తోలు ఒలుచుడే | In the notification, the government handed over | Sakshi
Sakshi News home page

తోలు ఒలుచుడే

Published Fri, Jan 17 2014 4:34 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

In the notification, the government handed over

 హైదరాబాద్‌కు చెందిన హెచ్‌కేఆర్ రోడ్ వేస్ లిమిటెడ్ కంపెనీకి ఈ కాంట్రాక్టు అప్పగిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెల 20 నుంచి నోటిఫికేషన్ అమల్లోకి వస్తుంది.
  ప్రస్తుతం అమల్లో ఉన్న రేట్ల ప్రకారం.. కారు, జీపు, వ్యాన్లకు కిలోమీటర్‌కు 50 పైసలు, లోకల్ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్, మినీ బస్‌కు రూపాయి, బస్, ట్రక్‌కు రూ.2 చొప్పున, మల్టీ యాక్సిల్ వెహికల్స్, హెవీ కన్‌స్ట్రక్షన్ వెహికల్స్‌కు రూ.5కు మించకుండా టోల్ వసూలు చేయాలని పేర్కొంది.
 
 సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ నుంచి ఇటు రామగుండం, అటు సిద్ధిపేట, హైదరాబాద్ వైపు వెళ్లే వాహనదారులకు చేదు వార్త. ఇకపై మీ ప్రమాణం మరింత ఖరీదవనుంది. టోల్ పేరిట ఈ రహదారిపై వెళ్లే ప్రయాణికుల తోలు ఒలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకే... ప్రయాణ ఖర్చులతో పాటు టోల్ ఫీజుతో మీ జేబులు లూటీ కావటం ఖాయమైంది.
 
 హైదరాబాద్-కరీంనగర్-రామగుండం రహదారిపై మూడు చోట్ల టోల్ వసూలు చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 28.200 కిలోమీటర్ల నుంచి 235.058 కిలోమీటర్ల వరకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ పద్ధతిన నిర్మించిన రహదారిపై టోల్ వసూలు చేయనున్నట్లు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రహదారి నిర్మాణ సమయంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం హైదరాబాద్‌కు చెందిన హెచ్‌కేఆర్ రోడ్ వేస్ లిమిటెడ్ కంపెనీకి ఈ కాంట్రాక్టు అప్పగించింది. ఈ రహదారిని వినియోగించుకునే ప్రతి వాహనదారు నుంచి టోల్ వసూలు చేసుకునేందుకు వీలుగా నోటిఫికేషన్ జారీ చేసింది.
 
 ఈ నెల 20 నుంచి నోటిఫికేషన్ అమల్లోకి వస్తుంది. మెదక్ జిల్లా సిద్ధిపేట సమీపంలోని దుద్దెడ వద్ద, జిల్లాలోని తిమ్మాపూర్ మండలం రేణికుంట, రామగుండం మండలం బసంత్‌నగర్ వద్ద టోల్ గేట్లను ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న రేట్ల ప్రకారం కారు, జీపు, వ్యాన్లకు కిలోమీటర్‌కు 50 పైసలు, లోకల్ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్, మినీ బస్‌కు ఒక రూపాయి, బస్, ట్రక్‌కు రూ.2 చొప్పున, మల్టీ యాక్సిల్ వెహికల్స్, హెవీ కన్‌స్ట్రక్షన్ వెహికల్స్‌కు రూ.5కు మించకుండా టోల్ వసూలు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. టోల్ వసూలుకు రంగం సిద్ధమవటంతో ఈ రహదారిపై వెళ్లే బస్సులకు ఆర్టీసీ సైతం అంతమేరకు అదనపు చార్జీలను వసూలు చేసే అవకాశముంది.
 
 దీంతో ఈ మార్గంలో వెళ్లే ప్రయాణికులపై చార్జీల మోత మోగనుంది. హైదరాబాద్ నుంచి రామగుండం వరకు.. అతుకుల బొంతలా ఈ రహదారి నిర్మాణం అసంపూర్తిగానే ఉంది. ఈ రహదారి నిర్మాణం నాసిరకంగా ఉందని.. ఫోర్‌లేన్‌కు సంబంధించి నిబంధనలు పాటించలేదని వెల్లువెత్తిన ఆరోపణలపై వేసిన శాసనమండలి సబ్ కమిటీ నివేదిక సైతం చర్చకు నోచుకోలేదు. ఈలోగా... టోల్ వసూలుకు కాంట్రాక్టు కంపెనీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంపై సర్వత్రా విమర్శలు పెల్లుబికుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement