సాక్షి, నెల్లూరు: సోమశిల పరిధిలోని సంగం, పెన్నా బ్యారేజీల నిర్మాణ పనులు నిలిచిపోయాయి. వీటిని పూర్తిచేసి లక్షలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీటితో పాటు సింహపురికి తాగునీరు అందించాలన్న మహానేత వైఎస్సార్ ఆశయం నిన్నటి వరకు పాలన సాగించిన కాంగ్రెస్ పాలకుల పుణ్యమా అని ఇప్పట్లో నెరవేరేలా లేదు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కూడా ఇందుకు కారణమని తెలుస్తోంది. నిర్మాణం ప్రారంభమై ఆరేళ్లు కావస్తున్నా 60 శాతం పనులు పనులు కూడా పూర్తికాలేదు. రెండు బ్యారేజీల నిర్మాణం పూర్తయితే ఆత్మకూరు, కావలితో పాటు నెల్లూరు రూరల్, సర్వేపల్లి తదితర ప్రాంతాలకు సాగునీరు అందుతుంది. ఆరేళ్లుగా బ్యారేజీల నిర్మాణం పూర్తికాకపోవడంతో దాదాపు 5 లక్షల ఎకరాలకు సక్రమంగా సాగునీరు అందడంలేదు.
నెల్లూరు జిల్లాలో రైతులు సోమశిల నీటిపైనే ఆధారపడి వ్యవసాయం సాగిస్తారు. సోమశిల నీటిని చివరి ఆయకట్టుకు అందించేందుకు ఆంగ్లేయుల కాలంలో 1882-84 మధ్య సర్ ఆర్థర్‌కాటన్ హయాంలో సంగం బ్యారేజ్ నిర్మాణం జరిగింది. 120 సంవత్సరాల పైబడిన ఆ నిర్మాణం దెబ్బతినడంతో 2006లో నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్ సంగం బ్యారేజీ నిర్మాణం కోసం రూ.122.5 కోట్లు కేటాయించారు. వైఎస్సార్ మరణానంతరం పాలకులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం పుణ్యమా అని ఇప్పటి వరకూ కేవలం రూ.30 కోట్ల మేర మాత్రమే పనులు పూర్తయ్యాయి. మరో రూ.100 కోట్లు పనులు జరగాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే 5 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు సక్రమంగా సరఫరా అవుతుంది. ఇటీవల పనులు మరింత మందకొడిగా సాగుతున్నాయనడం కంటే దాదాపు నిలిచి పోయాయనే చెప్పాలి.
ఈ నేపథ్యంలో పనులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియని దుస్థితి నెలకొంది. ఇక సర్ ఆర్థర్ కాటన్ హయాంలోనే జరిగిన పెన్నా బ్యారేజ్ నిర్మాణం పరిస్థితి సైతం ఇదే. వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో రూ.126.7 కోట్లతో పెన్నా ఆధునికీకరణ పనులు ప్రారంభించారు. ఇప్పటికి 85 శాతానికి మించి పనులు పూర్తికాలేదు. ఈ పనులు సైతం నత్తనడకనే సాగుతున్నాయి. వైఎస్సార్ మృతితో కిరణ్ సర్కార్ ప్రాజెక్టులను గాలికి వదిలేసిందనడానికి ఈ పనులే నిదర్శనం. ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెల కొంది. ఈ బ్యారేజీ పరిధిలో అధికారి కంగా 1లక్షా 50 వేల ఎకరాలకుపైగా ఆయకట్టుకు సాగునీరందుతుంది. అనధికారికంగా ఇది మరింత ఎక్కువ. ము ఖ్యంగా జాఫర్‌సాహెబ్ కెనాల్‌తో పాటు సర్వేపల్లి రిజర్వాయర్‌కూ నీళ్లు చేరుతాయి. నెల్లూరు నగరానికి తాగునీరందుతుంది. బ్యారేజీ పరిధిలో 10 కిలోమీటర్ల మేర భూగర్భ జలాలు పెరుగుతాయి. పెన్నాతో పాటు సంగం బ్యారేజీ పనులు త్వరి తగతిన పూర్తి చేస్తామని ఉన్నతాధికారులు హామీలు గుప్పిస్తున్నా అవి అమలుకు నోచుకోవడంలేదు. ఇప్పటికైనా అధికారులు శ్రద్ధ పెట్టి రెండు బ్యారేజీల నిర్మాణం పనులు వేగవంతంగా పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.
సంగం,పెన్నా బ్యారేజీ పనులు గాలికొదిలారు
Published Sun, May 18 2014 2:10 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement