ధ్వంసమైన ఆర్టీసీ బస్సు ముందు భాగం , తీవ్రంగా గాయపడి చికిత్సపొందుతున్న చిరంజీవి
వర్గల్(గజ్వేల్): సురక్షిత ప్రయాణానికి నిర్వచనంగా చెప్పుకునే ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు ప్రమాదానికి గురైంది. రోడ్డు డివైడర్ పక్కన ఆగిఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టి అమాంతం రోడ్డు కిందకు దూసుకెళ్లింది. ఈ సంఘటన ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో వర్గల్ మండలం ముట్రాజ్‌పల్లి క్రాస్‌రోడ్డు సమీపంలో రాజీవ్ రహదారిపై జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా ఏడుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ఇందు లో డ్రైవర్‌తోపాటు మరో ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డారు. చిమ్మచీకట్లో, నిర్జన ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాద ఘటనతో ప్రయాణికులు భీతిల్లిపోగా, గాయాల బాధతో క్షతగాత్రులు హాహాకారాలు చేస్తూ అల్లాడిపోయారు. అదృష్టవశాత్తు హైటెన్షన్ విద్యుత్ వైర్లతో కూడిన స్తంభాన్ని ఢీకొట్టకుండా బస్సు రోడ్డు కిందకు దూసుకెళ్లడంతో పెనుప్రమాదం తప్పింది. గౌరారం ఎస్సై ప్రసాద్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. జగిత్యాల ఆర్టీసీ డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఆదివారం సాయంత్రం 36 మంది ప్రయాణికులతో హైదరాబాద్ వెళుతోంది.
రాత్రి 11 గంటల ప్రాంతంలో వర్గల్ మండలం ముట్రాజ్‌పల్లి క్రాస్‌రోడ్డు సమీపంలో డివైడర్ వైపు నిలిచిఉన్న ఇసుక లారీని వెనుక నుంచి ఢీకొట్టి రోడ్డు కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఛాతికి స్టీరింగ్ తగలడంతో డ్రైవర్ గుగులోతు శ్రీనివాస్(39), డ్రైవర్ వెనుక సీట్లో కూర్చున్న కరీంనగర్ జిల్లా నగునూరుకు చెందిన శ్రీరాంట్రాన్స్‌పోర్ట్ ఉద్యోగి కొత్తూరి చిరంజీవి (35)కి ఛాతి సమీపంలో కిటికీ ఊచ దిగడంతో తీవ్రంగా గాయపడ్డారు. కరీంనగర్‌కు చెందిన మేడోజు అనిల్‌కుమార్(40), కొత్తపల్లికి చెందిన అడిగొప్పుల రాజు(25), మానకొండూర్ మండలం ఖాదర్‌గూడకు చెందిన లెక్చరర్ సంటి అనిల్(29), కోహెడ మండలం ఖానాపూర్‌కు చెందిన రాచకొండ హరిప్రసాద్(33), సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వర్గవెల్లికి చెందిన నీరడి ప్రశాంత్ (33)లు గాయాలయ్యాయి. మిగతా ప్రయాణికులు స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు.
ఒక ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే..
బస్సు ప్రమాద ఘటనకు ముందు ముట్రాజ్‌పల్లి క్రాస్‌రోడ్డు వద్ద హైదరాబాద్ వైపు వెళుతున్న కారు, లారీ ప్రమాదానికి గురయ్యాయి. ఈ విషయంలో ఇరువాహనాలకు చెందిన వారి మధ్య గొడవ జరగడంతో లారీ డ్రైవర్ రోడ్డు మీదే డివైడర్ వైపు ఇసుక లారీని నిలిపేసి గౌరారం పోలీసుల వద్దకు వెళ్లాడు. పోలీసులు అక్కడకు చేరుకుని విచారణ చేస్తున్న సమయంలోనే జగిత్యాల డిపో ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు డివైడర్ వైపు ఉన్న లారీని ఓ పక్కకు ఢీకొట్టి రోడ్డు కిందకు దూసుకెళ్లింది. రోడ్డు పక్కనే హైటెన్షన్ విద్యుత్ వైర్లతో కూడిన టవర్‌ను ఢీకొట్టి ఉంటే బస్సు విద్యుత్‌షాక్‌తో కాలిపోయేదని, అదృష్టవశాత్తు పెనుప్రమాదం తప్పిందని అంతా ఊపిరితీసుకున్నారు. లారీని పోలీస్‌స్టేషన్‌కు తరలించామని ఎస్సై ప్రసాద్ తెలిపారు. కాగా ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్ శ్రీనివాస్, ప్రయాణికుడు కొత్తూరి చిరంజీవిలు సికింద్రాబాద్‌లో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.
చిమ్మచీకట్లో హాహాకారాలు..
రాత్రి 11 గంటల ప్రాంతం.. ప్రయాణికులు నిద్రలో జోగుతున్న వేళ..రోడ్డుపై వెళుతున్న ఆర్టీసీ బస్సు పెద్ద శబ్దంతో లారీని ఢీకొట్టడం, ఏమైందో తెలిసేలోపే కుదుపులతో అమాంతం రోడ్డు కిందకు దూసుకెళ్లడంతో అందులో ఉన్న ప్రయాణికులందరూ భీతిల్లిపోయారు. ఓ వైపు చిమ్మచీకట్లు, మరోవైపు, తలలకు, కాళ్లు చేతులకు, నడుముకు, ఛాతికి తగిలిన గాయాల బాధతో హాహాకారాలు, ఆర్తనాదాలు చేశారు. సమాచారం తెలిసి గౌరారం ఎస్సై ప్రసాద్, ఏఎస్సై ఇస్మాయిల్ తమ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. సెల్‌ఫోన్ వెళుతురులో క్షతగాత్రులను వెలికి తీశారు. ములుగు 108 అంబులెన్స్, పోలీస్ జీపులో ఏడుగురు క్షతగాత్రులను గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు. కొద్దిసేపటికే అక్కడకు చేరుకున్న గజ్వేల్, కొండపాక 108 అంబులెన్స్ సిబ్బంది స్వల్పగాయాలతో అల్లాడుతున్న మిగతా ప్రయాణికులకు అక్కడికక్కడే ప్రాథమిక చికిత్సలు జరిపారు. ఆ తరువాత ప్రయాణికులను ఇతర బస్సులలో పోలీసులు పంపించివేశారు.
Comments
Please login to add a commentAdd a comment