వైఎస్సార్‌సీపీపై మంత్రి అచ్చెన్నాయుడు అసంబద్ధ వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో ప్రతిపక్ష పార్టీని ఉద్దేశించి ఒక మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలు గురువారం సభలో కలకలం రేపాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంపై చర్చించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. దీనిపై చ ర్చకు పట్టుబడుతూ ప్రతిపక్షసభ్యులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమైన అంశమైనందున రేపు(శుక్రవా రం) సమయం ఇవ్వాలని స్పీకర్‌ను కోరారు.
ఎజెండాలో పెట్టామని చెప్పి ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపడుతున్నట్టు స్పీకర్ ప్రకటించిన తరుణంలో మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని... తానొక మంత్రిగా కాకుం డా ఓ సభ్యునిగా మాట్లాడుతున్నానంటూ.. ‘మీ పార్టీని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అని కాకుండా సైకో పార్టీగా పేరు పెట్టుకోండి’ అని అసంబద్ధ వ్యాఖ్య చేశారు. దాంతో విపక్ష సభ్యులు భగ్గుమన్నారు. పార్టీ శాసనసభా పక్ష ఉపనాయకుడు జ్యోతుల నెహ్రూ... ఆ మంత్రికి సైకో అంటే అర్థం తెలుసా? ఈ అన్‌పార్లమెంటరీ భాషేమిటని స్పీకర్‌ను నిల దీశారు. స్పీకర్ స్పందిస్తూ అసభ్య పదజాలం ఉంటే రికార్డుల్లోకి వెళ్లదన్నారు. విపక్షసభ్యులు మంత్రితో క్షమాపణ చెప్పించాలన్నారు.
వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నా: వైఎస్ జగన్
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ టీడీపీ సభ్యుల ప్రవర్తనను ఆక్షేపించారు. ‘ఒక మంత్రిగారు లేచి సభను కావాలని పక్కదోవ పట్టించేందుకు మీపార్టీ సైకో అంటే దాని మీద ఈవేళ మాట్లాడవలసి వస్తోంది. ఆ మాటలపై వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇప్పటికీ చెప్తున్నా.. వాళ్లు ఎత్తుగా, భద్రంగా ఉండి.. వాళ్ల పార్టీ అధ్యక్షుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారున్నారో ఆయన పెద్ద పెద్ద కళ్లతో చూసి వేలు ఇలా, ఇలా పైకి ఎత్తి చూపిస్తూ భయపెట్టిస్తూ మాట్లాడుతున్నారు. ఇదంతా ప్రజలు చూస్తున్నారు. రౌడీ ముఖ్యమంత్రి, రౌడీ శాసనసభ్యులు(వాళ్ల పార్టీ తరఫున ఉన్న వారిలో) ఏమేమి చేస్తున్నారో ప్రజలు చూస్తున్నారు. రౌడీచేష్టల్నీ ప్రజలు బాగా చూస్తున్నారు. జనం కచ్చితంగా మొటిక్కాయలు వేస్తారు’ అని జగన్ అన్నారు. రౌడీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు ఖండన అనంతరం స్పీకర్ జీరోఅవర్‌ను చేపడుతున్నట్టు ప్రకటించారు. ఈ దశలో ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు అడ్డుతగిలి రౌడీ ముఖ్యమంత్రి, రౌడీఎమ్మెల్యేల వంటి వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు.
తప్పు చేసింది టీడీపీ మంత్రే: వైఎస్ జగన్
ఆ తర్వాత జగన్ మాట్లాడుతూ... ‘తప్పు చేసింది తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రి. అదేపనిగా రెచ్చగొట్టడానికి సభ సమయాన్ని వృధా చేయడం కోసం ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి తన(మంత్రి) నోట్లో నుంచి ప్రతిపక్షపార్టీని, ఎమ్మెల్యేలను ఉద్దేశించి సైకోపార్టీ ఎమ్మెల్యేలని, సైకోపార్టీ అంటారు. అటువంటి రౌడీచేష్టల్ని ప్రజలు హర్షించరని అంటే అదేదో తప్పన్నట్టుగా, అదేదో తప్పు చేస్తాఉన్నట్టుగా.. మళ్లీ దాన్నే పట్టుకుని బాబు ఇదే అసెంబ్లీలోనే.. టీవీలు, అందరూ చూస్తుండగానే పెద్దపెద్ద కళ్లు చేసి వేలు ఇలా చూపిస్తూ, చూపిస్తూ రౌడీ మాదిరిగా తాను బెదిరించినా... దాన్నీ ప్రజలు చూస్తున్నారని అంటే అది కూడా మాదే తప్పు అన్నట్టుగా సభలో మాట్లాడుతున్నారు’ అని అంటుండగా స్పీకర్ మైకు కట్ చేసి జీరో అవర్‌ను చేపట్టారు.