పండక్కిచంద్రన్న కానుక.. అందని పండేనా!
సంక్రాంతికి ఆరు రకాల దినుసులు ఉచితమన్న సర్కారు
ఆశగా ఎదురుచూస్తున్న తెల్లరంగు రేషన్‌కార్డుదారులు
పండుగ దగ్గర పడ్డా ఇంకా జిల్లాకు చేరని సరుకులుఅందరికీ అందడం అసాధ్యమే!
కాకినాడ : ‘ఆకేసి...పప్పేసి...నెయ్యేసి.. నిరుపేదల ఇళ్లలో నిజమైన సంక్రాంతిని చూడాలని ముఖ్యమంత్రి కలలు కన్నట్టు చెపుతున్నారు. ఇందుకోసం తలపెట్టిన గిఫ్ట్‌ప్యాక్‌కు ‘చంద్రన్న సంక్రాంతి కానుక’ అనే నామకరణం కూడా చేశారు. ఆ గిఫ్ట్‌ప్యాక్‌లో తెలుపురంగు రేషన్‌కార్డుదారులకు రూ.220 విలువచేసే ఆరు సరుకులు ఉచితంగా అందచేస్తామన్నారు. సంక్రాంతి పండుగ లోపు ఆరు సరుకులతో గిఫ్ట్ ప్యాక్ అందజేయాలని నిర్ణయించారు. ఆ ప్యాక్‌లో అరకేజీ కందిపప్పు, అరలీటర్ పామాయిల్, అరకేజీ బెల్లం, కేజీ శనగలు, కే జీ గోధుమపిండి, వంద గ్రాముల నెయ్యి పంపిణీ చేయాల్సి ఉంది. ఇదంతా ఉచితమే అని చంద్రబాబు ప్రకటించడంతో కార్డుదారులంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 2643 చౌకదుకాణాల పరిధిలో ఉన్న 15,19,406 మంది రేషన్ కార్డుదారులు చంద్రన్న కానుకతో ఈ పండుగ ప్రత్యేకంగా జరుపుకోవాలని ఉబలాటపడుతున్నారు.అయితే చంద్రన్న కానుకతో నిరుపేదలకు తమ ప్రభుత్వం ఉదారంగా సాయపడుతోందని ప్రజల్లోకి వెళ్లి గొప్పగా ప్రకటించుకుని వారి అభిమానం పొందాలన్న అధికారపార్టీ జిల్లా ప్రజాప్రతినిధుల ఆశలు కూడా ఫలించేలా లేవు.
కొన్ని సరుకులు పది శాతమే వచ్చాయి..
ఐదు రోజుల్లో సంక్రాంతి మొదలు కానుంది. ఆ లోపే గిఫ్ట్‌ప్యాక్‌లో సరుకులన్నీ రేషన్‌షాపులకు చేరవేయాలని ఉన్నతాధికారుల నుంచి జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు వచ్చాయి. మండలస్థాయిలో పౌరసరఫరాలశాఖ గోడౌన్‌ల నుంచి అన్ని రేషన్ షాపులకూ ఈ నెల 10 కల్లా గిఫ్ట్‌ప్యాక్‌లు చేరవేయాలి. కార్డుదారులకు ఆ సరుకుల పంపిణీ ప్రక్రియను 12వ తేదీకి పూర్తి చేయాలి. అంటే పండుగకు ఒక రోజు ముందుగానే చంద్రన్నకానుక అందచేయాలని నిర్దేశించారు. కానీ శుక్రవారం (9వ తేదీ) రాత్రికి కనీసం మండలస్థాయి గోడౌన్‌లకు కూడా పూర్తిగా ఆరు సరుకులూ చేరలేదు. సరుకులు ఎప్పుడు వస్తాయి, గోడౌన్‌ల నుంచి రేషన్‌షాపులకు ఎప్పుడు వెళతాయి, కార్డుదారులకు ఎప్పుడు చేరతాయో తెలియని అయోమయం నెలకొంది. ఈ విషయంలో పౌరసరఫరాల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గిఫ్ట్‌ప్యాక్ సరుకుల్లో ఏ ఒక్క సరుకూ నూరుశాతం జిల్లాకు రాలేదు. అయినా ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తదితరులు చంద్రన్నకానుకను కాకినాడ ఆనందభారతి గ్రౌండ్స్‌లో శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. జిల్లాకు కందిపప్పు 759.703 మెట్రిక్ టన్నులు, బెల్లం 759.703 టన్నులు, గోధుమపిండి 1519.406 టన్నులు, శనగలు 1519.406 టన్నులు, నెయ్యి 151.941 టన్నులు, పామాయిల్ 759.703 కిలో లీటర్లు కేటాయించారు. మూడు సరుకులు 10 శాతమే రాగా, మిగిలినవీ 40, 50, 60 శాతాల్లోపే వచ్చాయి. అవన్నీ వేయడానికి సంచులు అవసరమైన దానిలో 10 శాతం మించి రాలేదు. ఈ పరిస్థితుల్లో సంక్రాంతికి చంద్రన్నకానుక అందుకోవడం గగనంగానే కనిపిస్తోంది.
‘చంద్రన్న కానుక’ తూకంలో తరుగు
ముమ్మిడివరం: సంక్రాంతి సందర్భంగా ప్రవేశ పెట్టిన ‘చంద్రన్న కానుక’ సరుకుల తూకాలను శుక్రవారం తూనికల కొలతల జిల్లా ఇన్‌స్పెక్టర్ ఎన్.జనార్దనరావు తనిఖీ చేశారు. ముమ్మిడివరం మండల గోదాములో ఉంచిన సరుకుల తూకాలను పరిశీలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీ చేశామని, గోధుమ పిండి ప్యాకెట్ కిలో ఉండాల్సి ఉండగా కొన్నింటిలో 15 నుంచి 22 గ్రాముల వరకు తక్కువ ఉందని ఇన్‌స్పెక్టర్ తెలిపారు. గోధుమ పిండి మహరాష్ట్రకు చెందిన త్రిశూల్ కంపెనీకి చెందినది కాగా విశాఖకు చెందిన కేంద్రీయ బండారీ సంస్థ కాంట్రాక్టు పద్ధతిపై సరఫరా చేసిందన్నారు. ఆ సంస్థలపై కేసు నమోదు చేస్తామన్నారు.