సాక్షి, గుంటూరు : అర్బన్ పోలీసు జిల్లా ఎస్పీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి గురువారం సాయంత్రం ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు అర్బన్ ఎస్పీగా పనిచేసిన రాజేష్‌కుమార్‌ను ఐపీఎస్‌ల విభజనలో భాగంగా తెలంగాణకు కేటాయించడంతో వెయింటింగ్‌లో ఉన్న సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన త్రిపాఠి అర్బన్ జిల్లాపరిధిలోని ఏఎస్పీలు, డీఎస్పీలు, సీఐలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి శాంతి భద్రతలు, ట్రాఫిక్, రాజధాని పరిధిలో అను సరించాల్సిన విధానాల గురించి చర్చించారు.
ఈ సందర్భంగా నూతన ఎస్పీ త్రిపాఠి విలేకరులతో మాట్లాడుతూ అధికారుల సమన్వయంతో అర్బన్ జిల్లాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేపట్టాల్సిన అన్ని చర్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్న వీరభద్రస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అర్బన్ ఎస్పీని కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఏఎస్పీలు జె.భాస్కరరావు, శ్రీనివాసరావు, వెంకటప్పలనాయుడు, డీఎస్పీలు సంతోష్, శ్రీనివాసరావు, రామకృష్ణ, ఎస్‌బీ డీఎస్పీ రామాంజనేయులు, ఏఆర్‌డీఎస్పీ మెహర్‌బాబా, డీసీఆర్బీ డీఎస్పీ దేవరకొండ ప్రసాద్, మహిళ పోలీసు స్టేషన్ డీఎస్పీ కమలాకర్‌రావు, సీసీఎస్ డీఎస్పీలు ప్రకాష్‌రావు, శ్రీనివాసరావులతోపాటు, పలువురు సీఐలు ఉన్నారు.