నెల్లిమర్ల రూరల్/గజపతినగరం, న్యూస్‌లైన్: ఆ యువకులు పొట్ట చేత పట్టుకుని ఉపాధి కోసం విశాఖపట్నం వెళ్లారు. అక్కడ చిన్నచిన్న షాపుల్లో పని చేసుకుంటున్నారు. తిరుపతి దైవదర్శనానికి బస్సులో శనివారం రాత్రి బయలు దేరారు. మార్గమధ్యంలో పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు వద్ద కాలకృత్యా ల కోసం బస్సును ఆపడంతో ప్రయాణికులు దిగారు. అయితే వారిలో గజపతినగరం మండలం మరుపల్లికి చెందిన కోట పోలినాయుడు(18), నెల్లిమర్ల మండలం చిన్నబూరాడపేటకు చెందిన సువ్వాడ రామకృష్ణ (20) నదిలో మునిగిపోయి గల్లంతయ్యారని సహప్రయాణికులు ఆ యువకుల కుటుంబసభ్యులకు సమాచారమందించారు. పోలినాయుడు విశాఖలోని కనకమహలక్ష్మి ఆలయం సమీపంలో ఓ టీ షాపులో పనిచేస్తుండగా, అదే సమీపంలో రామకృష్ణ చిన్న హోటల్‌లో పని చేస్తున్నాడు.
చేతికందివస్తావనుకుంటే...
ఇంటికి పెద్దకొడుకువి. చేతికి అందివచ్చే సమయానికి మాకు కాకుండా పోయావా నాయనా అంటూ పోలినాయుడి తల్లిదండ్రులు రోదిస్తుంటే చూసిన వారి హృదయాలు కలిచివేశాయి. పోలినాయుడు గోదావరిలో గల్లంతయ్యాడన్న వార్త ఆదివారం వినగానే తల్లి దండ్రులు కోట కృష్ణ, అబద్దంలు తేరుకోలేక పోయారు. ఇంట్లో పూట గడవని పరిస్థితిలో చదువుకోలేనని చెప్పి పనికి వెళ్లిన పోలినాయుడు.. తాను సంపాదించగా వచ్చిన డబ్బులతో తమ్ముడు అప్పలనాయుడును బాగా చదివిస్తానని చెప్పిన మాటలను తలుచుకుని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అమ్మా నేను తిరుపతి వెళ్తున్నాను. తిరిగి వచ్చిన వెంటనే ఇంటికి డబ్బులు పం పిస్తాను. మీరందరు బాగున్నారా? అని శుక్రవారం నువ్వు మాట్లాడిన మాటలే చివరి మాటలయ్యాయా నాయనా..కంటికి కనిపించకుం డా పోయావా.. అంటూ తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. వీరి రోదనతో గ్రామమంతా విషాదఛాయలు అలముకున్నాయి.
రామకృష్ణే కుటుంబానికి పెద్ద దిక్కు
చిన్నబూరాడపేటకు చెందిన సువ్వాడ రామకృష్ణ(20) కుటుంబానికి పెద్దదిక్కు. అతని తండ్రి చిన్నతనంలోనే మరణించడంతో చదువు మధ్యలోనే విడిచిపెట్టి విశాఖలో పనికి చేరాడు. గత ఏడాది వరకు అతని చిన్నాన్న సువ్వాడ తమ్మన్న వీరి కుటుంబానికి అండగా ఉండేవాడు. అయితే ఆయన కూడా గత ఏడాది ఉగాది రోజున మరణించడంతో రామకృష్ణే కుటుంబానికి పెద్ద దిక్కయ్యాడు. రామకృష్ణకు తల్లి, ముగ్గురు అక్కాచెల్లెళ్లున్నారు. అక్క ముత్యాలమ్మకు పెళ్లికాగా పెద్ద చెల్లి రామలక్ష్మి డిగ్రీ చదువుకుంది. రెండవ చెల్లి రాజేశ్వరి పదవ తరగతి చదువుతోంది. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న రామకృష్ణ నదిలో గల్లంతు కావడంతో కుటుంబమంతా వీధిన పడిందని గ్రామస్తులు చెబుతున్నారు. తీర్థయాత్రలకు వెళ్లి వస్తానని చెప్పిన రామకృష్ణ ఇలా కానరాకుండా పోవడంతో కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు. విషయం తెలిసిన గ్రామస్తులు సైతం ఇక ఆ కుటుంబానికి దేవుడే దిక్కంటూ కన్నీటిపర్యంతమయ్యారు. .
గోదావరి నదిలో...ఇద్దరు గల్లంతు
Published Mon, Aug 12 2013 3:21 AM | Last Updated on Fri, Sep 1 2017 9:47 PM
Advertisement
Advertisement