ఈజిప్టు దేశంలో ఓ హత్య కేసులో జీవిత ఖైదు పడ్డ మహిళ వైఎస్సార్ జిల్లా కడపలోని కేంద్ర కారాగారంలో తన శిక్షను అనుభవించనుంది.
చిత్తూరు (అర్బన్): ఈజిప్టు దేశంలో ఓ హత్య కేసులో జీవిత ఖైదు పడ్డ మహిళ వైఎస్సార్ జిల్లా కడపలోని కేంద్ర కారాగారంలో తన శిక్షను అనుభవించనుంది. ఈజిప్టులో చేసిన హత్య కేసుకు సంబంధించి జీవిత ఖైదును భారత్‌లో అనుభవిస్తానని చెప్పడంతో అంగీకరించిన ఆ దేశ ప్రభుత్వం నిందితురాలిని ఇక్కడకు పంపించింది. చిత్తూరు జిల్లా కేవీ పల్లెకు చెందిన నాగమునెమ్మ ఈజిప్టులో ఓ హత్య చేయడంతో అక్కడ ఆమెకు జీవిత ఖైదు పడింది. అయితే భారత్– ఈజిప్టుల మధ్య కుదిరిన ఒప్పందాల్లో జైలు శిక్ష పడ్డ ఖైదీలు కోరితే వాళ్ల సొంత దేశంలో శిక్ష అనుభవించవచ్చనే నిబంధన ఉంది.
దీంతో నాగమునెమ్మ తన జైలు శిక్షను భారత్‌లో అనుభవిస్తానని చెప్పడంతో ఆమెను సోమవారం ఈజిప్టు రాజధాని కైరో నుంచి అక్కడి పోలీసులు విమానంలో ముంబైకి తీసుకొచ్చారు. ఎస్పీ శ్రీనివాస్ ఆదేశాల మేరకు మదనపల్లె డీఎస్పీ రాజేంద్రప్రసాద్‌కు ఈజిప్టు పోలీసులు నిందితురాలిని అప్పగించారు. అక్కడి నుంచి ఆమెను విమానంలో బెంగళూరుకు తీసుకొచ్చి అక్కడి నుంచి మదనపల్లెకు తరలించారు. నిందితురాలు తన జైలు శిక్షను వైఎస్సార్ జిల్లా కడపలోని కేంద్ర కారాగారంలో అనుభవించనుంది. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను మంగళవారం పోలీసుశాఖ వెల్లడించనుంది.