శ్రీకాకుళం, న్యూస్‌లైన్: ఉద్యమాలు.. విపత్తులు.. డీజిల్, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో జీవనం దుర్భరంగా మారిన సగటు జీవిపై ఆర్టీసీ తన వంతు భారం మోపింది. ప్రజా రవాణా వ్యవస్థను మోయాల్సింది సగటు ప్రయాణికుడేనని తేల్చి చెప్పింది. సగటున పది శాతం పెంపుదలతో అన్ని రకాల బస్సుల చార్జీలను పెంచేసింది. ఆర్టీసీ ప్రయాణికులపై ప్రభుత్వం భారం మోపింది. పాసింజర్ నుంచి ఏసీ బస్సు వరకూ చార్జీలను పెంచుతూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఇటీవలే రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించడంతో చార్జీలు పెరగవని అందరూ భావించారు. అయితే అందుకు భిన్నంగా ప్రయాణికులపై భారం మోపారు. విశాఖపట్నం నాన్‌స్టాప్ లగ్జిరీ బస్సుచార్జి ప్రస్తుం 95 రూపాయలు ఉండగా రూ. 105కు పెరిగింది. ఎక్స్‌ప్రెస్ రూ. 85 నుంచి రూ. 94, ఇంద్ర ఏసీ రూ. 135 నుంచి 150 రూపాయలకు పెరిగింది.
పాలకొండకు పల్లెవెలుగు బస్సుకు రూ.27 ఉండగా అది 29 రూపాయలకు, రూ. 31 ఉన్న ఎక్స్‌ప్రెస్ చార్జి 35 రూపాయలకు పెరిగింది. విజయనగరం ఎక్స్‌ప్రెస్ రూ. 55 నుంచి 60 రూపాయలకు, పల్లె వెలుగు రూ. 42 నుంచి 45 రూపాయలకుపెరిగింది. రాజాంకు ఇది వరలో ఎక్స్‌ప్రెస్‌కు రూ. 35 ఉండగా 40 రూపాయలకు, పల్లె వెలుగు రూ. 28లు ఉండగా 30 రూపాయలకు పెరిగింది. ఆమదాలవలసకు ప్రస్తుతం ఉన్న 11 రూపాయల చార్జి రూ.12కు, శ్రీకూర్మానికి రూ. 9 నుంచి పది రూపాయలకు, కళింగపట్నానికి రూ. 14 ఉండగా 15 రూపాయలకు పెరిగింది. ఇదిలా ఉంటే కనీస చార్జిని ఏమాత్రం పెంచని ప్రభుత్వం పల్లె వెలుగు బస్సుకు కిలోమీటర్‌కు 4 పైసలు, ఎక్స్‌ప్రెస్‌కు 7 పైసలు, డీలక్స్ బస్సుకు కిలోమీటర్‌కు 9 పైసలు, సూపర్ లగ్జరీకి 11 పైసలు, ఇంద్ర ఏసీ బస్సుకు 12 పైసలు, గరుడ ఏసీ 15 పైసల చొప్పున పెంచారు.