
సంక్షేమ పథకాలు అర్హులకే అందాలి
తిరుపతి సిటీ: ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన పేదవారికే దక్కాలని నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా మంగళవారం స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని మహారాజపురంలో సంక్షేమపథకాల్లో అవకతవకలు జరుగుతున్నట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు వృద్ధాప్య పింఛన్లు అర్హులకు దక్కనీయకుండా అయినవారికి కట్టబెడుతున్నారని ఆమె తెలిపారు. ఈ విషయంలో అధికారులు నాయకులతో లాలూచీపడినట్లు స్పష్టమైతే కఠినంగా వ్యవహరిస్తానని పేర్కొన్నారు.
విజయపురం మండలం జెడ్పీటీసీ, ఎంపీటీసీల భర్తలు అధికారులను లొంగదీసుకుని సంక్షేమ పథకాలను నచ్చినవారికి అందిస్తున్నారని తనకు ఫిర్యాదులు అందాయని వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. ప్రతి మండలంలోను ఇదే పరిస్థితి ఉన్నట్టు బాధితులు తన దృష్టికి తెచ్చారని అన్నారు. అధికారులు విధులను సక్రమంగా నిర్వహించాలని లేనిపక్షంలో ఆందోళనకైనా దిగుతామని ఆమె హెచ్చరించారు.