ఇది ప్రజా విజయం | sarvaraya sagar project release water | Sakshi
Sakshi News home page

ఇది ప్రజా విజయం

Published Tue, Dec 19 2017 7:14 AM | Last Updated on Tue, Dec 19 2017 7:16 AM

sarvaraya sagar project  release water - Sakshi

కడప సెవెన్‌రోడ్స్‌ : గాలేరు–నగరిలో అంతర్భాగమైన సర్వరాయసాగర్‌కు ఈనెల 25 నుంచి నీరు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం ప్రజా విజయమని కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. నీటి విడుదల కోరుతూ సర్వరాయసాగర్‌ నుంచి ఆయన చేపట్టిన పాదయాత్ర సోమవారం ముగిసింది. వందలాది మంది రైతులు, వైఎస్సార్‌ సీపీ శ్రేణులు పాల్గొన్నారు. గండికోటకు 4500 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండంతో సర్వరాయసాగర్‌కు నీరు విడుదల చేయాలని తాము ప్రభుత్వాన్ని కోరామన్నారు. దీంతో తొలుత కలెక్టర్, ప్రాజెక్టు ఇంజినీరింగ్‌ అధికారులు నీరు విడుదల చేశారన్నారు. అయితే కాంట్రాక్టర్‌ తనకు ఆరు కోట్ల రూపాయల మామూళ్లు ఇవ్వలేదనే దాంతో ఓ టీడీపీ నేత మంత్రి ద్వారా ఒత్తిడి చేయించి నీటి విడుదలను ఆపించారని ఆరోపించారు. దీంతో తాను పాదయాత్ర చేపట్టాల్సి వచ్చిందని, ప్రజల్లో వచ్చిన అపూర్వ స్పందనకు భయపడ్డ ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చి నీటి విడుదలకు అంగీకరించిందని తెలిపారు. వీఎన్‌ పల్లె మండలంలో 1200 అడుగుల్లో భూగర్బజలం ఉందన్నారు.

 చీనీ చెట్లు ఎండిపోతున్నాయని చెప్పారు. రిజర్వాయర్‌లో నీరు నింపితే భూగర్బ జలాలు పెరిగి పంటలు రక్షించుకోవచ్చన్నారు. నీళ్లు వచ్చే వరకు ప్రభుత్వం మాటలు నమ్మాల్సిన పని లేదన్నారు. మాట తప్పితే  కలెక్టరేట్‌ను దిగ్బంధిస్తామని, జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు హోరెతిస్తామని హెచ్చరించారు. జగన్‌ ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరంలోనే గాలేరు–నగరి పూర్తి చేసి కమలాపురం నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. కరువుకు నిలయమైన జిల్లాను కోస్తా లాగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో 250 కిలోమీటర్ల దూరంలోని కృష్ణా నీటిని వైఎస్‌ తీసుకొచ్చారన్నారు. గాలేరు–నగరికి రూ. 4800 కోట్లు కేటాయించి 85 శాతం పనులు పూర్తి చేయించిన ఘనత ఆయనదేనని కొనియాడారు. ఆయన మృతి చెందాక ఈ పదేళ్ల కాలంలో ప్రభుత్వాలేవి ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేవలం ఉద్యోగుల జీతాల కోసం మాత్రమే చంద్రబాబు బడ్జెట్‌ కేటాయింపులు చేస్తున్నారని దుయ్యబట్టారు.

 మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పోరాట పటిమ వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంత శాశ్వత సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఇదే ఉత్సాహంతో ప్రజా సమస్యలపై ఉద్యమించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ సర్వరాయసాగర్‌కు నీరివ్వాలన్న కోరిక అసాధ్యమైనదేమి కాదన్నారు. నీరిస్తే ప్రజలకు వైఎస్‌ గుర్తొస్తాడనే ఉద్దేశంతోనే ఆపేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అమరావతి తప్ప రైతులు పట్టడం లేదన్నారు. పోలవరం కాలువలను ఏనాడో పూర్తి చేసింది వైఎస్సారేనని అన్నారు. తాను, దివంగత మంత్రి బిజివేముల వీరారెడ్డి కలిసి తెలుగుగంగను పూర్తి చేయాలని కోరగా, నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు డబ్బులు ఎక్కడున్నాయంటూ ప్రశ్నించారన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాల పట్ల ఆయనకు ఏనాడూ చిత్తశుద్ధి లేదన్నారు.

