లక్కీ డ్రాప్స్
సాక్షి ప్రతినిధి, కర్నూలు : ఈ నెలాఖరుకు మద్యం షాపుల లెసైన్స్ గడువు ముగియనుంది. ఇదే అదనుగా మద్యం సిండికేట్లు సరికొత్త అవతారం ఎత్తాయి. తమకు వచ్చిన సరుకులో అధిక భాగాన్ని బెల్టు షాపులకు మళ్లించారు. కొద్దిపాటి స్టాకును మాత్రమే తమ వద్ద ఉంచుకుని.. అధిక ధరకు బెల్టు షాపులకు విక్రయించడం ద్వారా సిండికేట్లు భారీగా దండుకున్నాయి. కట్టడి చేయాల్సిన ఎక్సైజ్ అధికారులు చేష్టలూడిగి చూస్తున్నారు. అంతేకాదు.. మద్యం సిండికేట్ల వద్ద వసూలు చేస్తున్న తరహాలోనే బెల్టు షాపుల వద్ద కూడా మాముళ్లకు తెగబడ్డారు. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా బెల్టు షాపుల జోరు అధికమైంది. ప్రస్తుతం మద్యం షాపుల్లో మద్యం కొరత వేధిస్తోంది. కేవలం రెండు, మూడు బ్రాండ్ల లిక్కరు మాత్రమే అధికారిక మద్యం షాపుల్లో లభిస్తోంది.
మిగిలిన బ్రాండ్ల కోసం బెల్టుషాపులను ఆశ్రయించాల్సి వస్తోంది. దొరుకుతున్న బ్రాండ్లు కూడా కేవలం చీప్‌లిక్కరే కావడం గమనార్హం. ఓల్డ్ తవేరా వంటి చీప్ లిక్కరు బ్రాండ్లు మాత్రమే అధికారిక మద్యం షాపుల్లో ఉంచుతున్నారు. జిల్లాలోని మెజార్టీ మద్యం దుకాణాల్లో నెలకొన్న పరిస్థితి ఇదే. మంచి బ్రాండ్ల మద్యం కొనుగోలు చేయాలంటూ బెల్టు షాపుల్లో అదనంగా రూ.30 నుంచి రూ.100 వరకు వెచ్చించాల్సి వస్తోందని మద్యం ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని కట్టడి చేయాల్సిన ఎక్సైజ్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.
బాటిల్‌పై భారీగా వసూలు
మద్యం సిండికేట్ల ఎత్తుగడలతో మద్యం ప్రియుల జేబుకు భారీగా చిల్లు పడుతోంది. మద్యం కావాలంటే బాటిల్‌కు అదనంగా చెల్లించుకోవాల్సి వస్తోంది. క్వాటర్ బాటిల్‌కు ఏకంగా రూ.30 వరకు మట్టజెబితే కానీ దొరకని పరిస్థితి. ఫుల్ బాటిల్‌కు రూ.80 నుంచి రూ.100 వరకు అదనంగా దండుకుంటున్నారు. ఒకవైపు మద్యం షాపుల్లో మంచి బ్రాండ్లు దొరక్కపోవడం.. బెల్టు షాపులే దిక్కవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అధిక ధరకు కూడా మద్యాన్ని కొని తాగాల్సిన దుస్థితి మందుబాబులది. ఈ వ్యవహారమంతా ఎక్సైజ్ అధికారుల కనుసన్నల్లోనే సాగుతుండటం గమనార్హం. బెల్టు షాపులపై దాడులు చేయకుండా ఉండేందుకు షాపు రకాన్ని బట్టి ఏకంగా రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
బెల్టు షాపులపై ప్రత్యేక డ్రైవ్ చేపడతాం
జిల్లా వ్యాప్తంగా ఈ నెలాఖరు వరకు బెల్టు షాపులపై ప్రత్యేక డ్రైవ్ చేపడతాం. బెల్టు షాపులు నిర్వహిస్తున్న వారిపై దాడులు చేసి చర్యలు తీసుకుంటాం. మద్యం షాపుల యాజమాన్యాలు తమకు వచ్చిన స్టాకును బ్లాకులో బెల్టు షాపులపై విక్రయించినట్టు తేలితే కఠిన చర్యలు తప్పవు. ఇప్పటికే కొన్ని బెల్టు షాపులను గుర్తించాం. వీటిపై త్వరలో దాడులు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.
- హేమంత్ నాగరాజు, ఎక్సైజ్‌శాఖ ఇన్‌చార్జి డీసీ