Hemant Nagaraju
-
లక్కీ డ్రాప్స్
సాక్షి ప్రతినిధి, కర్నూలు : ఈ నెలాఖరుకు మద్యం షాపుల లెసైన్స్ గడువు ముగియనుంది. ఇదే అదనుగా మద్యం సిండికేట్లు సరికొత్త అవతారం ఎత్తాయి. తమకు వచ్చిన సరుకులో అధిక భాగాన్ని బెల్టు షాపులకు మళ్లించారు. కొద్దిపాటి స్టాకును మాత్రమే తమ వద్ద ఉంచుకుని.. అధిక ధరకు బెల్టు షాపులకు విక్రయించడం ద్వారా సిండికేట్లు భారీగా దండుకున్నాయి. కట్టడి చేయాల్సిన ఎక్సైజ్ అధికారులు చేష్టలూడిగి చూస్తున్నారు. అంతేకాదు.. మద్యం సిండికేట్ల వద్ద వసూలు చేస్తున్న తరహాలోనే బెల్టు షాపుల వద్ద కూడా మాముళ్లకు తెగబడ్డారు. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా బెల్టు షాపుల జోరు అధికమైంది. ప్రస్తుతం మద్యం షాపుల్లో మద్యం కొరత వేధిస్తోంది. కేవలం రెండు, మూడు బ్రాండ్ల లిక్కరు మాత్రమే అధికారిక మద్యం షాపుల్లో లభిస్తోంది. మిగిలిన బ్రాండ్ల కోసం బెల్టుషాపులను ఆశ్రయించాల్సి వస్తోంది. దొరుకుతున్న బ్రాండ్లు కూడా కేవలం చీప్‌లిక్కరే కావడం గమనార్హం. ఓల్డ్ తవేరా వంటి చీప్ లిక్కరు బ్రాండ్లు మాత్రమే అధికారిక మద్యం షాపుల్లో ఉంచుతున్నారు. జిల్లాలోని మెజార్టీ మద్యం దుకాణాల్లో నెలకొన్న పరిస్థితి ఇదే. మంచి బ్రాండ్ల మద్యం కొనుగోలు చేయాలంటూ బెల్టు షాపుల్లో అదనంగా రూ.30 నుంచి రూ.100 వరకు వెచ్చించాల్సి వస్తోందని మద్యం ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని కట్టడి చేయాల్సిన ఎక్సైజ్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. బాటిల్‌పై భారీగా వసూలు మద్యం సిండికేట్ల ఎత్తుగడలతో మద్యం ప్రియుల జేబుకు భారీగా చిల్లు పడుతోంది. మద్యం కావాలంటే బాటిల్‌కు అదనంగా చెల్లించుకోవాల్సి వస్తోంది. క్వాటర్ బాటిల్‌కు ఏకంగా రూ.30 వరకు మట్టజెబితే కానీ దొరకని పరిస్థితి. ఫుల్ బాటిల్‌కు రూ.80 నుంచి రూ.100 వరకు అదనంగా దండుకుంటున్నారు. ఒకవైపు మద్యం షాపుల్లో మంచి బ్రాండ్లు దొరక్కపోవడం.. బెల్టు షాపులే దిక్కవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అధిక ధరకు కూడా మద్యాన్ని కొని తాగాల్సిన దుస్థితి మందుబాబులది. ఈ వ్యవహారమంతా ఎక్సైజ్ అధికారుల కనుసన్నల్లోనే సాగుతుండటం గమనార్హం. బెల్టు షాపులపై దాడులు చేయకుండా ఉండేందుకు షాపు రకాన్ని బట్టి ఏకంగా రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బెల్టు షాపులపై ప్రత్యేక డ్రైవ్ చేపడతాం జిల్లా వ్యాప్తంగా ఈ నెలాఖరు వరకు బెల్టు షాపులపై ప్రత్యేక డ్రైవ్ చేపడతాం. బెల్టు షాపులు నిర్వహిస్తున్న వారిపై దాడులు చేసి చర్యలు తీసుకుంటాం. మద్యం షాపుల యాజమాన్యాలు తమకు వచ్చిన స్టాకును బ్లాకులో బెల్టు షాపులపై విక్రయించినట్టు తేలితే కఠిన చర్యలు తప్పవు. ఇప్పటికే కొన్ని బెల్టు షాపులను గుర్తించాం. వీటిపై త్వరలో దాడులు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. - హేమంత్ నాగరాజు, ఎక్సైజ్‌శాఖ ఇన్చార్జి డీసీ -
‘బార్కోడ్' విధానంతోనే మద్యం విక్రయాలు
