సాక్షి, అమరావతి: బాల్య దశలో విద్యార్థుల జ్ఞాన సముపార్జనకు అత్యంత కీలకమైన పాఠశాల వాతావరణం దీర్ఘకాలం పాటు వారికి దూరం కావడం భావి జీవితంలో భర్తీ చేయలేని లోటుగా మారింది. గత విద్యాసంవత్సరానికి సంబంధించి పాఠశాల, ఇంటర్ సిలబస్ దాదాపు పూర్తి అయినా డిగ్రీ తదితర ఉన్నత విద్య కోర్సుల సిలబస్, పరీక్షలు ఎక్కడివక్కడే నిలిచిపోవడం సమస్యగా మారింది. సాధారణంగా ఏప్రిల్ 23న విద్యాసంవత్సరం ముగిసి జూన్ మెదటి వారంలో పాఠశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా కోవిడ్ కారణంగా మార్చి 18న మూతపడ్డ స్కూళ్లు ఇప్పటివరకు తెరచుకోలేదు. దీంతో వివిధ స్థాయిల్లోని విద్యార్థుల మానసిక పరిస్థితిపై ఇది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులేమిటి? తదితర అంశాలపై..
పాఠశాలలు దీర్ఘకాలం మూతబడితే నష్టాలివీ..
► నిరంతర అభ్యసనం, సమగ్ర మూల్యాంకనానికి ఆటంకం.
► పూర్వజ్ఞానాన్ని స్థిరపర్చుకోవడంలో సమస్యలు.
► అసంపూర్తిగా సామర్థ్యాలు, జీవన నైపుణ్యాలు.
► మూల్యాంకనం లేకుండా పైతరగతులకు పంపడంతో ప్రతిభా ప్రదర్శనకు విద్యార్థులు దూరం.
► క్రీడలు, సైన్స్ ఫెయిర్, ఆర్ట్ ఎగ్జిబిషన్ లాంటి పోటీలు, ఆహ్లాదకర అనుభూతులు దూరం.
► ఐదు నెలలుగా బిక్కుబిక్కుమంటూ ఇంటివద్దనే గడుపుతుండటంతో మానసిక, శారీరక స్థితిపై ప్రభావం.
► చదువులపై అనాసక్తత.
► పోటీతత్వం, భవిష్యత్తు లక్ష్యాలపై అయోమయం.
నియామకాలు లేవు.. ఉద్వాసనే
► ‘సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ’ సంస్థ సర్వే ప్రకారం దేశంలో మార్చి నాటికి ఉద్యోగాల కొరత 8.4 శాతం ఉండగా ఏప్రిల్‌లో 23 శాతానికి పెరిగింది. పట్టణ ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుంటే ఇది 30.9 శాతంగా ఉందని సర్వే పేర్కొంటోంది.
► కొత్త నియామకాలు లేక గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో చుక్కెదురవుతోంది.
► డిగ్రీ, పీజీ తదితర కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే పరిస్థితులు లేకుండా పోయాయి.
► క్యాంపస్ సెలెక్షన్లు, నియామకాలు ఆగిపోయాయి. విద్యాసంస్థలు ఆర్థికంగా దెబ్బతినే పరిస్థితులు ఏర్పడ్డాయి.
► ప్రైవేట్ టీచర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. స్కూళ్లు, కాలేజీలు మూతపడడంతో యాజమాన్యాలు జీతాలివ్వకపోగా ఉన్నఫళంగా ఉద్వాసన పలుకుతున్నట్లు ఆవేదన వ్యక్తమవుతోంది.
భవిష్యత్తులో ఇబ్బందులు..
► నైపుణ్య రహిత, అల్ప నైపుణ్యాలతో కూడిన మానవ వనరులు. ఉత్పాదకత, ఉద్యోగాల్లో సామర్థ్యాలు చూపలేకపోవడంతో నష్టం.
► పరీక్షలు నిర్వహించకుండా సర్టిఫికెట్ల జారీతో విద్యా ప్రమాణాలపై సందేహాలు.
► ప్రపంచవ్యాప్తంగా 120 కోట్ల మంది విద్యార్థులపై ప్రభావం పడుతున్నట్లు ఐరాస అంచనా.
‘ఇంటర్’ సంకటం..
