కరీంనగర్‌రూరల్, న్యూస్‌లైన్ : టీఆర్‌ఎస్ చేసిన ఉద్యమాలు, అమరవీరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడనుందని టీఆర్‌ఎస్ శాసనసభ పక్షనేత ఈటెల రాజేందర్ అన్నారు. సీతారాంపూర్‌లోని కళ్యాణ మండపంలో శనివారం నిర్వహించిన కరీంనగర్ మండల టీఆర్‌ఎస్ కార్యకర్తల రాజకీయ శిక్షణ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సీమాంధ్ర పాలకుల నిర్లక్ష్యంతోనే తెలంగాణ అన్నిరంగాల్లో వెనకబడిందన్నారు. తెలంగాణలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య అందిస్తామని, పదివేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించి ప్రజలకు 24గంటల విద్యుత్ సరఫరా, రైతాంగానికి సాగు నీరు అందించడానికి చర్యలు చేపడతామన్నారు. వృద్ధులకు రూ. వెయ్యి, వికలాంగులకు రూ.1500 పింఛను, పేదలకు పక్కా ఇళ్లు కట్టిస్తామని తెలిపారు.
ఇక్కడున్న వనరులు దోచుకునేందుకే సమైక్యమంటున్నారని, టీఆర్‌ఎస్ స్వీయ రాజకీయ శక్తిగా ఎదిగి రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తుందని చెప్పారు. చిన్నరాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని, తెలంగాణ పునర్నిర్మాణంలో టీఆర్‌ఎస్ కీలకపాత్ర పోషిస్తుందని అన్నారు.
మాజీ ఎంపీ వినోద్‌కుమార్ మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుతోనే ప్రారంభమైందన్నారు. 1969లో 365 మంది, ఇప్పుడు వెయ్యి మంది విద్యార్థులు ప్రాణత్యాగాలు చేసుకున్నారని తెలిపారు.
ఆకలి కేకలు లేని ఆకుపచ్చ తెలంగాణను ఏర్పాటు చేయడమే టీఆర్‌ఎస్ ప్రధాన ధ్యేయమని చెప్పారు. కాకతీయ యూనివర్సిటి ప్రొఫెసర్ సాంబయ్య మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో టీఆర్‌ఎస్‌దే అంతిమ విజయమన్నారు. హైదరాబాద్‌లో సీమాంధ్రులు చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. నైజాంకు ఉన్న ఆరు లక్షల ఎకరాల భూములను కబ్జా చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ఏ పార్టీలో విలీనం కాదని, రాష్ట్ర పునర్నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తామని అన్నారు. తెలంగాణపై అసెంబ్లీలో తీర్మాణం ప్రవేశపెట్టినప్పుడు మద్దతివ్వని ఎమ్మెల్యేలను తెలంగాణ గడ్డపై అడుగుపెట్టనివ్వబోమని హెచ్చరించారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పొత్తులుండవని, టీఆర్‌ఎస్‌ను విలీనం చేయడానికి కేసీఆర్ సిద్ధంగా లేరని చెప్పారు. అనంతరం టీఆర్‌ఎస్‌ను ఏ పార్టీలో విలీనం చేయవద్దని, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్భంద విద్యను ప్రవేశపెట్టాలంటూ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మాణించారు.
టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు జక్కం నర్సయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు కె. రేవతి, దుర్శేడ్ సింగిల్ విండో చెర్మైన్ మంద రాజమల్లు, చొప్పదండి నియోజకవర్గ ఇన్‌చార్జి బొడిగె శోభ, నగర అధ్యక్షుడు రవీందర్‌సింగ్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు వేణు, సర్పంచులు ఎర్దండి ప్రకాష్, తొంటి మల్లయ్య, జె .మల్లయ్య, జంగిలి సాగర్, ఆరె అనిల్‌కుమార్, నాయకులు దాది సుధాకర్, అక్బర్‌హుస్సేన్, జమీల్ అహ్మద్, బండ గోపాల్‌రెడ్డి, ఎడ్ల శ్రీనివాస్, తుల బాలయ్య, మంద రమేశ్, బద్దిపెల్లి శ్రీను, నందెల్లి ప్రకాష్, జి.హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
త్యాగాల పునాదులపై తెలంగాణ
Published Sun, Nov 17 2013 3:17 AM | Last Updated on Sat, Sep 2 2017 12:40 AM
Advertisement
Advertisement