నుజ్జునుజ్జయిన ఆర్టీసీ బస్సు
గురువారం మధ్యాహ్నం.. విజయనగరం నుంచి శ్రీకాకుళానికి ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు వస్తోంది. ప్రయాణికులందరూ వారి సీట్లలో కూర్చున్నారు. సాఫీగా సాగిపోతున్న ప్రయాణంలో ఒక్కసారిగా అలజడి రేగింది. పెద్ద శబ్దం రావడంతో ఏం జరిగిందో తెలియక ఉలిక్కిపడ్డారు. ఊహించని పరిణామం నుంచి తేరుకునేలోగా బస్సు ప్రమాదానికి గురై 19 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం మండలంలోని బుడుమూరు వద్ద జరిగింది.
లావేరు: జాతీయ రహదారిపై త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. ముందు వెళుతున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో బస్సు డ్రైవర్, కండక్టర్‌తో పాటు 17 మంది గాయపడ్డారు. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో ప్రయాణికులు తీవ్రంగా భయాందోళనకు లోనయ్యారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో ఎక్కువ మంది విజయనగరం జిల్లాకు చెందిన వారే ఉన్నారు. జాతీయ రహదారిపై పెద్ద ప్రమాదం జరిగినా ‘108’లు అందుబాటులో లేకపోవడంతో పోలీస్ వాహనాలు, హైవే అంబులెన్సులో క్షతగాత్రులను రిమ్స్‌కు తరలించారు.
ఒక్కసారిగా పెద్ద శబ్దం.. భారీ కుదుపు
విజయనగరం డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో విజయనగరం నుంచి శ్రీకాకుళం బయలుదేరింది. లావేరు మండలంలోని బుడుమూరు వద్ద ముందుగా జాతీయ రహదారిపై వెళుతున్న లారీని బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొంది. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. ముందు ఉన్న సీట్లను బలంగా గుద్దుకోవడంతో వీరి ముఖాలకు గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ యు.వెంకటరాజు, కండక్టర్ పీఎస్ రాజులుతో పాటు బస్సులోని 17 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. బుడుమూరు గ్రామస్తులతో పాటు వాహనదారులు వెంటనే వచ్చి సహాయక చర్యలు అందజేశారు. విషయం తెలుసుకున్న లావేరు ఎస్‌ఐ రామారావు ప్రమాదస్థలానికి చేరుకుని గాయపడిన వారిని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ఆర్టీసీ శ్రీకాకుళం–2 డిపో మేనేజరు ఎన్.అరుణకుమారి, అసిస్టెంట్ మేనేజర్ ఎ.అమరసింహ ప్రమాద స్థలాన్ని, బస్సును పరిశీలించారు. లావేరు పోలీసులు కేసు నమోదు చేశారు.
అంబులెన్సు అందుబాటులో లేక అవస్థలు
జాతీయ రహదారిపై పెద్ద ప్రమాదం జరిగినా 108 అంబులెన్సులు అందుబాటులో లేకపోవడంతో.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించేందుకు అవస్థలు పడ్డారు. లావేరు, రణస్థలం మండలాల అంబులెన్సులు ఇతర కేసుల కోసం వెళ్లిపోగా, ఎచ్చెర్ల అంబులెçన్సు మరమ్మతులకు గురైంది. దీంతో హైవే అంబులెన్స్‌ను రప్పించారు. 19 మందికి అది సరిపోకపోవడంతో లావేరు పోలీస్‌స్టేషన్, హైవే పోలీసుల వాహనాల్లో శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. 108 అంబులెన్సులు సకాలంలో అందుబాటులో లేకపోవడంతో అంతా ఆందోళన చెందారు.
ప్రమాదంలో గాయపడిన వారు వీరే..
ఈ ప్రమాదంలో గాయపడిన వారి వివరాలు.. ఉప్పలపాటి వెంకటరాజు(బస్సు డ్రైవర్, విజయనగరం), పీఎస్ రాజు(కండక్టర్, విజయనగరం), గేదేల అప్పమ్మ(గజపతినగరం), మంగిపూడి లక్ష్మి(విజయనగరం), మండా కామేశ్వరీ(విజయనగరం), బండి గురుమూర్తి (శ్రీకాకుళం), బండి వెంకటరావు(విజయనగరం), పి శ్రీనివాసరాజు(విజయనగరం), బొంతు సంగమేష్ (సీకే రాజపురం), బి.హరిశ్చంద్రప్రసాధ్(విజయనగరం), మన్నే నాగేశ్వరరావు(రణస్థలం, కండక్టర్), మన్నే వెంకటరమణ(రణస్థలం), ఉమ్మి మధుశ్రీనివాసరావు(విజయనగరం), సుంకర శ్రీనివాస్(గంట్యాడ మండలం నారవ గ్రామం), బీవీ రావు(పూసపాటిరేగ), దుంగ రమణమూర్తి(జేఆర్‌పురం స్టేషన్ ఏఎస్‌ఐ), తాడేపల్లి వెంకటలక్ష్మీ(విజయనగరం), ఎస్‌బీ నాయుడు(విజయనగరం), మురపాక నాగార్జున ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment