కావలి, న్యూస్‌లైన్: ఏటీఎం సెంటర్లకు వచ్చే అమాయకులే వారి టార్గెట్. సాయం చేస్తున్నట్టు నటించి వారి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసేస్తారు. వాళ్లేమన్నా ప్రొఫెషన్ నేరస్తులనుకుంటే పొరపాటే. జల్సాల కోసం మోసాలబాట పట్టిన వారిద్దరూ ఇంటర్ విద్యార్థులు కావడం గమనార్హం. ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు వీరి గుట్టును రట్టు చేస్తున్నారు. ఇప్పటికే ఓ విద్యార్థిని అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా మరొకరి కోసం గాలిస్తున్నారు.
కావలి ఒకటో పట్టణ ఎస్సై అంజిబాబు కథనం మేరకు.. కావలికి చెందిన సాయిగుప్తా పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ఇతనికి ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన మరో విద్యార్థి స్నేహితుడు. వీరిద్దరూ కలిసి కావలి, నెల్లూరులోని ఏటీఎంలకు వచ్చే అమాయకులను టార్గెట్ చేసి నగదు తస్కరించేవారు. తమ వద్ద ఉంచుకున్న 12 ఏటీఎం కార్డులతో ప్రధానంగా మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్యలో ఏటీఎంలకు వెళ్లే వారు. ఎవరైనా వచ్చి నగదు డ్రా చేసేందుకు ఇబ్బంది పడుతుంటే వారి సాయం చేసినట్టు నటించేవారు. వారి పాస్‌వర్డ్‌ను కనుక్కుని, నగదు డ్రాచేసేవారు. వారు గమనించేలోగానే మళ్లీ కార్డును ఏటీఎం మిషన్‌లో పెట్టేవారు. సంబధిత వ్యక్తి వెళ్లిపోగానే తమ పనికానిచ్చేవారు. ఈ క్రమంలో కావలిలోని ఓ ఏటీఎం నగదు డ్రాచేసేందుకు వెళ్లానని, తర్వాత చూడగా తన ఖాతాలోని సుమారు రూ.20 వేలు డ్రాఅయినట్టు మెసేజ్ వచ్చిందని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కావలి ఒకటో పట్టణ పోలీసులు ఏటీఎంపై నిఘా పెట్టారు. సాయిగుప్తా అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో అదుపులోకి తీసుకుని విచారించగాపై విషయాలు వెల్లడించారు. ఈ విద్యార్థి తన అత్తమ్మకు చెందిన ఏటీఎం కార్డుతో సైతం ఇలాగే నగదు డ్రా చేసినట్టు పోలీసులు గుర్తించారు. సాయిగుప్తా వద్ద వివిధ బ్యాంకులకు సంబంధించిన 12 ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు.
పోలీసుల అదుపులో ఏటీఎం మాయగాడు
Published Fri, Aug 16 2013 4:52 AM | Last Updated on Fri, Sep 1 2017 9:51 PM
Advertisement
Advertisement