
వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు
సాక్షి, విజయవాడ : అగ్రిగోల్డ్ వ్యవహారంలో సీపీఐ నేతలు రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావుకి ముడుపులు అందాయని, పవన్ కళ్యాణ్.. రామకృష్ణతో జాగ్రత్తగా ఉండాలని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు హెచ్చరించారు. సోమవారం విజయవాడలోని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి చంద్రబాబు, లోకేష్, మంత్రులు భూములు దోచుకునే పనిలో ఉన్నారని.. రాజధాని రైతుల భూములు దోచుకున్న పచ్చదండు సామాన్యుల భూములపై కన్నువేసిందని ఆరోపించారు. లింగమనేని రమేష్ అక్రమంగా నిర్మించిన ఇంటిని సీఎం అధికారిక నివాసంగా మార్చుకున్నారని, ఇంక రమేష్‌కి అడ్డు అదుపు ఉంటుందా అని ప్రశ్నించారు.
లింగమనేని రమేష్.. పవన్ కళ్యాణ్‌కి కూడా భూములిచ్చారని, లింగమనేని ఎస్టేట్స్ భూదోపిడిపై సీబీఐ విచారణ జరిగితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. లింగమనేని గ్రూప్‌లో చంద్రబాబు, లోకేష్‌ల వాటా ఎంత అని ప్రశ్నించారు. మంత్రి ఆదినారాయణరెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని.. అవాకులు, చెవాకులు మాట్లాడితే చూస్తూ ఊరుకోమన్నారు. దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల్లో గెలవాలని మంత్రి ఆదినారాయణరెడ్డికి సవాలు విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment