కీలకంగా నదీజలాలు | Important rivers of simandhara | Sakshi
Sakshi News home page

కీలకంగా నదీజలాలు

Published Thu, Sep 5 2013 4:10 AM | Last Updated on Mon, Aug 13 2018 4:05 PM

Important rivers of simandhara

సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్ర విభజన నిర్ణయం రాయలసీమవాసులను  కలవరపాటుకు గురిచేస్తోంది. విశాలాంధ్ర కోసం గతంలో రాజధానిని త్యాగం చేసిన వీరి భవిష్యత్ అంధకారం కానుంది.  సాగునీరు దెవుడెరుగు తాగునీరు కూడా దుర్లభంగా మారనుంది.  వరద జలాలపై ప్రాజెక్టుల నిర్మాణం జరగడమే ఇందుకు  కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. జిల్లాకు ప్రాణప్రదమైన గాలేరి-నగరి సుజల స్రవంతి పథకం నిరుపయోగం కానుందని, తెలుగుగంగ ప్రాజెక్టు అలంకార ప్రాయమవుతుందని  వారు వాదిస్తున్నారు. బ్రిటీష్ కాలంలో రూపొందించిన కేసీ కెనాల్ సైతం చెప్పుకునేందుకు మాత్రమే పనికొస్తుందని అంటున్నారు. వెర సి  రాష్ట్ర విభజనలో రాజధానితో బాటు   నదీజలాలు కీలకంగా మారుతున్నాయి. విశాలాంధ్ర కోసం  రాజధానితో బాటు కృష్ణా-పెన్నార్ ప్రాజెక్టును రాయలసీమ కోల్పోయింది.
 
 అభివృద్ధి పట్ల దృష్టి పెట్టాల్సిన పాలకులు వివక్షత చూపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మాత్రమే ప్రాంతాలకతీతంగా అభివృద్ధి నెలకొంది.   వరద జలాల ఆధారంగా జిల్లాకు ప్రాణప్రదమైన గాలేరి-నగరి సుజల స్రవంతి పథకం రూపుదాల్చింది. 30రోజుల  వ్యవధిలో వరద జలాలను డ్రా చేసుకునేందుకు వీలుగా సాగునీటి ప్రాజెక్టులను రూపొందిం చారు. అందులో భాగంగా 9 రిజర్వాయర్ల  ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు సుమారు రూ. 12వేల కోట్లతో  పనులు చేశారు. తొలిదశ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇకపై వరద జలాల ఆధారంగా సాగునీరు అందుతుందని  భావించిన జిల్లా వాసులకు రాష్ట్ర విభజన గుదిబండగా మారనుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
 
 సాగునీరు మృగ్యమే..
 వైఎస్సార్ జిల్లాకు ఇప్పటి వరకూ కేసీ కెనాల్ ఏకైక సాగునీటి వనరు. బ్రిటీష్ హయాంలో రూపొందించిన ఈ కాలువ ఆయక ట్టు  సైతం ప్రశ్నార్థకంగా మారనుంది.  జిల్లాలో 92వేల ఎకరాల ఆయకట్టు ఉన్న కేసీ కెనాల్‌కు సుంకేశుల ప్రాజెక్టు నుంచి తుంగభద్ర జలాలపై హక్కు ఉన్నప్పటికీ విడుదలలో సాధ్యపడడం లేదు. సుంకేశుల నీరు 20సంవత్సరాలుగా కర్నూలు జిల్లా అవసరాలకే సరిపడుతోంది.  ఈపరిస్థితుల్లో పోతిరె డ్డిపాడు ప్రాజెక్టు ద్వారా లభిస్తున్న నీరు  కేసీ కెనాల్‌కు ఆధారంగా మారిందని ఆయకట్టుదారులు భావిస్తున్నారు. జిల్లాలో 1.5లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్న తెలుగుగంగ ప్రాజెక్టుకు ఇప్పటికీ నికర జలాలు లేవు. మద్రాసుకు తాగునీరు అందించేందుకు మాత్రమే ఈ ప్రాజెక్టుకు  17టీఎంసీల నికరజలాలు  కేటాయించారు. చెన్నైకి తాగునీటి ఇబ్బందులు ఏర్పడక పోవడంతో  నికరజలాలను  జిల్లా అవసరాలకు వాడుకుంటున్నారు. రాష్ట్ర విభజన అనివార్యమైతే వరద జలాలపై కూడా హక్కులు ఉండవనే భావన నెలకొంది.
 
 అంతరాష్ట్ర ప్రాజెక్టుగా రూపాంతరం..
 శ్రీశైలం ప్రాజెక్టు కింద  వరద జలాల ఆధారంగా నిరిస్తున్న  సాగునీటి ప్రాజెక్టులకు  నీటి లభ్యత  దుర్లభమే. రాష్ట్ర విభజన అనివార్యమైతే శ్రీశైలం ప్రాజెక్టు అంతర్‌రాష్ట్ర ప్రాజెక్టుగా రూపాంతరం చెందనుందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్‌రాష్ట్ర ప్రాజెక్టుగా మారితే  రెగ్యులేటరీ కమిషన్ చేతుల్లోకి  వెళుతుంది. ఫలితంగా కేటాయింపుల మేరకే కమిషన్ నీటి వాటాలను విడుదల చేస్తుంది.  32టీఎంసీల సామర్థ్యంతో జీఎన్‌ఎస్‌ఎస్, 42టీఎంసీల సామర్థ్యంతో హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ప్రాజెక్టులను రూపొందించారు. ఇవన్నీ వరద జలాల ఆధారంగానే నిర్మించిన ప్రాజెక్టులు. ఇప్పటికే ఈప్రాజెక్టులు  పూర్తయి ఉంటే నీటి కేటాయింపు వాటాల్లో హక్కు లభించి ఉండేది. ఇప్పటికీ నిర్మణదశలోనే ఉండడంతో ఈ సాగునీటి పథకాలు అలంకారప్రాయంగానే మిగిలిపోతాయని  సమైక్యవాదులు అభిప్రాయపడుతున్నారు.
 
 హైదరాబాద్‌ను కోల్పోవలసి వస్తుందనే..
 రాష్ట్ర ఆదాయంలో 50శాతం మేరకు ఖజానాకు అందిస్తున్న  హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో అంతర్భాగంగా విభజన చేస్తుండటాన్ని  ఈప్రాంతీయులు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. రాజధానిలో సుమారు 1300 ఐటీ కంపెనీలున్నాయని వాటిల్లో ప్రధానంగా రాష్ట్రంలోని యువతకు అవకాశం ఉంటోందని విశ్వసిస్తున్నారు. మనది అనుకున్న హైదరాబాద్ కాకుండా పోతున్నదనే భావన మెండుగా ఉంటోంది. ఈవిషయాన్ని విద్యార్థులకు నూరిపోయడంతో ఉద్యమం మరింత ఉగ్రరూపం దాల్చుతోంది. హైదరాబాద్ విడిపోతే సీమాంధ్ర ఉద్యోగులు సీనియారిటీని కోల్పోతారు. ఇవన్నీ ప్రజల మదిలో నాటుకపోయాయని పరిశీలకులు భావిస్తున్నారు.దీంతో  రాజకీయ నాయకులతో నిమిత్తం లేకుండా ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఏకమై ఉద్యమాన్ని నడుపుతున్నారు.
 
 స్వచ్ఛందంగా..
 తండోపతండాలుగా..
 సమైక్యాంధ్రప్రదేశ్‌గా కొనసాగించాలని, కాంగ్రెస్ నాయకత్వం రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఉద్యమాన్ని ప్రజలతోబాటు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ఉద్యమం చేస్తున్నారు.  ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రాజకీయాలకు అతీతంగా సాగిన ఉద్యమాలలో  ఇది  మూడవదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎన్టీరామారావును ముఖ్యమంత్రిగా బర్తరఫ్ చేసినప్పుడు, ఆతర్వాత సారా ఉద్యమం, ప్రస్తుతం సమైక్యంధ్రప్రదేశ్ ఉద్యమాన్ని ప్రజానీకం స్వచ్ఛందంగా చేపడుతున్నారని  పలువురు పేర్కొం టున్నారు.
 
   ప్రస్తుతం రాజకీయాలకు అతీతంగా సమైక్యరాష్ట్రం కోసం ఎలాంటి పిలుపునిచ్చినా  ప్రజలు విజయవంతం చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. నాన్ పొలిటికల్ జేఏసీ పిలుపు మేరకు కడపలో ‘ద్విలక్షగళ గర్జన’ విజయవంతం కావడాన్ని ఈసందర్భంగా పలువురు ఉదహరిస్తున్నారు. అలాగే బుధవారం జమ్మలమడుగులో లక్షమందితో నిర్వహించిన ‘జనగర్జన’కూడా విజయమంత మైంది. అదేవిధంగా ప్రొద్దుటూరులో గురువారం లక్షమందితో పొలికేక కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement