‘ఫొటోలోని రైతు బి.కోడూరు మండలం మున్నెల్లి గ్రామానికి చెందిన ఓకిలి సిద్దారెడ్డి. రెండు ఎకరాల్లో వరి పంటను సాగుచేశాడు. రూ.40వేలకు పైగా పెట్టుబడి పెట్టాడు. ప్రస్తుతం వరి పంట పొట్ట, కరుకు దశలో ఉంది. ఈ దశలో చెరువులో నీళ్లు అయిపోయాయి. దీంతో వరి పంట ఎండుదశకు చేరుకుంటోంది. పంటను రక్షించుకునేందుకు ఒకటిన్నర కిలోమీటర్‌లో ఉన్న సగిలేరు నుంచి పైపులు వేసినా పొలానికి నీరందలేదు. పెట్టుబడితో పాటు శ్రమ వృథాగా మారుతోందని ఆవేదన చెందుతున్నాడు.
సాక్షి, కడప/ బి.కోడూరు, న్యూస్‌లైన్ : బి.కోడూరు మండలం మున్నెల్లి చెరువు కింద మున్నెల్లి, తువ్వపల్లె, బోడుకుండుపల్లె, తమటంవారిపల్లెకు చెందిన నాలుగు గ్రామాల ప్రజలు 500 ఎకరాలకు పైగా వరి పంటను సాగుచేశారు. ప్రస్తుతం ఈ పంట పొట్టదశలో ఉంది. చెరువులో నీళ్లు అయిపోవడంతో వరిపంట ఎండుదశకు చేరుకుంది. బ్రహ్మంసాగర్ నుంచి లోయర్ సగిలేరు ప్రాజెక్టు (ఎల్‌ఎస్‌పి) ద్వారా చెరువుకు నీళ్లు ఇచ్చి ఆదుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులతోపాటు కలెక్టర్‌కు రైతులు విజ్ఞప్తి చే స్తున్నారు.
చెరువు కింద ఉన్న ఆయకట్టును కాపాడుకునేందుకు ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో ఉన్న సగిలేరు నుంచి మోటార్లు, ఇంజన్ల ద్వారా పైపులు వేసి పంటను రక్షించుకునేందుకు చేసిన ప్రయత్నాలు విద్యుత్ కోతల నేపథ్యంలో ఫలించలేదు. దీంతో చేసేదేమీలేక చేతులెత్తే పరిస్థితి నెలకొంది. మూలవారిపల్లె, ప్రభలవీడు చెరువుల్లో సైతం నీరు అడుగంటడంతో 500 ఎకరాల్లో వరి దిగుబడి ప్రశ్నార్థకంగా మారనుంది.
మున్నెల్లి చెరువుకు చేరని నీరు :
లోయర్ సగిలేరు ప్రాజెక్టు నుంచి ఎడమ కాలువతోపాటు, మున్నెల్లి చెరువుకు నీరిచ్చేందుకు వీలుగా విడిగా రెండు కాలువలు ఉన్నాయి. 504 అడుగుల నీటిమట్టం వద్ద ఎడమకాలువకు, మున్నెల్లి చెరువుకు హై లెవల్‌లో అంటే 512 అడుగుల వద్ద మాత్రమే నీటిని విడుదల చేసే వెసలుబాటు ఉంటుంది. ప్రస్తుతం ఉన్న నీటి మట్టానికి అదనంగా 400 నుంచి 500 క్యూసెక్కుల నీరు చేరితే తప్ప మున్నెల్లి కాలువకు నీరు వచ్చే పరిస్థితి లేదు. ఇటీవలే ఎల్‌ఎస్‌పిలో నీటిమట్టం 512 అడుగులకు దరిదాపుల్లో ఉన్నప్పుడు బ్రహ్మంసాగర్ ఎడమ కాలువకు నీటిని నిలిపివేయడంతోపాటు ఎల్‌ఎస్‌పి ఎడమ కాలువ ద్వారా దిగువకు నీటిని విడుదల చేయడంతో మున్నెల్లి చెరువుకు నీరు అందని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మిగతాచోట్ల నీటి అవసరాలు పెద్దగా లేనందున బ్రహ్మంసాగర్ ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేసి ఎల్‌ఎస్‌పికి పంపి ఆ నీటిని ఒకటి, రెండు రోజులు నిలువ చేస్తే మున్నెల్లి చెరువుకు నీరు వచ్చే అవకాశముంది. ఒకతడి నీరు పారితే పంట మొత్తం గట్టెక్కే అవకాశం ఉంది. అధికారులు, ప్రభుత్వం కొద్దిమేర శ్రద్ధచూపి బ్రహ్మంసాగర్ నుంచి వెంటనే నీటిని విడుదల చేయడంతోపాటు ఎల్‌ఎస్‌పిలో పూర్తి నీటిమట్టం పడిపోకుండా నిలువ చేస్తే మున్నెల్లి చెరువుకు నీరు చేరే అవకాశముంది. లేకపోతే రైతుల ఆశలు అడుగంటినట్లే.
తెలుగు గంగ ఎస్‌ఈని కలిసిన డీసీ గోవిందరెడ్డి
వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర పాలక మండలి సభ్యులు, బద్వేలు నియోజకవర్గ ఇన్‌చార్జి డీసీ గోవిందరెడ్డి తెలుగు గంగ ఎస్‌ఈ యశస్విని, డీసీఈ కృష్ణయ్యను గురువారం కలిసి బి.కోడూరు మండలం మున్నెల్లి చెరువు కింద సాగులో ఉన్న వరిపంటకు నీరివ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం 500 ఎకరాల్లో వరిపంట పొట్ట, వెన్నుదశలో ఉందని పేర్కొన్నారు. నీరు ఇవ్వకపోతే పంటను వదిలేయాల్సిందేనని, అన్నదాతలకు ఇక్కట్లు తప్పవని ఆయన అధికారుల దృష్టికి తెచ్చారు. రైతులకు న్యాయం చేస్తామని ఈ సందర్భంగా అధికారులు హామీ ఇచ్చారు.
మున్నెళ్లికే చెందిన రైతు
కేశవులు. ఒకటిన్నర ఎకరాలో వరిపంటను సాగు చేశాడు. రూ.30వేలకు పైగా పెట్టుబడి పెట్టాడు. చెరువులో నీళ్లు అయిపోయాయి. వరి పంట ఎండు దశకు చేరుకుంది. పంటను కాపాడుకునేందుకు చేయని ప్రయత్నం లేదు.
చివరకు చేతులెత్తేశాడు.
ఒక తడి నీళ్లు పారితే గట్టెక్కే అవకాశం
Published Sat, Jan 11 2014 2:17 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
Advertisement