స్టేటస్ ఫైట్: వైజాగ్‌లో ఎమర్జెన్సీ!
- ఎక్కడ చూసినా పోలీసుల దిగ్భందం
- అడుగడుగునా ఆంక్షలు.. బీచ్ రోడ్డుకు వెళ్లకుండా
విశాఖపట్నం: ప్రత్యేక హోదా ఆందోళనకు సిద్ధమవుతున్న వైజాగ్‌లో ఎమర్జెనీ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షాలు ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో వైజాగ్ నగరాన్ని పోలీసులు దిగ్బంధించారు. అడుగడుగునా ఆంక్షలు విధించారు. ప్రత్యేక హోదా ఆందోళన కేంద్రమైన బీచ్‌రోడ్డులోకి వెళ్లకుండా పూర్తిగా పోలీసుల వలయాన్ని మోహరించారు. బీచ్ రోడ్డుకు ఎవరూ వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. నగరంలో 144 సెక్షన్ విధించి భారీగా బలగాలను దించారు.
మరోవైపు ఎట్టిపరిస్థితుల్లో ప్రత్యేక హోదా ఆందోళనలో పాల్గొనేందుకు యువత సిద్ధమవుతోంది. వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు హోదా ఆందోళనలో పాల్గొనేందుకు యువత సన్నద్ధమవుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వైజాగ్‌కు తరలివచ్చేందుకు యువత, వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. సాయంత్రం వైఎస్ జగన్ కూడా కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనేందుకు నగరానికి వస్తున్నారు.
జల్లికట్టు క్రీడ కోసం తమిళ యువత జరిపిన ఆందోళన స్ఫూర్తిగా ప్రత్యేక హోదా ఆందోళనలకు వైజాగ్ బీచ్‌రోడ్డులో యువత, ప్రతిపక్షాలు ఆందోళనకు సిద్ధమైన సంగతి తెలిసిందే. శాంతియుతంగా ప్రత్యేక హోదా ఆకాంక్షను చాటుతామని వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, యువత స్పష్టం చేస్తున్నప్పటికీ, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం వైజాగ్‌లో ఓవరాక్షన్ చేస్తోంది. హోదా ఆందోళనలను ఉక్కుపాదంతో అణచివేసేందుకు అడుగడుగునా పోలీసులను మోహరించారు. నగరంలోకి వచ్చే ప్రతి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేస్తున్నారు. హోదా పోరాటానికి వస్తున్న యువతను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు.