.మీ.కుపైగా వేసిన ఫైబర్ గ్రిడ్ కేబుళ్లను రాష్ట్రంలో 1,300 టెలిఫోన్ ఎక్సే్చంజిలతో ఈ రూటర్లు అనుసంధాని స్తాయి. అందుకోసం 1,300 రూటర్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదన. దాదాపు రూ.700కోట్లకుపైగా అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం.
బినామీ సంస్థకేనా...!?
ఫైబర్ గ్రిడ్ రెండో దశ పనులకు అనుబంధంగానే రూటర్ల ఏర్పాటు కాంట్రాక్టును చేర్చాలని భావిస్తున్నారు. తద్వారా ప్రభుత్వ పెద్దల అస్మదీయ సంస్థకే కట్టబెట్టాలన్నది లక్ష్యం. ప్రభుత్వ ముఖ్యనేత బినామీగా గుర్తింపుపొందిన వివాదాస్పద వ్యక్తి ఇప్పటికే ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ లో సర్వం తానై చక్రం తిప్పుతున్నారు. ఆయనకు చెందిన సంస్థ ఇప్పటికే ఫైబర్ గ్రిడ్ మొదటి దశ పనులు చేస్తుండటంతోపాటు రెండో దశ పనుల్లోనూ సింహభాగానికి గురిపెట్టింది. విశ్వసనీయ సమాచారం మేరకు ఆ సంస్థకే రూటర్ల ఏర్పాటు కాంట్రాక్టును ఇవ్వాలని ప్రతిపాదించినట్లు సమాచారం. అందుకు ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ నిపుణుల కమిటీలోని కొందరు సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ సంస్థకు రూటర్ల ఏర్పాటు, నిర్వహణ అనుభవం లేదని, సాంకేతిక సామర్థ్యం లేదని అభ్యంతరం వ్యకం చేశారు.
అసలు రూటర్ల ఏర్పాటు కోసం విడిగా టెండర్లు పిలవాలని స్పష్టం చేస్తున్నారు. కేంద్ర నిధులతో చేపడుతున్న ఈ కాంట్రాక్టులో నిబంధనలను అతిక్రమిస్తే భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పకపోవచ్చని కూడా సందేహం వ్యక్తం చేశారు. దాంతో ముఖ్యనేత బినామీ వ్యక్తి మరో ఎత్తుగడ వేశారు. ఉత్తరభారతదేశానికి చెందిన ఓ సంస్థను తెరపైకి తెచ్చారు. రూటర్ల ఏర్పాటు, నిర్వహణలో అనుభవం ఉన్న ఆ సంస్థతో తమ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా కథ నడుపుతున్నారు. కాబట్టి కాంట్రాక్టును తమ సంస్థకు ఇవ్వడానికి అవరోధాలు లేవన్న వాదనను వినిపిస్తున్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టేందుకు అనుకూలంగానే త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటారని అధికారవర్గాలు భావిస్తున్నాయి.
‘రూటర్లూ’ మనోడికే!
Published Tue, Jun 19 2018 3:51 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment