సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కొందరు ఎమ్మెల్యేలు వెనుకబడ్డారు. తమ చేతిలో ఉన్న నిధులను సద్వినియోగం చేయాలనే కనీస ప్రణాళికను విస్మరించారు. సొంత నియోజకవర్గంలో తాము మంజూరు చేసిన పనులను సైతం పట్టించుకోవడం లేదు. అసలు పనులు జరుగుతున్నాయా.. లేదా అని సమీక్షించేందుకు తీరిక లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ఎమ్మెల్యేల కోటాగా పరిగణించే నియోజకవర్గాల అభివృద్ధి నిధుల (సీడీపీ) వినియోగం గాడి తప్పుతోంది.
2010 నుంచి ఇప్పటివరకు జిల్లాకు రూ.45.50 కోట్లు విడుదలైతే... మంత్రి సహా ఎమ్మెల్యేలందరూ రూ.22.60 కోట్లు ఖర్చు చేశారు. మిగతా రూ.12.90 కోట్ల నిధులు ఖజానాలోనే మూలుగుతున్నాయి. అయిదేళ్ల పదవీకాలం దగ్గర పడుతుండడంతో ఎమ్మెల్యేలు ఈ నిధులతో చేపట్టాల్సిన అభివృద్ధిపై దృష్టి సారించాల్సి ఉంది. జిల్లాలో మొత్తం 13 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక్కో ఎమ్మెల్యేకు ఏడాదికి రూ.కోటి చొప్పున సీడీపీ నిధులు మంజూరవుతాయి. అందులో రూ.50 లక్షలు ఎమ్మెల్యే సొంతంగా ప్రతిపాదించిన పనులకు వెచ్చిస్తారు. మిగతా రూ.50 లక్షలను జిల్లా ఇన్‌చార్జి మంత్రి కోటాగా పరిగణిస్తారు.
నిబంధనల ప్రకారం స్థానిక ఎమ్మెల్యేలు సిఫారసు చేసిన పనులను ఇన్‌చార్జి మంత్రి మంజూరు చేస్తారు. కానీ... ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్న చోట అధికార పార్టీ ఈ నిధులను దారిమళ్లిస్తోంది. అక్కడ పార్టీ ఇన్‌చార్జీలు సూచించిన పనులకు ఇన్‌చార్జి మంత్రి ద్వారా మంజూరీ చేయిస్తోంది. ఏడాదిలో నాలుగు విడతలుగా ఈ నిధులు విడుదలవుతాయి. 2010 నుంచి ఇప్పటివరకు జిల్లాలో ఒక్కో నియోజకవర్గానికి రూ.3.50 కోట్ల చొప్పున సీడీపీ నిధులు మంజూరయ్యాయి. ఇందులో రూ.1.75 కోట్లు ఎమ్మెల్యే కోటాగా, మిగతా సగం ఇన్‌చార్జి మంత్రి కోటాగా ఖర్చు చేస్తున్నారు.
పనులను పట్టించుకోలే..
తాగునీటి అవసరాలు, కమ్యూనిటీ హాళ్లు, ప్రహారీ గోడలు, ఆల యాలు, ప్రార్థన మందిరాలకు ఎక్కువగా నిధులు ఖర్చు చేశారు. కానీ.. ఆ పనులు మొదలయ్యాయా.. లేదా అనే విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదు. దీంతో కొన్ని నియోజకవర్గాల్లో పనులు అసంపూర్ణంగా మిగిలిపోయాయి. కొన్ని చోట్ల అసలు ప్రారంభమే కాలేదు. ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జి మంత్రి కోటాలో మొత్తంగా సీడీపీ నిధులతో జిల్లాలో 3,757 పనులు మంజూరు చేశారు. వీటిలో 1,077 పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. 555 పనులు ఇప్పటికీ అసంపూర్ణంగానే ఉన్నాయి. పనుల పురోగతిలో జగిత్యాల సెగ్మెంట్ పూర్‌గా ఉంది. ఎమ్మెల్యే సొంతంగా మంజూరు చేసిన 190 పనుల్లో ఇప్పటికీ 85 పనులు ప్రారంభం కాలేదు. 27 పనులు పురోగతిలో ఉన్నట్లు రికార్డులున్నాయి. కోరుట్ల, హుజూరాబాద్, సిరిసిల్ల సెగ్మెంట్లలోనూ ఎమ్మెల్యేలు మంజూరీ చేసిన పనుల పురోగతి అధ్వాన స్థాయిలోనే ఉంది.
పైసలున్నా పట్టింపులేదు!
Published Sat, Dec 14 2013 3:28 AM | Last Updated on Sat, Sep 2 2017 1:34 AM
Advertisement
Advertisement