పోలీసుల్ని వృత్తి నిపుణులుగా తీర్చిదిద్దుతా
♦ సాంకేతిక ఆధారిత పోలీసింగ్‌తో ప్రజలకు సేవలు
♦ ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో
♦ ఇన్‌చార్జి డీజీపీ సాంబశివరావు
♦ పుష్కరాల నిర్వహణ, పోలీస్ స్టేషన్ల
♦ ఆధునీకరణ ప్రస్తుత లక్ష్యాలు
హైదరాబాద్: పోలీసుల్ని వృత్తి నిపుణులుగా తీర్చిదిద్దేందుకు అనువైన వాతావరణం కల్పించి, సాంకేతికత సాయంతో ప్రజలకు సేవ చేసేలా యంత్రాంగాన్ని నడిపిస్తానని ఇన్‌చార్జి డీజీపీగా నియమితులైన నండూరి సాంబశివరావు వెల్లడించారు. సాంకేతికత ఆధార పోలీసింగ్‌తో ప్రజలకు మరింత చేరువవుతామని స్పష్టం చేశారు. ఆర్టీసీ ఎండీగా ఏడాదిన్నర పాటు బాధ్యతలు నిర్వర్తించి శనివారం ఇన్‌చార్జి డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న ఎన్.సాంబశివరావు శుక్రవారం ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే..
సైబర్ నేరాల పెరుగుదల ఆందోళన కలిగించే అంశం
రాష్ట్రంలో హత్యల శాతం తగ్గి సైబర్ నేరాల సంఖ్య పెరిగింది. ఏటా 42 శాతం సైబర్ నేరాలు నమోదవుతున్నాయి. సులువుగా డబ్బు సంపాదించేందుకు నేరస్తులు ఉపయోగించే సాంకేతికతకు ధీటుగా పోలీసులు తమ వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుకోవాల్సి ఉంది. బస్టాండ్ల ద్వారా రోజూ 50 లక్షల మందికి సేవలందించే బాధ్యతలు నిర్వర్తించిన నాపై ఇప్పుడు రోజుకు 2 వేల మంది వచ్చే పోలీస్ స్టేషన్లను ఆధునీకరించి మెరుగైన సేవ చేయాల్సిన బాధ్యత ఉంది.
4 నెలల్లో డీజీపీ కార్యాలయం
మరో 4 నెలల్లో గుంటూరు, విజయవాడల్లో ఎక్కడో ఓ చోట ఆర్టీసీ హౌజ్ ను మించిన భవనాన్ని, డీజీపీ కార్యాలయానికి స్థలం సమకూరుస్తాం. అలాగే ప్రజా ప్రతినిధులు చేసే సిఫార్సులు న్యాయబద్దంగా ఉంటే పరిగణనలోకి తీసుకుంటాం. 32 ఏళ్ల నా సర్వీసులో ఆర్టీసీలో పనిచేయడం ఎంతో సంతృప్తినిచ్చింది. కార్మికులకు 43 శాతం ఫిట్‌మెంట్‌తో సంస్థపై రూ.660 కోట్ల అదనపు భారం పడింది. ఆర్టీసీ నష్టాలను కొంత మేర తగ్గించగలిగాం. క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లలేకపోవడం, మెకానికల్ ఆపరేషన్స్ చూడలేకపోవడం అసంతృప్తి మిగిల్చింది.