Sarvarayasagar Project
-
ఎట్టకేలకు సర్వరాయసాగర్‌కు నీరు విడుదల
కమలాపురం: వైఎస్సార్ జిల్లాలోని గండికోట రిజర్వాయర్ నుంచి సర్వరాయసాగర్‌కు ఎట్టకేలకు నీటిని విడుదల చేశారు. 150 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. గండికోట నుంచి సర్వరాయసాగర్‌కు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కమలాపురం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పాదయాత్ర చేపట్టిన విషయం విదితమే. ఆయన డిమాండ్‌కు స్పందించిన కలెక్టర్ గండికోట నుంచి సర్వరాయసాగర్‌కు నీటిని విడుదల చేయించారు. -
ఇది ప్రజా విజయం
కడప సెవెన్‌రోడ్స్ : గాలేరు–నగరిలో అంతర్భాగమైన సర్వరాయసాగర్‌కు ఈనెల 25 నుంచి నీరు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం ప్రజా విజయమని కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. నీటి విడుదల కోరుతూ సర్వరాయసాగర్ నుంచి ఆయన చేపట్టిన పాదయాత్ర సోమవారం ముగిసింది. వందలాది మంది రైతులు, వైఎస్సార్ సీపీ శ్రేణులు పాల్గొన్నారు. గండికోటకు 4500 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండంతో సర్వరాయసాగర్‌కు నీరు విడుదల చేయాలని తాము ప్రభుత్వాన్ని కోరామన్నారు. దీంతో తొలుత కలెక్టర్, ప్రాజెక్టు ఇంజినీరింగ్ అధికారులు నీరు విడుదల చేశారన్నారు. అయితే కాంట్రాక్టర్ తనకు ఆరు కోట్ల రూపాయల మామూళ్లు ఇవ్వలేదనే దాంతో ఓ టీడీపీ నేత మంత్రి ద్వారా ఒత్తిడి చేయించి నీటి విడుదలను ఆపించారని ఆరోపించారు. దీంతో తాను పాదయాత్ర చేపట్టాల్సి వచ్చిందని, ప్రజల్లో వచ్చిన అపూర్వ స్పందనకు భయపడ్డ ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చి నీటి విడుదలకు అంగీకరించిందని తెలిపారు. వీఎన్ పల్లె మండలంలో 1200 అడుగుల్లో భూగర్బజలం ఉందన్నారు. చీనీ చెట్లు ఎండిపోతున్నాయని చెప్పారు. రిజర్వాయర్‌లో నీరు నింపితే భూగర్బ జలాలు పెరిగి పంటలు రక్షించుకోవచ్చన్నారు. నీళ్లు వచ్చే వరకు ప్రభుత్వం మాటలు నమ్మాల్సిన పని లేదన్నారు. మాట తప్పితే కలెక్టరేట్‌ను దిగ్బంధిస్తామని, జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు హోరెతిస్తామని హెచ్చరించారు. జగన్ ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరంలోనే గాలేరు–నగరి పూర్తి చేసి కమలాపురం నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. కరువుకు నిలయమైన జిల్లాను కోస్తా లాగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో 250 కిలోమీటర్ల దూరంలోని కృష్ణా నీటిని వైఎస్ తీసుకొచ్చారన్నారు. గాలేరు–నగరికి రూ. 4800 కోట్లు కేటాయించి 85 శాతం పనులు పూర్తి చేయించిన ఘనత ఆయనదేనని కొనియాడారు. ఆయన మృతి చెందాక ఈ పదేళ్ల కాలంలో ప్రభుత్వాలేవి ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేవలం ఉద్యోగుల జీతాల కోసం మాత్రమే చంద్రబాబు బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నారని దుయ్యబట్టారు. మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పోరాట పటిమ వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంత శాశ్వత సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఇదే ఉత్సాహంతో ప్రజా సమస్యలపై ఉద్యమించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ సర్వరాయసాగర్‌కు నీరివ్వాలన్న కోరిక అసాధ్యమైనదేమి కాదన్నారు. నీరిస్తే ప్రజలకు వైఎస్ గుర్తొస్తాడనే ఉద్దేశంతోనే ఆపేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అమరావతి తప్ప రైతులు పట్టడం లేదన్నారు. పోలవరం కాలువలను ఏనాడో పూర్తి చేసింది వైఎస్సారేనని అన్నారు. తాను, దివంగత మంత్రి బిజివేముల వీరారెడ్డి కలిసి తెలుగుగంగను పూర్తి చేయాలని కోరగా, నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు డబ్బులు ఎక్కడున్నాయంటూ ప్రశ్నించారన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాల పట్ల ఆయనకు ఏనాడూ చిత్తశుద్ధి లేదన్నారు. కడప ఎమ్మెల్యే అంజద్‌బాష మాట్లాడుతూ పాదయాత్రతో ప్రభుత్వానికి కనువిప్పు కలిగిందని, ఎట్టకేలకు దిగొచ్చి సర్వరాయసాగర్‌కు నీరిస్తామని ప్రకటించిందన్నారు. గండికోటలో పుష్కలంగా నీరున్నప్పటికీ సర్వరాయసాగర్ కోసం పోరాటాలు చేయాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. పోలవరం, పట్టిసీమ, పురుషోత్తంపట్నం రిజర్వాయర్లలో ముఖ్యమంత్రి కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు. పట్టిసీమ, పురుషోత్తంపట్నంపై ఖర్చు చేసిన డబ్బును పోలవరంపై చేసి ఉంటే రాయలసీమకు నీరొచ్చి ఉండేదని చెప్పారు. సభకు అధ్యక్షత వహించిన మేయర్ సురేష్‌బాబు మాట్లాడుతూ సీమ సాగునీటి ప్రాజెక్టుల కోసం వైఎస్ ఎన్నో ఉద్యమాలు నిర్వహించారన్నారు. 2004లో అధికారంలోకి రాగానే జలయజ్ఞం చేపట్టారన్నారు. పుష్కలంగా నిధులు కేటాయించి పనులను పరుగులెత్తించారన్నారు. ప్రస్తుతం గండికోటలో 8 టీఎంసీలు నిల్వ ఉన్నప్పటికీ ఫేజ్–1లో ఉన్న సర్వరాయసాగర్‌కు నీరు ఇవ్వకపోవడం దారుణమన్నారు.పాదయాత్ర ఫలితంగానే ప్రభుత్వం నీటి విడుదలపై ప్రకటన చేసిందన్నారు. రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి మాట్లాడుతూ బాబు అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచినప్పటికీ ప్రాజెక్టుల పనుల్లో ప్రగతి లేదన్నారు. వైఎస్ హయాంలో 85 శాతం పనులు పూర్తయ్యాయని, మిగతా 15 శాతం పనులు ఈ పదేళ్ల కాలంలో ప్రభుత్వాలు చేసిన పాపాన పోలేదని తూర్పారబట్టారు. వైఎస్సార్ సీపీకి పేరొస్తుందనే పుత్తా నరసింహారెడ్డి నీటి విడుదలను ఆపు చేయించారన్నారు. వైఎస్సార్ సీపీని విమర్శించే అర్హత టీడీపీ నేతలకు లేదన్నారు. కలెక్టర్ ప్రకటించిన విధంగా నీరు విడుదల కాకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. నీటి విడుదల ఆగదు తాము ప్రకటించిన విధంగా ఈనెల 25వ తేది నుంచి సర్వరాయసాగర్‌కు 0.29 టీఎంసీల నీరు విడుదల చేస్తామని, ఇది ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆగదని తనకు వినతిపత్రం అందజేసిన వైఎస్సార్ సీపీ నాయకులకు కలెక్టర్ బాబూరావునాయుడు స్పష్టం చేశారు. సర్వరాయసాగర్ గేట్లు, ఇతర చిన్నచిన్న పనులు పెండింగ్‌లో ఉండడం, నాణ్యతపై కొన్ని ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వాన్ని నివేదించామన్నారు. దీంతో నిపుణుల కమిటీని ప్రభుత్వం పంపిందన్నారు. కమిటీ ఇచ్చిన నివేదికను ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రులు దేవినేని ఉమ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిలు పరిశీలించి నీటి విడుదలకు ఆదేశించారన్నారు. కనుక నీటి విడుదల ఆగే ప్రశ్నే లేదన్నారు. ఇదే కాకుండా జిల్లాకు మరో 10 టీఎంసీల నీరు రానున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ప్రసాద్‌రెడ్డి, పార్టీ నాయకులు దేవుడు, సుధాకర్‌రెడ్డి, సునీల్‌కుమార్, వినోద్‌కుమార్, నిత్యానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పాదయాత్ర
వైఎస్సార్ జిల్లా : నాలుగు రోజులుగా సర్వరాయసాగర్ నీటి కోసం 64 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన రవీంద్రనాథ్ రెడ్డి సోమవారం తన పాదయాత్రను ముగించారు. ఈ నెల 25న నీటిని విడుదల చేస్తానని జిల్లా కలెక్టర్ హామీ ఇవ్వడంతో ముందుగా ప్రకటించిన దీక్షను వాయిదా వేశారు. ఒకవేళ 25న నీరు ఇవ్వకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని రవీంద్రనాథ్ రెడ్డి హెచ్చరించారు. కడప కలెక్టరేట్ వద్ద రైతులతో కలిసి మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, కడప, రాజంపేట పార్లమెంటు అధ్యక్షులు సురేష్ బాబు, అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, అంజాద్ బాషా తదీతరులు కూడా పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి పాదయాత్ర
కడప:గండికోట ప్రాజెక్టు నుంచి ఒక టీఎంసీ నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి సర్వరాయసాగర్ నుంచి పాదయాత్ర చేపట్టారు. ఈయన పాదయాత్రకు కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా, మేయర్ సురేష్‌బాబులు సంఘీభావం తెలిపారు. ప్రాజెక్టు నుంచి మూడు రోజులపాటు పాదయాత్ర కొనసాగనున్నది. ఇతర జిల్లాల్లో అన్ని పార్టీల నాయకులు నీళ్ల కోసం పోరాడుతుంటే ఇక్కడ మాత్రం అధికార పార్టీ నాయకులే అడ్డుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్ర ముగిసేలోగా నీటిని విడుదల చేయకపోతే కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్ష చేపడతామని రవీంద్రనాథ్‌రెడ్డి హెచ్చరించారు. -
ఏడాదిలో కడపకు సమృద్ధిగా నీరు
అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా గండికోట జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి సర్వరాయసాగర్ ప్రాజెక్టు పరిశీలన ప్రాజెక్టుల స్థితిగతులపై అధికారులతో సమీక్ష చదిపిరాళ్ల చెరువులో పూడికతీత పనులు ప్రారంభం జనాల్లో ఉండకపోతే ఓట్లెలా వేస్తారంటూ నేతలకు బాబు చురక తమ కష్టాలు తీర్చాలని సీఎంకు విన్నవించిన రైతులు సాక్షి, కడప : ప్రస్తుతం పూర్తి కావలసిన దశలో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న గండికోట, వామికొండ, సర్వరాయసాగర్ ప్రాజెక్టులను త్వరలో పూర్తి చేసి ఏడాదిలోగా కడప వరకు సమృద్ధిగా నీళ్లు తీసుకుపోయేలా అధికారులు చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వీరపునాయునిపల్లె మండలంలోని సర్వరాయసాగర్ ప్రాజెక్టును శుకవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఆయన సందర్శించారు. కట్టపై వాహనంలో వెళుతుండగా ప్రాజెక్టు సామర్థ్యం, ఇతర వివరాలను కమలాపురం టీడీపీ ఇన్చార్జ్ పుత్తా నరసింహారెడ్డి సీఎంకు వివరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. జీఎన్ఎస్ఎస్, గండికోట, హంద్రీ-నీవా, అవుకు తదితర ప్రాజెక్టులకు సంబంధించిన మ్యాప్‌లను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. తమ్ముళ్లకు తలంటిన బాబు ప్రాజెక్టుల సమీక్ష మధ్యలో జిల్లా స్థాయి అధికారులంతా ఒకవైపు ఆశీనులై ఉండగా వేదికపైనున్న తమ్ముళ్లకు బాబు తలంటారు. ‘సీఎం రమేష్.. ఎన్ని చెరువులు పరిశీలించావ్.. ఢిల్లీలో ఉంటే ఎలా చూస్తావ్.. గాలిలో తిరుగుతుంటే ప్రయోజనం లేద’న్నారు. శని, ఆదివారాలు మాత్రమే తాను వెళుతున్నానని ఎంపీ సీఎం రమేష్ తెలుపగా, ‘నిత్యం ప్రజలతో ఉంటేనే ఓట్లేయడం లేదు.. ఇలా అయితే ఎలా వేస్తారు.. అందుకే ఓడిపోతున్నాం.. ప్రభుత్వం ప్రత్యేకంగా నీరు-చెట్టు కార్యక్రమాన్ని ఇంతగా ప్రజల్లోకి తీసుకెళ్తుంటే మీరు పట్టించుకోకపోతే ఎలా’ అంటూ తమ్ముళ్లపై బాబు అసహనం వ్యక్తం చేశారు. ‘ఏమయ్యా మేడా.. నువ్వైనా వెళ్లావా.. ఎన్నిసార్లు వెళ్లావు..పరిస్థితి చూస్తే పెద్దగా వెళ్లినట్లు లేదు.. మంత్రి కిషోర్‌బాబు గారు.. మీరు ఎన్నిసార్లు కడపకు వచ్చారు.. చెరువులు ఏమైనా చూశారా.. సమీక్షలు ఏమైనా చేశారా.. డిప్యూటీ చైర్మన్ సతీష్ గారు.. మీరు పులివెందులలో ఎక్కడ వెళ్లారు.. ఎప్పుడు తిరిగారు..’ అని సీఎం అడిగారు. వెంటనే సతీష్ నాలుగు చెరువుల పేర్లు చెబుతుండగా, నియోజకవర్గంలో ఎన్ని చెరువులున్నాయని సీఎం ప్రశ్నించారు. సతీష్ సమాధానం చెప్పేలోపు మళ్లీ సీఎం మాట్లాడుతూ.. జిల్లాలో 1776 చెరువులు ఉన్నాయి.. మీరేమో ఎక్కడికీ వెళ్లడం లేదు. పైగా అడగడమైతే అధికారులను బాగా అడుగుతున్నావ్.. ఏమైనా అంటే బాధపడతారు.. ప్రజల్లోకి వెళ్లకుంటే ఏం ప్రయోజనం.. పనిచేయకపోతే అధికారులైనా ఒకటే.. నువ్వైనా ఒక్కటే... ప్రజల్లోకి వెళ్లడానికి ఏమైనా మండలి పదవి అడ్డొస్తుందా.. మాటలు కాదు.. చేతలు కావాలి.. మీ అందరి పనితీరు చూస్తుంటే 10 శాతం కూడా పాస్ కాలేదు. పూర్తి స్థాయిలో పనిచేస్తే తప్ప ఓట్లు వేయరు.. అందుకే ఓడిపోతున్నారు.. మిమ్మల్ని అనాలని కాదు.. హితవు చెబుతున్నా’నంటూ చురకలంటించారు. అధికారులందరి ముందు సీఎం అలా వ్యాఖ్యానించే సరికి నేతలు దిమ్మెర పోయారు. అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా గండికోట చిత్తూరు జిల్లా నుంచి వస్తూ మధ్యలో కొండాపురం మండలంలోని గండికోట ప్రాజెక్టుపై ఏరియల్ సర్వే నిర్వహించారు. హెలికాఫ్టర్ నుంచే వామికొండ రిజర్వాయర్‌ను పరిశీలిస్తూ సర్వరాయసాగర్ ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా గండికోట అద్భుతంగా కనిపిస్తోంది. దీన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం.. అద్బుతంగా ప్రణాళికలు రచించి పర్యాటకంగా పేరు తీసుకొస్తాం’ అని చెప్పారు. అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించారు. వెంకట రమణ అనే రైతు మాట్లాడుతూ ‘సర్వరాయసాగర్ ప్రాజెక్టు కింద మా భూములు పోయాయి. కూలీనాలీ చేసుకుని బతుకుతున్న మమ్మల్ని కరెంటోళ్లు బెదిరిస్తున్నారు. కొందరు మోటారు బిగించుకుని నీరు వాడుకుంటుండంగా కరెంటోళ్ల బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఇలాగైతే మేమంతా కిరసనాయిల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటా’మన్నాడు. బెదిరించడం కరెక్టు కాదు.. ధైర్యంగా బ్రతకాలి.. చనిపోతామన్న మాట కూడా రాకూడదు అని సీఎం ధైర్యం చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించాలని పక్కనే ఉన్న కలెక్టర్ రమణకు సూచించారు. సమీపంలో ఉన్న చెరువు తెగిపోయి నీరు వృధాగా పోతోందని, మరమ్మతులు చేయించాలని మరో రైతు విజ్ఞప్తి చేయగా.. తప్పకుండా మరమ్మతులు చేయిస్తామని సీఎం హామీ ఇచ్చారు. అధికారుల సమీక్ష అనంతరం నీరు-చెట్టు కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. చదిపిరాళ్లలో చెరువు పనులు ప్రారంభించిన సీఎం నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా కమలాపురం మండలం చదిపిరాళ్ల గ్రామ చెరువులో పూడికతీత పనులను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. చెరువులో ఉన్న పొక్లెయిన్ ఎక్కి చెరువు మట్టిని తీసి ట్రాక్టర్లో వేశారు. అనంతరం కమలాపురం చెరువు వద్దకు వెళ్లి అక్కడ కూడా పూడికతీత పనులను పరిశీలించారు. సీఎంకు ఘన స్వాగతం చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన సీఎం చంద్రబాబుకు సర్వరాయసాగర్ ప్రాజెక్టు వద్ద టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. మంత్రులు దేవినేని ఉమ, రావెల కిషోర్‌బాబు, మేడా మల్లికార్జునరెడ్డి, ఎమ్మెల్సీ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, సీఎం రమేష్, పుత్తా నరసింహారెడ్డి, వీరశివారెడ్డి, లింగారెడ్డి, వరదరాజులురెడ్డి, రమేష్‌రెడ్డి, విజయమ్మ, విజయజ్యోతి, పులివెందుల రాంగోపాల్‌రెడ్డి, దుర్గాప్రసాద్, రామసుబ్బారెడ్డి, ఖలీల్‌బాష, అమీర్‌బాబు, గోవర్దన్‌రెడ్డి, పత్తిపాటి కుసుకుమారి, బ్రహ్మయ్య, విశ్వనాథనాయుడు, రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి తదితరులు సీఎంకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.