మెదక్ రూరల్, న్యూస్‌లైన్: భోజనం చేసి పడుకున్న తల్లీకొడుకు ఉన్నట్టుండి అస్వస్థతకు లోనైయ్యారు. కడుపునొప్పి, వాంతులు కావటంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే తల్లి మృతి చెందగా, ఆమె కుమారుని పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన మండల పరిధిలోని పాతూరు పంచాయతీ పరిధిలోని చీపురుదుబ్బతండాలో సోమవారం చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం...తండాకు చెందిన కేతావత్ మంగ(35) కేతావత్ దేవ్‌జ దంపతులకు కుమారుడు, కూతురు సంతానం. కూతురు వేరే చోట హాస్టల్లో ఉండి చదువుకుంటుండగా, కుమారుడు నరేష్ తల్లిదండ్రులవద్దే ఉంటూ మెదక్ పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువు తున్నాడు. దేవ్‌జ, అతని తమ్ముడు రమేష్‌లు కుటుంబాలు కలిసి ఉంటున్నాయి.
ఈ క్రమంలో ఆదివారం దేవ్‌జ, అతని తమ్ముడు రమేష్‌లు ఓ విందుకు వెళ్లి అక్కడే భోజనాలు చేసి వచ్చారు. దీంతో మంగ, ఆమె కుమారుడు నరేష్‌లు ఆదివారం సాయంత్రం తండాకు విక్రయానికి వచ్చిన చేపలు కొని వాటితో కూర చేసుకుని తిని పడుకున్నారు. కాగా రాత్రి 12 గంటల సమయంలో ముందుగా మంగకు వాంతులవడంతో పాటు కడుపులో నొప్పి ప్రారంభమైంది. ఆమెను మెదక్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించటంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృత్యువాత పడింది. అనంతరం నరేష్‌కు సైతం వాంతులవడంతో పాటు కడుపు నొప్పి ప్రారంభమైంది. దీంతో బంధువులు నరేష్‌ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పాతూరు గ్రామస్థులు తండావాసులు మృతురాలు ఇంటికి చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు. దీంతో చీపురుదుబ్బతండాలో విషాదం నెలకొంది.
విషాహారమా..?
మంగ, ఆమె కుమారుడు రాత్రి తిన్న చేపలకూరే విషాహారమైందా లేక ఆహారంలో ఏదైనా విషం కలిసిందా అని స్థానికులు అనుమానిస్తున్నారు. అయితే మంగతో పాటు తండాలోని చాలా మంది చేపలు కొని వండుకు తిన్నా, వారంతా బాగానే ఉన్నారని, అందువల్లే వారే ఆహారంలో విషం కలుపుకున్నారా అని వారు అనుమానిస్తున్నారు. అయితే ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని రూరల్ ఎస్‌ఐ వేణుకుమార్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు.
విషాహారంతో అస్వస్థత
Published Tue, Aug 20 2013 6:49 AM | Last Updated on Fri, Oct 5 2018 6:48 PM
Advertisement
Advertisement