సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: వేసవి కాలం ముగింపుకొచ్చేసింది... రుతుపవనాలు వచ్చేస్తున్నాయి... అనుకున్న ప్రజల ఆశలపై సూరీడు నిప్పులు కురిపిస్తున్నాడు! ఎండలు తగ్గినట్టే తగ్గి గత నాలుగు రోజులుగా మళ్లీ పెరుగుతున్నాయి. వడగాలులు భయపెడుతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సాధారణంగా వేసవికాలంలో రాత్రిపూట (కనిష్ట) ఉష్ణోగ్రత 22 డిగ్రీల నుంచి 25 డిగ్రీల వరకూ ఉంటే కాస్త అహ్లాదంగా ఉంటుంది. కానీ ఇప్పుడది కాస్త 30 డిగ్రీలకు తగ్గట్లేదు. అంతేగాకుండా ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంతగా మంగళవారం పగటిపూట (గరిష్ట) ఉష్ణోగ్రత 42 డిగ్రీలకు చేరింది.
జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగానే నమోదైంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు రానురాను ప్రమాదకరంగా మారుతున్నాయి. జిల్లాలో ఏదొక చోట అడపాదడపా వర్షాలు పడుతున్నా అనూహ్యమైన వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. వాటికితోడు పిడుగులు హడలెత్తిస్తున్నాయి! ఇటీవల కాలంలో ప్రాణనష్టం కూడా చోటుచేసుకుంటోంది. ఇక గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం కేవలం పది డిగ్రీలకు తగ్గిపోవడం పర్యావరణంలో ప్రమాదకర సంకేతాలని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్లే అర్ధరాత్రి కూడా వేడిగాలులు, ఉక్కపోత తగ్గట్లేదు. దీంతో ప్రజలకు వడదెబ్బతో నిస్సత్తువ, చిరాకుతో నిద్రలేమి సమస్యలు తప్పట్లేదు.
పెరిగిన ఉష్ణోగ్రతలతో బెంబేలు...
రాజాం, కొత్తూరు ప్రాంతంలో మంగళవారం గరిష్ట ఉష్ణోగ్రత అత్యధికంగా 42 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యింది. సోమవారం రాత్రి నమోదైన కనిష్ట ఉష్ణోగ్రత కూడా కొత్తూరు మినహా జిల్లాలో మిగతా అన్నిచోట్ల 30 డిగ్రీల సెల్సియస్ ఉంది. ఈ పరిస్థితి వల్ల తలెత్తే వడగాల్పులు, పొడి వాతావరణం వల్ల వడదెబ్బ ప్రమాదం పొంచి ఉంటుంది. ఈనెల 23వ తేదీ వరకూ ఇదే తరహా వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని ఆమదాలవలస వ్యవసాయ పరిశోధన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టరు జగన్నాథం తెలిపారు. 24వ తేదీ నుంచి చిరుజల్లులు పడే అవకాశం ఉందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment