నెల్లూరు,(దర్గామిట్ట),న్యూస్‌లైన్: విద్యుత్ కోతల వేళలను మరింత పెంచుతూ విద్యుత్‌శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కార్పొరేషన్ పరిధిలో 3 గంటలు, మున్సిపాలిటీల్లో 4 గంటలు, మండల కేంద్రాల్లో 6 గంటలు, పల్లెల్లో 8 గంటల పాటు కోతలు విధించనున్నట్లు విద్యుత్‌శాఖ ఎస్‌ఈ నందకుమార్ బుధవారం ప్రకటించారు. ఈ కోతల వేళలు గురువారం నుంచే అమలులోకి వస్తాయని చెప్పారు. జలవిద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి తగ్గిపోవడంతో కోళల వేళలను పెంచాల్సి వస్తోందని అధికారులు చెబుతున్నారు. శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి నిలిచిపోవడం, సింహాద్రి ప్లాంట్‌లో రెండు యూనిట్లు మరమ్మతులకు గురికావడంతో కోతల వేళలను పెంచకత ప్పదంటున్నారు. ఈ క్రమంలో పరిశ్రమలకు సరఫరా
చేసే విద్యుత్‌పైనా ఆంక్షలు విధించారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 10.30 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా పరిశ్రమల్లో కేవలం వెలుగులు కోసమే విద్యుత్‌ను వినియోగించాలని నిబంధన పెట్టారు.
వ్యవసాయానికి ఇచ్చే విద్యుత్‌ను మూడు గ్రూపులుగా విభజించి కోతల వేళలను అమలు చేస్తున్నారు. మరోవైపు ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో నాలుగైదు గంటల పాటు అనధికార కోతలు విధిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలో విద్యుత్ సరఫరా ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు ఉండదో తెలియని పరిస్థితి నెలకొంది.
విద్యుత్ కోతల వేళలు
కార్పొరేషన్‌లో ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 3.30 గంటల వరకు, మున్సిపాలిటీల్లో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు, మండల కేంద్రాల్లో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కోతలు విధిస్తారు. పల్లెల్లో ఏ గ్రూపు పరిధిలో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు, బీ గ్రూప్ పరిధిలో ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 6 గంటల వరకు, సీ గ్రూప్ పరిధిలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదు.
వ్యవసాయానికి
వ్యవసాయానికి ఏ గ్రూపు పరిధిలో ఉదయం 4 నుంచి 9 గంటల వరకు, రాత్రి 10 నుంచి 12 గంటల వరకు, బీ గ్రూప్ పరిధిలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, రాత్రి 12 నుంచి వేకువన 2 గంటల వరకు, సీగ్రూపు పరిధిలో మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు, వేకువన 2 నుంచి 4 గంటల వరకు సరఫరా ఇస్తారు.
పెరిగిన విద్యుత్ కోతలు
Published Thu, Oct 17 2013 4:32 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement