తమ్ముళ్లకే జీర్ణం కాని బాబు’ మారుమాట | Impossible to to implement guarantees | Sakshi
Sakshi News home page

తమ్ముళ్లకే జీర్ణం కాని బాబు’ మారుమాట

Published Sun, Jun 7 2015 12:56 AM | Last Updated on Mon, Aug 13 2018 3:58 PM

Impossible to to implement guarantees

 (లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి ప్రతినిధి) :‘ఓడ ఎక్కేదాకా ఓడ మల్లన్న...ఓడ ఎక్కేశాక బోడి మల్లన్న’ అనే సామెత ముఖ్యమంత్రి చంద్రబాబు విషయంలో వాస్తవమని మరోసారి తేలిపోయింది. గద్దెనెక్కేందుకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు అసాధ్యమని గొల్లప్రోలు మండలం చేబ్రోలులో జన్మభూమి-మా ఊరు గ్రామసభ సాక్షిగా బాబు తేల్చి చెప్పడం ఈ వారం జిల్లాలో చర్చనీయాంశమైంది. అధికారం కోసం ఎడాపెడా హామీలు ఇచ్చేయడం, అమలుకు వచ్చేసరికి చేతులెత్తేయడం ‘బాబు’కు కొత్తేమీ కాదంటూ జిల్లావాసులు అంటున్నారు.
 
  రైతు, డ్వాక్రా రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి వంటి ఎన్నో హామీలు ఇచ్చిన బాబు ఏడాది పాలన ముగిసేసరికి వాటన్నింటి అమలు కష్టమనడం, అవన్నీ సమైక్యరాష్ట్రంలో ఇచ్చానని అడ్డంగా బొంకేయడం చివరికి ఆయన పార్టీ వారికే ఒకపట్టాన జీర్ణం కావడం లేదు. ఒకపక్క ఓటుకు నోటు వ్యవహారంలో  రేవంత్‌రెడ్డి  కటకటాలపాలై పార్టీ ప్రతిష్ట మసకబారగా, ఇచ్చిన హామీలపై బాబు జిల్లాలో మారు మాట్లాడటం ఈ వారం ప్రత్యేకతగా నిలిచింది. ఇచ్చిన హామీలు అమలుచేయని చంద్రబాబు సర్కార్‌పై ైవె ఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన సమరదీక్షకు పెద్దఎత్తున తరలివెళ్లడం ఆ పార్టీపైన, ప్రభుత్వంపైన పెల్లుబుకుతున్న వ్యతిరేకతకు అద్దం పట్టింది.
 
 ఖరీఫ్‌కు సన్నద్ధమవుతున్న రైతన్న
 ‘ఈ వేసవి హాట్ గురూ’ అంటూ జనానికి నరకం చూపించిన ఎండలు వారం చివర్లో తోకముడిచారుు. గరిష్టంగా 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన జిల్లాలో వడదెబ్బకు ప్రతి రోజు పదుల సంఖ్యలో జనం పిట్టల్లా రాలిపోయారు. నైరుతి ఆగమనసూచకంగా శుక్రవారం ఒక మోస్తరు వర్షాలు కురిశా. శనివారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు కురిసిన భారీ వర్షం ఒక్కసారిగా జిల్లావాసులను సేదతీర్చింది. గత ఏడాది అధికవర్షాలతో ఖరీఫ్ సీజన్‌ను జిల్లారైతులు నష్టపోయారు, ఈ ఏడాదైనా కలిసిరావాలని గంపెడాశతో సాగు సన్నాహకాల్లో నిమగ్నమయ్యారు.
 
 మోగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నగారా
 జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నగారా ఈ వారం మోగింది. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్‌లు, కౌన్సిలర్‌లు, ఎక్స్ అఫిషియో సభ్యులు ఓటర్లుగా ఉన్న ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యంను బరిలోకి దింపింది. చంద్రబాబు ఇచ్చిన హామీలో భాగంగా ఖర్చు లేకుండా ఎమ్మెల్సీ అయ్యే అవకాశాన్ని సుబ్రహ్మణ్యంకు దక్కకుండా చేసి కోట్ల ఖర్చుతో కూడుకున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి అభ్యర్థిగా ప్రకటించిందనే విమర్శ పార్టీలో బీసీల నుంచి వ్యక్తమవుతోంది. ఈ ఎన్నికల్లో ఓటర్ల తుది జాబితాను శనివారం విడుదల చేశారు. టీడీపీ అభ్యర్థిని ప్రకటించగా మిగిలిన పార్టీల పోటీపై స్పష్టత రావాల్సి ఉంది.
 
 రంపచోడవరం వద్ద గురువారం సంభవించిన ప్రమాదం సూరంపాలెం గ్రామంలో పెను విషాదాన్ని నింపింది. పెళ్లి వ్యాన్ బోల్తాపడ్డ సంఘటనలో గంగవరం మండలం సూరంపాలెంకు చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యూరు. మద్యం తాగి డ్రైవింగ్ చేయడమే గిరిజనులకు శాపమైంది. ఒక వ్యాన్‌లో 90 మందికి పైబడి ఎలా ఎక్కించుకు వెళుతున్నారనే ప్రశ్నకు రవాణా శాఖాధికారులే సమాధానం చెప్పాలి. నిబంధనల అమలులో అలసత్వం గిరిజనుల ప్రాణాలతో చెలగాటమాడటం తప్ప మరొకటి కాదని చెప్పొచ్చు. రోడ్ కం రైలు వంతెనపై రెండు నెలలు నిలిచినన రాకపోకలను శుక్రవారం పునరుద్ధరించడంతో గోదావరి జిల్లాల ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
 
 రాజమండ్రి-కొవ్వూరుల మధ్య ప్రయూణికులు ఇన్నాళ్లూ లాంచీలపై లేదా ధవళేశ్వరం బ్యారేజి మీదుగా, అధికారికంగా రాకపోకలు ప్రారంభం కాని కొత్త వంతెన మీదుగా ప్రయూణించి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా ఇచ్చిన హామీలపై చంద్రబాబు మాట మార్చిన వైనంపై జిల్లా నుంచి వారం చివర్లో శనివారం కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వంపై రణభేరిని మోగించింది. రాజమండ్రి సుబ్రహ్మణ్యమైదానం కేంద్రంగా ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు సమరశంఖం పూరించారు. దీంతో.. విభజన పాపాన్ని మూటగట్టుకుని అడ్రస్ గల్లంతైన కాంగ్రెస్ పునర్జీవనానికి రాజకీయాల్లో సెంటిమెంట్ జిల్లాగా పరిగణించే ‘తూర్పు’ నుంచి శ్రీకారం చుట్టినట్టయ్యింది. రణభేరి ఆ పార్టీకి ఎంత వరకు కలిసివస్తుందో వేచి చూడాల్సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement