కొకైన్‌తో పట్టుబడిన నిందితుల అరెస్టు చూపుతున్న ఎక్సైజ్ పోలీసులు (ఇన్‌సెట్లో) స్వాధీనం చేసుకున్న కొకైన్
కర్నూలు, న్యూస్‌లైన్ : ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు అజ్ఞాత వ్యక్తుల సమాచారంతో కర్నూలు కొత్త బస్టాండ్‌లో ముగ్గురు వ్యక్తుల నుంచి రెండు ప్యాకెట్లలో భద్రపరిచిన కొకైన్(మత్తు పదార్థం)ను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం కర్నూలులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ హేమంత్ నాగరాజు వివరాలు వెల్లడించారు.
ఆత్మకూరు డిపోకు చెందిన బస్సులో కొకైన్‌ను తరలిస్తున్నట్లు తనకు సమాచారం రావడంతో సీఐలు కృష్ణకుమార్, రాజశేఖర్ గౌడ్, పద్మావతి, ఎస్‌ఐలు ప్రసాదరావు, నాగమణి, రమణ తదితరులను అప్రమత్తం చేశానని తెలిపారు.
వీరు కర్నూలు కొత్త బస్టాండ్ వద్ద కాపు కాసి మత్తు పదార్థాలను రవాణా చేస్తున్న కృష్ణా జిల్లా గుడ్ల వల్లేరుకు చెందిన బొల్ల శివశంకర్, జి.కొండూరు గ్రామానికి చెందిన కొర్లపాటి సుబ్బారావు, హైదరాబాద్‌లోని మణికొండకు చెందిన అనూషలను అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ.6 లక్షలు విలువ చేసే 300 గ్రాముల కొకైన్‌ను స్వాధీ నం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన అనూష, శివశంకర్, సుబ్బారావు ముఠాగా ఏర్పడి ఆరు నెలలుగా ఈ వ్యాపారం కొనసాగిస్తున్నట్లు విచారణలో బయటపడిందన్నారు. ఈ కొకైన్‌ను విజయవాడలో కొని, బెంగళూరుకు తరలిస్తున్నట్లు తెలిసిందని చెప్పారు.