మోటార్లు ఆన్ చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే విజయుడు
నీళ్లు రాకపోవడంతో కాంగ్రెస్ నేత సంపత్‌కుమార్ ఆఫ్ చేశారంటూ నిరసన
ప్రతిగా ఆర్డీఎస్ కెనాల్ వద్ద సంపత్‌కుమార్ ధర్నా
ఎమ్మెల్యేని అరెస్టు చేసి..మాజీ ఎమ్మెల్యేను అడ్డుకున్న పోలీసులు
రాజోళి/ శాంతిగనర్: జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలంలోని తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని విడుదల చేసే క్రమంలో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. బీఆర్‌ఎస్‌కి చెందిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఏఐసీసీ నేత, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ మధ్య వివాదం ఏర్పడి పోటాపోటీగా ఆందోళనకు దిగారు. జిల్లాలోని ఆర్డీఎస్ ఆయకట్టుకు నీరందించేందుకు తుంగభద్ర నదిపై నిర్మించిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా ప్రస్తుతం నీరు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు ఉదయం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు తుమ్మిళ్లకు వెళ్లి మోటార్లు ఆన్ చేసి, పూజలు చేసేందుకు డీ–23 కెనాల్ వద్దకు వెళ్లారు. అనంతరం ఏఐసీసీ నేత, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ తుమ్మిళ్ల వద్దకు వచ్చారు.
అయితే తాను మోటార్ ఆన్ చేసినప్పటికీ కెనాల్‌లో నీరు విడుదల కాలేదని, దీనికి సంపత్‌కుమారే కారణమని ఎమ్మెల్యే విజయుడు ఆరోపించి, ఆందోళన చేస్తూ బైఠాయించారు. దీంతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఎమ్మెల్యేగా తాను ప్రోటోకాల్ ప్రకారమే నీటిని విడుదల చేసేందుకు వచ్చానని, తాను ఆన్ చేసిన తర్వాత మళ్లీ ఆయన ఏ హోదాలో ఆఫ్ చేస్తారని, వెంటనే సంపత్ కుమార్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నీటిని విడుదల చేసేదాకా అక్కడి నుంచి వెళ్లనని తేలి్చచెప్పారు. పోలీసులు ఎంతసర్ది చెప్పినా వినలేదు.
మరోవైపు తుమ్మిళ్ల నుంచి డీ–23కి కాంగ్రెస్ కార్యకర్తలతో బయలుదేరిన సంపత్ కుమార్‌ను పోలీసులు పచ్చర్లలోనే నిలిపేశారు. దీంతో ఆయన పోలీసులపై మండిపడ్డారు. కాగా.. పరిస్థితి చేయి దాటిపోతుందని భావించిన పోలీసులు ఎమ్మెల్యే విజయుడిని అరెస్టు చేశారు. కాగా.. తనపై బీఆర్‌ఎస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, వాటిలో వాస్తవం లేదని నిరూపించుకునేందుకు నీటి విడుదల తన ఆధ్వర్యంలోనే చేయాలని డిమాండ్ చేస్తూ.. ఆర్డీఎస్ కెనాల్ వద్ద సంపత్‌కుమార్ నిరసనకు దిగారు. చివరికి నాటకీయ పరిణామాల మధ్య ఉదయం విడుదల కావాల్సిన నీరు సాయంత్రం 4.15 గంటలకు అధికారులే విడుదల చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment