కూర లేని కూడు
- ఎండ తీవ్రతకుతగ్గిన కూరగాయల దిగుబడి
- అమాంతంగా పెరిగిన ధరలు
- వినియోగదారుల గగ్గోలు
చుక్కలనంటుతున్న కూరగాయల ధరలు పచ్చడి మెతుకులతో కడుపునింపుకోమంటున్నాయి. ఒక కుటుంబం కూర వండుకు తినాలంటే కనీసం పూటకు రూ.50 అయినా ఖర్చు పెట్టక తప్పేలా లేదు. వేసవిలో దిగుబడి తగ్గటంతో కూరగాయల రేట్లు అమాంతం పెరిగిపోవటంతో వినియోగదారులు ఆందోళన పడుతున్నారు.
యలమంచిలి: చిక్కుడు చుక్కల్లో చేరింది..కాకర కలవరం సృష్టిస్తోంది.. కొత్తిమీర కన్నీళ్లు తెప్పిస్తోంది...ములక్కాడ దిగిరానంటోంది..అలసంద ఆకాశాన్నం టి.. పుదీనా కొనలేం.. అల్లం ధర అందుబాటులో లేకుండా పోయింది. చిన్న అల్లం ముక్క రూ. 10లకు కొనుగోలు చేయాల్సిందే. ఇలా మార్కెట్‌లో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. అందుబాటులో లేకపోవడంతో మధ్యతరగతివారు అల్లాడిపోతున్నారు. ఎండల ప్రభావంతో వీటి దిగుబడి బాగా తగ్గిపోయింది. అందుబాటులో ఉన్న వాటి ధరలు అమాంతం పెరిగిపోయాయి.
తోటకూర, గోంగూర, బచ్చలి, చుక్కకూరల ధరలూ రెట్టింపయ్యాయి. వ్యాపారులు సిండికేట్‌లుగా ఏర్పడి అందుబాటులో ఉన్న వాటి ధరలనూ పెంచేస్తున్నారు. జిల్లాలో అందుబాటులో ఉన్న బీర, బెండ, టమాటా, వంగ, ఆనప వంటి కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. 40 నుంచి 50 శాతం వరకు పెరగడంతో విని యోగదారలు గగ్గోలుపెడుతున్నారు. వారం రోజుల కిందట వరకు రూ.15లు ఉన్న టమాటా రూ.30, రూ.20 ఉన్న బెండ,బీర రూ.30 విక్రయిస్తున్నారు. కూర అరటి, ఆనపకాయల ధరలు రెట్టింపయ్యాయి. జిల్లాలో అత్యధికంగా యలమంచిలి, నర్సీపట్నం, చోడవరం, మాడుగుల నియోజకవర్గాలతోపాటు ఏజెన్సీ ప్రాంతం నుంచి కాబేజీ, కాలీఫ్లవర్, బీన్స్ దిగుమతి అవుతున్నాయి.
పది వేల ఎకరాల్లో సాగు
యలమంచిలి నియోజకవర్గంలోనే దాదాపు పది వేల ఎకరాల్లో కూరగాయల పంటలు సాగు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఎండల తీవ్రతతో ఈ పంటలకు సాగునీటి కొరత ఏర్పడింది. వంగ, బీర, టమాటా పంటలు ఎండిపోతున్నాయి. విద్యుత్ కోతలతో రైతులు డీజిల్ ఇంజన్లను వినియోగిస్తున్నారు. రోజుకు కనీసం 2 నుంచి 3 గంటలు కూడా విద్యుత్ సరఫరా లేకపోవడంతో కూరగాయల రైతులు ఉసూరుమంటున్నారు. దిగుబడి తగ్గిందంటూ వ్యాపారులు పలు కూరగాయల ధరలను అడ్డంగా పెంచేస్తున్నారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సిండికేట్‌గా రైతుల నుంచి తక్కువ ధరలకు కొనుగోలుచేసి డైలీమార్కెట్, వారపు సంతల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న విమర్శలున్నాయి.