కర్నూలు: బార్ కోడ్ విధానం ద్వారానే మద్యం విక్రయాలు జరపాలని వ్యాపారులను ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజు ఆదేశించారు. మద్యం వ్యాపారంలో అక్రమ విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు గాను ఈ ఏడాది కొత్తగా 2డీ బార్ కోడింగ్ పద్ధతిని అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మద్యం వ్యాపారులు ఈ విధానం అమలుపై అయిష్టత వ్యక్తం చేస్తూ రాష్ట్రస్థాయి యూనియన్ నాయకులు కోర్టును ఆశ్రయించారు. అయితే ఈనెల 15వ తేదిలోగా హోలోగ్రామ్ ప్రాజెక్టును ఖచ్చితంగా అమలు చేయాలని ఎక్సైజ్ కమిషనర్ ఎస్ఎస్.రావత్ ఆదేశాల మేరకు జిల్లా ఎక్సైజ్ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఆరు నెలల క్రితమే అధికారులకు ఈ ప్రాజెక్టు అమలుపై మార్గదర్శకాలు అందిన సంగతి తెలిసిందే. గురువారం జిల్లా వ్యాప్తంగా స్టేషన్ హౌస్ ఆఫీసర్లను మద్యం వ్యాపారులను కార్యాలయానికి రప్పించి ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజు సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో కర్నూలు, నంద్యాల ఎక్సైజ్ సూపరింటెండెంట్లు సుర్జీత్‌సింగ్, హనుమంతరావు, ఏఈఎస్ హెప్సిబారాణి, కర్నూలు సీఐ పద్మావతితో పాటు జిల్లాలోని అన్ని స్టేషన్ల హౌస్ ఆఫీసర్లు పాల్గొన్నారు. ప్రతి మద్యం దుకాణంలో 2డీ స్కానర్, ఇండస్ట్రియల్ కంప్యూటర్, 3జీ సిమ్, ప్లాట్ ఏర్పాటు చేసుకోవాలని ఈ సందర్భంగా వ్యాపారులకు ఇన్చార్జి డీసీ ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 194 మద్యం దుకాణాలు, 30 బార్లు ఉన్నాయి. అన్ని దుకాణాల్లో కూడా బార్కోడ్ విధానం ద్వారానే విక్రయాలు జరపాలని ఆదేశించారు. డిసెంబర్ 1 నుంచి 2డీ బార్‌కోడింగ్ పద్దతిలోనే విక్రయాలు జరగనున్నాయి. ఈ విధానం అమలు వల్ల జిల్లాలోని మద్యం డిపోతో పాటు రీటైల్ దుకాణాల్లో విక్రయాల స్టాక్ వివరాలు, హైదరాబాద్ సెంట్రల్ సర్వర్ ద్వారా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంటుంది. -
కర్నూలులో కొకైన్ పట్టివేత
కర్నూలు, న్యూస్‌లైన్ : ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు అజ్ఞాత వ్యక్తుల సమాచారంతో కర్నూలు కొత్త బస్టాండ్‌లో ముగ్గురు వ్యక్తుల నుంచి రెండు ప్యాకెట్లలో భద్రపరిచిన కొకైన్(మత్తు పదార్థం)ను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం కర్నూలులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ హేమంత్ నాగరాజు వివరాలు వెల్లడించారు. ఆత్మకూరు డిపోకు చెందిన బస్సులో కొకైన్‌ను తరలిస్తున్నట్లు తనకు సమాచారం రావడంతో సీఐలు కృష్ణకుమార్, రాజశేఖర్ గౌడ్, పద్మావతి, ఎస్ఐలు ప్రసాదరావు, నాగమణి, రమణ తదితరులను అప్రమత్తం చేశానని తెలిపారు. వీరు కర్నూలు కొత్త బస్టాండ్ వద్ద కాపు కాసి మత్తు పదార్థాలను రవాణా చేస్తున్న కృష్ణా జిల్లా గుడ్ల వల్లేరుకు చెందిన బొల్ల శివశంకర్, జి.కొండూరు గ్రామానికి చెందిన కొర్లపాటి సుబ్బారావు, హైదరాబాద్‌లోని మణికొండకు చెందిన అనూషలను అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ.6 లక్షలు విలువ చేసే 300 గ్రాముల కొకైన్‌ను స్వాధీ నం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన అనూష, శివశంకర్, సుబ్బారావు ముఠాగా ఏర్పడి ఆరు నెలలుగా ఈ వ్యాపారం కొనసాగిస్తున్నట్లు విచారణలో బయటపడిందన్నారు. ఈ కొకైన్‌ను విజయవాడలో కొని, బెంగళూరుకు తరలిస్తున్నట్లు తెలిసిందని చెప్పారు.