కడప ఎమ్మెల్యే అంజద్‌బాష మాట్లాడుతూ పాదయాత్రతో ప్రభుత్వానికి కనువిప్పు కలిగిందని, ఎట్టకేలకు దిగొచ్చి సర్వరాయసాగర్‌కు నీరిస్తామని ప్రకటించిందన్నారు. గండికోటలో పుష్కలంగా నీరున్నప్పటికీ సర్వరాయసాగర్‌ కోసం పోరాటాలు చేయాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. పోలవరం, పట్టిసీమ, పురుషోత్తంపట్నం రిజర్వాయర్లలో ముఖ్యమంత్రి కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు. పట్టిసీమ, పురుషోత్తంపట్నంపై ఖర్చు చేసిన డబ్బును పోలవరంపై చేసి ఉంటే రాయలసీమకు నీరొచ్చి ఉండేదని చెప్పారు. సభకు అధ్యక్షత వహించిన మేయర్‌ సురేష్‌బాబు మాట్లాడుతూ సీమ సాగునీటి ప్రాజెక్టుల కోసం వైఎస్‌ ఎన్నో ఉద్యమాలు నిర్వహించారన్నారు. 2004లో అధికారంలోకి రాగానే జలయజ్ఞం  చేపట్టారన్నారు. పుష్కలంగా నిధులు కేటాయించి పనులను పరుగులెత్తించారన్నారు. ప్రస్తుతం గండికోటలో 8 టీఎంసీలు నిల్వ ఉన్నప్పటికీ ఫేజ్‌–1లో ఉన్న సర్వరాయసాగర్‌కు నీరు ఇవ్వకపోవడం దారుణమన్నారు.పాదయాత్ర ఫలితంగానే ప్రభుత్వం నీటి విడుదలపై ప్రకటన చేసిందన్నారు.

రాజంపేట పార్లమెంటరీ జిల్లా  అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి మాట్లాడుతూ బాబు అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచినప్పటికీ ప్రాజెక్టుల పనుల్లో ప్రగతి లేదన్నారు. వైఎస్‌ హయాంలో 85 శాతం పనులు పూర్తయ్యాయని, మిగతా 15 శాతం పనులు ఈ పదేళ్ల కాలంలో ప్రభుత్వాలు చేసిన పాపాన పోలేదని తూర్పారబట్టారు. వైఎస్సార్‌ సీపీకి పేరొస్తుందనే  పుత్తా నరసింహారెడ్డి నీటి విడుదలను ఆపు చేయించారన్నారు. వైఎస్సార్‌ సీపీని విమర్శించే అర్హత టీడీపీ నేతలకు లేదన్నారు. కలెక్టర్‌ ప్రకటించిన విధంగా నీరు విడుదల కాకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.

నీటి విడుదల ఆగదు
 తాము ప్రకటించిన విధంగా ఈనెల 25వ తేది నుంచి సర్వరాయసాగర్‌కు 0.29 టీఎంసీల నీరు విడుదల చేస్తామని, ఇది ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆగదని తనకు వినతిపత్రం అందజేసిన వైఎస్సార్‌ సీపీ నాయకులకు కలెక్టర్‌ బాబూరావునాయుడు స్పష్టం చేశారు. సర్వరాయసాగర్‌ గేట్లు, ఇతర చిన్నచిన్న పనులు పెండింగ్‌లో ఉండడం, నాణ్యతపై కొన్ని ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వాన్ని నివేదించామన్నారు. దీంతో నిపుణుల కమిటీని ప్రభుత్వం పంపిందన్నారు. కమిటీ ఇచ్చిన నివేదికను ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రులు దేవినేని ఉమ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిలు పరిశీలించి నీటి విడుదలకు ఆదేశించారన్నారు. కనుక నీటి విడుదల ఆగే ప్రశ్నే లేదన్నారు. ఇదే కాకుండా జిల్లాకు మరో 10 టీఎంసీల నీరు రానున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ప్రసాద్‌రెడ్డి, పార్టీ నాయకులు దేవుడు, సుధాకర్‌రెడ్డి, సునీల్‌కుమార్, వినోద్‌కుమార్, నిత్యానందరెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement