సాక్షి, నెల్లూరు: సమైక్యాంధ్ర కోరుతూ జిల్లాలో జరుగుతున్న ఉద్యమం 16వ రోజూ ఉధృతంగా సాగింది. గురువారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని సైతం ఆందోళనకారులు లెక్క చేయకుండా ఉద్యమాన్ని కొనసాగించారు. నెల్లూరు నగరంలో ఆర్టీసీ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి వంటావార్పు, మానవహారం, నిర్వహించారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. ఆత్మకూరు బస్టాండ్ వద్ద బస్సులను అడ్డుకున్నారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట మెడికల్ అండ్ హెల్త్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు.
న్యాయవాదులు ర్యాలీ చేశారు. సూళ్లూరుపేటలో ఆందోళనకారులు జాతీయ జెండాకు బదులుగా సమైక్యాంధ్ర జెండాను ఎగురవేశారు. అనంతరం శాంతి కపోతాలను ఎగురవేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల బంద్ కొనసాగుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు తిరగలేదు. జనజీవనం స్తంభించింది. నగరంలో ఎన్‌ఎంయూ, ఎంప్లాయీస్ యూనియన్, బీఎంఎస్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ ఎదుట రోడ్డుపై వంటావార్పు నిర్వహించారు.
సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేసి, మానవహారం నిర్వహించారు. పీఎస్‌ఆర్ బస్‌స్టేషన్‌లో ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. 44 వ డివిజన్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత షబ్బీర్ ఆధ్వర్యంలో కార్యకర్తలు బారకాసు సెంటర్‌లో నిరసన దీక్ష చేశారు. అనంతరం ర్యాలీ నిర్వహించి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. సమైక్యాంధ్ర సాధన కోసం మెడికల్, హెల్త్ ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు.
పొదలకూరులో సమైక్యవాదులు 67 మీటర్ల జాతీయ పతాకంతో భారీ ప్రదర్శన నిర్వహించారు. సమైక్యాంధ్ర కోసం పూలు పంపిణీ చేశారు. సమైక్యాంధ్రకు మద్దతు కోరుతూ మనుబోలులో విద్యార్థులు పోలీసులకు పూలు పంపిణీ చేశారు. ఉద్యమాలకు సహకరించాలని కోరారు. గురువారం జోరుగా వర్షం కురుస్తున్నప్పటికీ సర్వేపల్లి నియోజకవర్గంలో సమైక్యాంధ్ర కోసం రెవెన్యూ సంఘం, ఆర్టీసీ ఉద్యోగులు, విద్యార్థులు, జేఏసీల ఆధ్వర్యంలో పలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. జేఏసీ, రెవెన్యూ సంఘం, విద్యార్థులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి మానవహారంగా నిలిచారు. చిట్టమూరు మండలంలో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ విద్యార్థులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజనను ఉపసంహరించేంత వరకు ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
సూళ్లూరుపేట జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా స్థానిక బస్టాండ్ సెంటర్‌లో జాతీయజెండా ఎగురవేసి స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు. పీర్లచావిడి సెంటర్ వద్ద సమైక్యవాదులు మూడోరోజు రిలే నిరాహరదీక్ష కొనసాగించారు. దీక్షకు టీడీపీ నాయకులు, ఎమ్మెల్యే పరసా రత్నయ్య సంఘీభావం తెలిపి దీక్షలో కూర్చున్నారు. నాయుడుపేటలో టీడీపీ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్‌లో జాతీయ జెండాకు బదులుగా సమైక్యాంధ్ర జెండా ఎగురవేసి స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు. శాంతి కపోతాలను ఎగురవేశారు.
ఉదయగిరిలో ఎన్‌జీఓలు బస్టాండు వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఉదయగిరి మండలం గండిపాళెంలోని బస్టాండ్ సెంటర్‌లో పాఠశాలల విద్యార్థులు మానవహారంగా ఏర్పడి వాహనాలను అడ్డుకున్నారు. వింజమూరులో బస్టాండ్ సెంటర్‌లో విద్యార్థి జేఏసీ, ఎన్‌జీఓలు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు
కావలిలో ఆర్టీసీ బస్టాండ్‌లో ఆర్టీసీ ఉద్యోగుల ఆధ్వర్యంలో సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ , ఎన్‌ఎంయూ నాయకులు పాల్గొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్లో సమైక్యాంధ్ర జేఏసీ శిబిరం వద్ద జాతీయ జెండాను ఎగుర వేశారు.
ఆత్మకూరులో బస్టాండ్ సెంటర్‌లో ఆర్యవైశ్య సంఘం (రూరల్) జిల్లా అధ్యక్షుడు కొల్లా నాగరాజారావు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులు డిపోలో వంటావార్పు నిర్వహించారు. ఆపస్ ఆధ్వర్యంలో పట్టణంలోని సత్రం సెంటర్ నుంచి ఆర్టీసీ డిపో వరకు మోటారు సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు.
వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ కృష్ణారెడ్డి, సర్పంచ్ వెంకటేశ్వరరెడ్డి, నాయకుడు మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సైదాపురం బస్టాండ్‌లో సమైక్యాంధ్రకు మద్దతుగా గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం వంటావార్పు నిర్వహించి కేసీఆర్ దిష్టిబొమ్మను గ్రామ పురవీధుల్లో ఊరేగించి దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మండలంలోని ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో బస్టాండ్ ప్రాంతంలో రాస్తారోకో నిర్వహించి టైర్లు దగ్ధం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు.
బుచ్చిరెడ్డిపాళెంలో సమైక్యాంధ్రకు మద్దతుగా కోర్టు గుమస్తాల సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
వర్షంలోనూ అదే జోరు
Published Fri, Aug 16 2013 4:15 AM | Last Updated on Thu, Mar 21 2019 8:16 PM
Advertisement
Advertisement