► భావి జీవితానికి టర్నింగ్ పాయింట్ లాంటి ఇంటర్ చదువుతుండగానే జేఈఈ, నీట్ లాం టి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు రూ.లక్షలు వెచ్చించి ప్రత్యేక శిక్షణ తీసుకున్న విద్యార్థుల్లో లాక్‌డౌన్ కారణంగా ఏకాగ్రత, మానసిక ధైర్యం సన్నగిల్లుతోంది.
► విద్యారంగ అనిశ్చితితో నిలిచిన ఇంటర్న్‌షిప్‌లు.
‘ఉన్నత’ సమస్యలు
► డిగ్రీ తదితర కోర్సుల సిలబస్ 75 శాతం కూడా çపూర్తి కాలేదు.
► యూజీసీ నిర్ణయాన్ని అనుసరించి డిగ్రీ, పీజీ ఫైనలియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నా కోవిడ్ నేపథ్యంలో అది సవాలుగానే మారింది. ఇతర విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసి తరువాత పరీక్షలు నిర్వహించే యోచనలో ఉన్నారు.
తొలి రాష్ట్రం ఏపీనే..
ప్రభుత్వం సప్తగిరి చానల్, ఆకాశవా ణి ద్వారా విద్యార్థులకు కొంతవరకైనా బోధన కొనసాగేలా ఏర్పా ట్లు చేసింది. దేశంలో ఇటువంటి ప్రయత్నం చేసిన తొలి రాష్ట్రం ఏపీనే. వర్కు బుక్స్ ఇవ్వడం గొప్ప విషయం. ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు బాగున్నాయి. చాలా వ్యవధి వచ్చినందున పిల్లలను తిరిగి స్కూళ్లకు రప్పించేందుకు కష్టపడాలి.
– విఠపు బాలసుబ్రహ్మణ్యం, పీడీఎఫ్ ఎమ్మెల్సీ
పని దినాలకు నష్టం..
నాలుగు నెలలుగా విద్యార్థులకు పాఠశాలతో సంబంధాలు తెగిపోయాయి. ఆన్‌లైన్, టీవీల ద్వారా పాఠాలు నేర్చుకునే అవకాశం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు ఉండదు. విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైతే పనిదినాలు నష్టపోయే ప్రమాదం ఉంది.
–కే.కులశేఖర్‌రెడ్డి, టీచర్, గార్లదిన్నె, అనంతపురం జిల్లా
విద్యార్థులపై తీవ్ర ప్రభావం ఉంటుంది
స్కూళ్లు ఎపుడు ప్రారంభిస్తారో తెలి యకపోవడం విద్యార్థుల మానసిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. వారిలో అసహనాన్ని పెంచుతుంది. సాధారణంగా పిల్లలు కదులుతూ ఉండడానికి ఇష్టపడతారు. ఆటపాటలతో అన్నీ నేర్చుకుంటారు. అవన్నీ కోల్పోవడం ఒత్తిడిని పెంచుతుంది. ఇక అన్నిటికన్నా పెద్ద ప్రమాదం ఆన్‌లైన్ క్లాసులు. ఇవి రెగ్యులర్ క్లాసులకు ప్రత్యామ్నాయం ఎంతమాత్రమూ కాదు. స్కూలు కేవలం విద్యార్జన కోసం మాత్రమే కాదు. సరదా, సంతో షం, స్నేహం, ఆటపాటలు.. మొత్తంగా జీవితాన్ని అ భ్యసించే స్థలం. ఆ లోటును భర్తీ చేయడం చాలా కష్టం.
– విశేష్, మానసిక నిపుణుడు, హైదరాబాద్
పనికి వెళ్లమంటున్నారు...
అమ్మానాన్న లేరు. అమ్మమ్మ, తాత య్య ఇంట్లో ఉండి చదువుకుంటు న్నా. బడి లేకపోవడంతో పనికి వెళ్లమంటున్నారు. ఉత్సాహంగా పదో తరగతిలో చేరదామనుకున్నా. పాఠశాలలు త్వరగా పునఃప్రారంభం కావాలి.
–మధు, విద్యార్థి, కల్లూరు, అనంతపురం జిల్లా
Comments
Please login to add a commentAdd a comment