- తెలుగుదేశం శ్రేణుల్లో రగులుతున్న ఆగ్రహం
- తోటకు కాకినాడ ,పండులకు అమలాపురం ఎంపీ సీట్లు
- సిట్టింగ్ ఎమ్మెల్యే ‘చందన’కు మొండిచేయి
- నేడు బాబుకు సోకనున్న నిరసన సెగలు
సాక్షి, కాకినాడ : అభ్యర్థుల జాబితాలు ఆశావహులను నిస్పృహకు లోను చేస్తూ తెలుగుదేశంలో చిచ్చు రగిలిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీతో పొత్తుపై ఆగ్రహంతో ఉన్న తెలుగుతమ్ముళ్లు.. మంగళవారం జిల్లాలో పర్యటించనున్న అధినేత చంద్రబాబునాయుడి వద్ద అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. టీడీపీ తొలి జాబితాలో ఇద్దరు సి ట్టింగ్‌లతో పాటు పార్టీ కోసం పని చేసిన ఐదుగురికి అవకాశం కల్పిం చినా మలి జాబితా నుంచి గోడ దూకినవారికే ప్రాధాన్యం ఇస్తున్నారు.
కొత్తపేట, రామచంద్రపురం సీట్లను ఇటీవలే పార్టీలోకి వచ్చిన బండారు సత్యానందరావు, తోట త్రిమూర్తులుకు కట్టబెట్టారు. సోమవారం నాటి మూడో జాబితా లో కూడా అదే ఫార్ములా పాటిం చారు. ఇటీవలే సైకిల్ ఎక్కిన తోట నరసింహానికి కాకినాడ ఎంపీ సీటు, విశాఖలో కస్టమ్స్ అడిషనల్ కమిషనర్‌గా వీఆర్‌ఎస్ తీసుకున్న పండుల రవీంద్రబాబుకు అమలాపురం ఎంపీ సీటు కట్టబెట్టారు. కా కినాడ అసెంబ్లీ స్థానాన్ని వనమాడి వెంకటేశ్వరరావు కు, రాజమండ్రి రూరల్ స్థానాన్ని గోరంట్ల బుచ్చయ్య చౌదరికి కేటాయిం చారు. కాగా తోట కాకినాడ ఎంపీ అభ్యర్థిగా మంగళవారం నా మినేషన్ వేయనున్నారు.
ఇటీవలే కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి సైకిలెక్కిన తోట కోసం.. లోక్‌సభ సీటుపై గతంలోనే బాబు నుంచి స్పష్టమైన హామీ పొందిన కైట్ విద్యాసంస్థల అధినేత పోతుల విశ్వానికి మొండిచేయి చూపడంపై ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. కనీసం పెద్దాపురం లేదా పిఠాపురం అసెంబ్లీ సీట్లలో ఏదో ఒకటి ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగాలని విశ్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ‘వస్తున్నా మీ కోసం’ పాదయాత్ర సమయంలోనే మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యా రావుకు అమలాపురం ఎంపీ టికెట్ ఇస్తానన్న చంద్ర బాబు ఇప్పుడు మాట మార్చి రాజకీయాలతో సంబంధం లేని రవీంద్రబాబుకు టికెట్ కేటాయించడంతో గొల్లపల్లి అనుచరులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
బీసీ నేత అనే చందనకు మొండిచేయి..
నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఇప్పటికే ముగ్గురికి అవకాశం కల్పించిన బాబు తనకూ చాన్సిస్తారని ఆశించిన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే చందన రమేష్‌కు భంగపాటు తప్పలేదు. బీసీ సామాజిక వర్గానికి చెందిన చందనకు మొండి చేయి చూపుతూ ఆ స్థానాన్ని మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరికి కట్టబెట్టారు. బీసీ కాబట్టే తమ నాయకుడిని పక్కన పెట్టారని చందన అనుచరులు మండిపడుతున్నారు. ఎన్నికల్లో బీసీల సత్తా చూపిస్తామని హెచ్చరిస్తున్నారు.
ఇక కాకినాడ అసెంబ్లీ సీటును ఆశించిన మాజీ మంత్రి ముత్తాగోపాలకృష్ణకు భంగపాటు తప్పలేదు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేసిన ముత్తాను కాదని మళ్లీ వనమాడి కొండబాబుకు టికెట్ ఇవ్వడం పట్ల ముత్తా వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు తమ సామాజిక వర్గానికి ఒక అసెంబ్లీ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చి మోసగించిన చంద్రబాబు ఎదుట నిరసన వ్యక్తం చేసేందుకు జిల్లాలోని మాదిగలు సిద్ధమవుతుండగా, మరోవైపు టిక్కెట్లు దక్కని ఆశావహులు కూడా తమ అసంతృప్తిని వ్యక్తం చేయడానికి సన్నద్ధమవుతున్నారు.