ఏడాదిలో కడపకు సమృద్ధిగా నీరు | In a year of abundant water to kadapa | Sakshi
Sakshi News home page

ఏడాదిలో కడపకు సమృద్ధిగా నీరు

Published Sat, May 9 2015 4:02 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

ఏడాదిలో కడపకు సమృద్ధిగా నీరు - Sakshi

ఏడాదిలో కడపకు సమృద్ధిగా నీరు

అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా గండికోట
జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి
సర్వరాయసాగర్ ప్రాజెక్టు పరిశీలన
ప్రాజెక్టుల స్థితిగతులపై అధికారులతో సమీక్ష
చదిపిరాళ్ల చెరువులో పూడికతీత పనులు ప్రారంభం
జనాల్లో ఉండకపోతే ఓట్లెలా వేస్తారంటూ నేతలకు బాబు చురక
తమ కష్టాలు తీర్చాలని సీఎంకు విన్నవించిన రైతులు

 
సాక్షి, కడప : ప్రస్తుతం పూర్తి కావలసిన దశలో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న గండికోట, వామికొండ, సర్వరాయసాగర్ ప్రాజెక్టులను త్వరలో పూర్తి చేసి ఏడాదిలోగా కడప వరకు సమృద్ధిగా నీళ్లు తీసుకుపోయేలా అధికారులు చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వీరపునాయునిపల్లె మండలంలోని సర్వరాయసాగర్ ప్రాజెక్టును శుకవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఆయన సందర్శించారు.

కట్టపై వాహనంలో వెళుతుండగా  ప్రాజెక్టు సామర్థ్యం, ఇతర వివరాలను కమలాపురం టీడీపీ ఇన్‌చార్జ్ పుత్తా నరసింహారెడ్డి సీఎంకు వివరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. జీఎన్‌ఎస్‌ఎస్, గండికోట, హంద్రీ-నీవా, అవుకు తదితర ప్రాజెక్టులకు సంబంధించిన మ్యాప్‌లను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

తమ్ముళ్లకు తలంటిన బాబు
 ప్రాజెక్టుల సమీక్ష మధ్యలో జిల్లా స్థాయి అధికారులంతా ఒకవైపు ఆశీనులై ఉండగా వేదికపైనున్న తమ్ముళ్లకు బాబు తలంటారు. ‘సీఎం రమేష్.. ఎన్ని చెరువులు పరిశీలించావ్.. ఢిల్లీలో ఉంటే ఎలా చూస్తావ్.. గాలిలో తిరుగుతుంటే ప్రయోజనం లేద’న్నారు. శని, ఆదివారాలు మాత్రమే తాను  వెళుతున్నానని ఎంపీ సీఎం రమేష్ తెలుపగా, ‘నిత్యం ప్రజలతో ఉంటేనే ఓట్లేయడం లేదు.. ఇలా అయితే ఎలా వేస్తారు.. అందుకే ఓడిపోతున్నాం.. ప్రభుత్వం ప్రత్యేకంగా నీరు-చెట్టు కార్యక్రమాన్ని ఇంతగా ప్రజల్లోకి తీసుకెళ్తుంటే మీరు పట్టించుకోకపోతే ఎలా’ అంటూ తమ్ముళ్లపై బాబు అసహనం వ్యక్తం చేశారు. ‘ఏమయ్యా మేడా..

నువ్వైనా వెళ్లావా.. ఎన్నిసార్లు వెళ్లావు..పరిస్థితి చూస్తే పెద్దగా వెళ్లినట్లు లేదు.. మంత్రి కిషోర్‌బాబు గారు.. మీరు ఎన్నిసార్లు కడపకు వచ్చారు.. చెరువులు ఏమైనా చూశారా.. సమీక్షలు ఏమైనా చేశారా.. డిప్యూటీ చైర్మన్ సతీష్ గారు.. మీరు పులివెందులలో ఎక్కడ వెళ్లారు.. ఎప్పుడు తిరిగారు..’ అని సీఎం అడిగారు. వెంటనే సతీష్ నాలుగు చెరువుల పేర్లు చెబుతుండగా, నియోజకవర్గంలో ఎన్ని చెరువులున్నాయని సీఎం ప్రశ్నించారు. సతీష్ సమాధానం చెప్పేలోపు మళ్లీ సీఎం మాట్లాడుతూ..

జిల్లాలో 1776 చెరువులు ఉన్నాయి.. మీరేమో ఎక్కడికీ వెళ్లడం లేదు. పైగా అడగడమైతే అధికారులను బాగా అడుగుతున్నావ్.. ఏమైనా అంటే బాధపడతారు.. ప్రజల్లోకి వెళ్లకుంటే ఏం ప్రయోజనం.. పనిచేయకపోతే అధికారులైనా ఒకటే.. నువ్వైనా ఒక్కటే... ప్రజల్లోకి వెళ్లడానికి ఏమైనా మండలి పదవి అడ్డొస్తుందా.. మాటలు కాదు.. చేతలు కావాలి.. మీ అందరి పనితీరు చూస్తుంటే 10 శాతం కూడా పాస్ కాలేదు. పూర్తి స్థాయిలో పనిచేస్తే తప్ప ఓట్లు వేయరు.. అందుకే ఓడిపోతున్నారు.. మిమ్మల్ని అనాలని కాదు.. హితవు చెబుతున్నా’నంటూ చురకలంటించారు. అధికారులందరి ముందు సీఎం అలా వ్యాఖ్యానించే సరికి నేతలు దిమ్మెర పోయారు.  

అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా  గండికోట
 చిత్తూరు జిల్లా నుంచి వస్తూ మధ్యలో కొండాపురం మండలంలోని గండికోట ప్రాజెక్టుపై ఏరియల్ సర్వే నిర్వహించారు. హెలికాఫ్టర్ నుంచే వామికొండ  రిజర్వాయర్‌ను పరిశీలిస్తూ సర్వరాయసాగర్ ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా గండికోట అద్భుతంగా కనిపిస్తోంది. దీన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం.. అద్బుతంగా ప్రణాళికలు రచించి పర్యాటకంగా పేరు తీసుకొస్తాం’ అని చెప్పారు. అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించారు.

వెంకట రమణ అనే రైతు మాట్లాడుతూ ‘సర్వరాయసాగర్ ప్రాజెక్టు కింద మా భూములు పోయాయి. కూలీనాలీ చేసుకుని బతుకుతున్న మమ్మల్ని కరెంటోళ్లు బెదిరిస్తున్నారు. కొందరు మోటారు బిగించుకుని నీరు వాడుకుంటుండంగా కరెంటోళ్ల బెదిరింపులు ఎక్కువయ్యాయి.  ఇలాగైతే మేమంతా కిరసనాయిల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటా’మన్నాడు. బెదిరించడం కరెక్టు కాదు.. ధైర్యంగా బ్రతకాలి.. చనిపోతామన్న మాట కూడా రాకూడదు అని సీఎం ధైర్యం చెప్పారు.

ఈ సమస్యను పరిష్కరించాలని పక్కనే ఉన్న కలెక్టర్ రమణకు సూచించారు. సమీపంలో ఉన్న చెరువు తెగిపోయి నీరు వృధాగా పోతోందని, మరమ్మతులు చేయించాలని మరో రైతు విజ్ఞప్తి చేయగా.. తప్పకుండా మరమ్మతులు చేయిస్తామని సీఎం హామీ ఇచ్చారు. అధికారుల సమీక్ష అనంతరం నీరు-చెట్టు కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు.

చదిపిరాళ్లలో చెరువు పనులు  ప్రారంభించిన సీఎం
 నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా కమలాపురం మండలం చదిపిరాళ్ల గ్రామ చెరువులో పూడికతీత పనులను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. చెరువులో ఉన్న పొక్లెయిన్ ఎక్కి చెరువు మట్టిని తీసి ట్రాక్టర్‌లో వేశారు. అనంతరం కమలాపురం చెరువు వద్దకు వెళ్లి అక్కడ కూడా పూడికతీత పనులను పరిశీలించారు.

 సీఎంకు ఘన స్వాగతం
  చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన సీఎం చంద్రబాబుకు సర్వరాయసాగర్ ప్రాజెక్టు వద్ద టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. మంత్రులు దేవినేని ఉమ, రావెల కిషోర్‌బాబు, మేడా మల్లికార్జునరెడ్డి, ఎమ్మెల్సీ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, సీఎం రమేష్, పుత్తా నరసింహారెడ్డి, వీరశివారెడ్డి, లింగారెడ్డి, వరదరాజులురెడ్డి, రమేష్‌రెడ్డి,  విజయమ్మ, విజయజ్యోతి, పులివెందుల రాంగోపాల్‌రెడ్డి, దుర్గాప్రసాద్, రామసుబ్బారెడ్డి, ఖలీల్‌బాష, అమీర్‌బాబు, గోవర్దన్‌రెడ్డి, పత్తిపాటి కుసుకుమారి, బ్రహ్మయ్య, విశ్వనాథనాయుడు, రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి తదితరులు సీఎంకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement