జిల్లా పరిపాలనలో.. అభివృద్ధిలో అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు జిల్లా కలెక్టర్ యోగితా రాణా.
* ఉద్యోగ బాధ్యతలను గుర్తు చేస్తున్న కలెక్టర్
* జిల్లా స్థాయి అధికారులకు లిటరేచర్ మెమంటో
ఇందూరు : జిల్లా పరిపాలనలో.. అభివృద్ధిలో అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు జిల్లా కలెక్టర్ యోగితా రాణా. ప్రజా ఫిర్యాదులను, ప్రభుత్వ పనులకు సంబంధించిన ఫైళ్లను అధికారులు సత్వరమే పరిష్కారం చూపడం లేదనే ఉద్దేశంతో ‘టాప్ ప్రియారిటీ’ అనే స్టాంపు ముద్రను తయారు చేయించి ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా అధికారుల ఉద్యోగ బాధ్యతలను గుర్తు చేయడానికి మరో సారి తనవంతు ప్రయత్నం చేశారు.
అదేటంటే లిట్రేచర్ మెమంటో...! దీనిని కలెక్టర్ ప్రత్యేకంగా తయారు చేయించి జిల్లా స్థాయి అధికారులందరికీ అందజేశారు. అందులో ఏముందంటే...? ఉద్యోగాన్ని, నావృత్తిని నేను ప్రేమిస్తాను.. నా ఉద్యోగపు పని నన్ను ప్రేరణను ఇస్తుంది.. నా తోటి ఉద్యోగులను గౌరవిస్తాను.. ప్రతిరోజూ గుణాత్మకమైన మార్పుతో పనిని మొదలు పెడతాం.. నా ఉద్యోగం, పనిపై విశ్వాసం ఉంటుంది.. దీనిని నేను స్ఫూర్తిగా తీసుకుని నిత్య ఉద్యోగంలో ఆచరిస్తాను.. అని ఇంగ్లీషులో రాసి ఉంది.
ఈ మెమోంటోను అధికారులు తమ టేబుల్‌పై పెట్టుకోవాలని, రాగానే ప్రతిరోజూ దానిని చదవాలని కలెక్టర్ సూచించారు. ఈ మెమోంటో ఏ జిల్లా స్థాయి అధికారి చాంబర్‌లో చూసిన దర్శనమిస్తోంది. జిల్లా కలెక్టరే స్వయంగా ఉద్యోగ బాధ్యతలను తెలియజేసేందుకు ఈ విధంగా చొరవ తీసుకోవడంపై ఉద్యోగులు, అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.