ఫలితాల్లో జూనియర్ ఇంటర్ విద్య.. మిథ్య | in government junior college becoming surrounded in doubt | Sakshi
Sakshi News home page

ఫలితాల్లో జూనియర్ ఇంటర్ విద్య.. మిథ్య

Published Mon, Apr 27 2015 3:06 AM | Last Updated on Sun, Sep 3 2017 12:56 AM

in government junior college becoming surrounded in doubt

- డోన్ ప్రభుత్వ కళాశాలలో 125 మంది విద్యార్థులకు గాను 17 మంది మాత్రవే ఉత్తీర్ణులయ్యారు.
- ఆదోని ప్రభుత్వ బాలికల కళాశాలలో 183 మంది విద్యార్థినులకు గాను 41 మంది పాసయ్యారు.
- ఎమ్మిగనూరు ప్రభుత్వ బాలుర కళాశాలలో 367 మందికి 94 మంది మాత్రమే ఉత్తీర్ణతసాధించారు.
- కర్నూలు ప్రభుత్వ జూనియర్ కళాశాల(టౌన్)లోనూ ఫలితాలు 48.90 శాతం మించని పరిస్థితి.

- కాంట్రాక్టు అధ్యాపకులతోనే బోధన
-  జిల్లాలో 70 శాతం వారే..
-  అధ్యాపకులే లేని కాలేజీలు రెండు
కర్నూలు(జిల్లా పరిషత్):
జిల్లాలోని కొన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్య అగమ్యగోచరంగా మారింది. కాస్త మెరిట్ విద్యార్థులంతా ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీల్లో చేరుతుండగా.. సాధారణ విద్యార్థులు అధిక శాతం ప్రభుత్వ జూనియర్ కళాశాలల వైపే అడుగేస్తున్నారు. అయితే ప్రభుత్వ కళాశాలలపై నియంత్రణ లేకపోవడం, అధ్యాపకుల కొరత కారణంగా ఉత్తీర్ణత శాతం నేలచూపులు చూస్తోంది. రెగ్యులర్‌కు మించి కాంట్రాక్టు అధ్యాపకులు ఉన్నా.. మొత్తం

41 కాలేజీల్లో 30 చోట్ల జూనియర్ ఇంటర్ ఉత్తీర్ణత 50 శాతంలోపే ఉండటం గమనార్హం.జిల్లాలో 41 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. మొత్తం 516 పోస్టుల్లో 180 మంది రెగ్యులర్.. 296 పోస్టుల్లో కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారు. గత యేడాది రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కాంట్రాక్టు అధ్యాపకుల నియామకాలను సైతం నిలిపేసి.. వారి స్థానంలో ఖాళీగా ఉన్న 40 పోస్టుల్లో గంటల లెక్కన పనిచేసేందుకు రిటైర్డ్ అధ్యాపకులను నియమించాలని ఆదేశింది.

అది కూడా విద్యాసంవత్సరం సగం ముగిసిన తర్వాత నవంబర్‌లో ఈ ప్రకటన చేసింది. దీంతో చాలా చోట్ల రిటైర్డ్ అధ్యాపకులను నియమించలేకపోయారు. ఈ కారణంగా ప్రస్తుతం 40 పైగా పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి. దీబగుంట్ల, కర్నూలులోని మైనార్టీ కాలేజీలు మంజూరైనా పోస్టులు ఇవ్వలేదు. దీంతో ఈ రెండు కాలేజిల్లోనూ గంటల లెక్కన అధ్యాపకులను నియమించారు. అది కూడా అరకొరగా నియమించడంతో ఆశించిన ఫలితాలు నమోదు కాలేదు.

ఆర్‌ఐవో, డీవీఈవోలూ ఇన్‌చార్జీలే..
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలను పర్యవేక్షించేందుకు రీజినల్ ఇన్స్‌పెక్టింగ్ అధికారి(ఆర్‌ఐవో)లను నియమించింది. రాష్ట్రంలో కేవలం నెల్లూరు, గుంటూరు మినహా అన్ని చోట్లా ఆర్‌ఐఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సీనియర్ ప్రిన్సిపాళ్లను ఇన్‌చార్జీలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

కర్నూలు ఆర్‌ఐఓగా కోడుమూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యేశ్వరరావు, జిల్లా వృత్తి విద్యాధికారిణిగా ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సాలాబాయి ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనూ ప్రిన్సిపాల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఇంటర్ ఫలితాలపై ప్రభావం : ఆర్‌ఐఓ, డీవీఈవో, నాలుగు ప్రిన్సిపాల్, భారీగా అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉండటంతో ఆ ప్రభావం ఇంటర్మీడియట్ ఫలితాలపై ప్రభావం చూపుతోంది. పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు తీసుకుంటున్నామని చెబుతున్నా ఆశించిన ఫలితాలు మాత్రం నమోదు కావడం లేదు. ఆర్‌ఐఓ కార్యాలయం పక్కనే ఉన్న టౌన్ మోడల్ కాలేజిలోనూ ఫలితాలు 50శాతం కూడా నమోదు కాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement