ఇంటింటా షుగరూ..
వయసుతో నిమిత్తం లేకుండా గుండెపోటు
అధికమవుతున్న మధుమేహ వ్యాధిగ్రస్తులు
నేడు మధుమేహ దినం
నెల్లూరు (విద్యుత్) ఇంటింటికీ షుగర్ అనగానే నిత్యవసర సరుకు గుర్తుకొస్తుంది. అలా అనుకుంటే పొరపాటే. ప్రతి ఇంటా ఒకరు షుగర్ వ్యాధిగ్రస్తులున్నారనడంలో అతిశయోక్తి లేదు. అలాగే వయసుతో నిమిత్తం లేకుండా గుండెపోటుకు గురవుతున్న వారి సంఖ్య రోజురోజుకూ ఆందోళన కలిగిస్తోంది. మధుమేహం, రక్తపోటు, పనిఒత్తిడి తదితర కారణాలతో గుండెపోటుకు గురవుతున్నారు. శుక్రవారం ప్రపంచ మధుమేహ దినం సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఇటీవల ఓ సంస్థ హృద్రోగ సంబంధిత కారణాలపై దేశ వ్యాప్త సర్వే నిర్వహించింది. సర్వేలో వెల్లడైన విషయాలు అందరినీ ఆలోచింప చేస్తున్నాయి. 30 ఏళ్ల వయసు దాటిన వారిలో 18.5 శాతం పైగా చక్కెర వ్యాధి, 20.5 శాతం మంది రక్తపోటు, 40 శాతం మందికి పైగా గుండె,నరాల సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్టు వెల్లడించింది. అయితే నెల్లూరు నగరంలో గుండె ఆపరేషన్లు చేయించుకున్న వారిలో 40 శాతం మంది మధుమేహ రోగులేనని చెబుతున్నారు. గుండె జబ్బుకు ప్రధానంగా రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, చెడు కొవ్వు, మానసిక ఒత్తిడి, కాలుష్యం, ధూమ, మద్యపానం వంటివి కారణాలు.
మధుమేహంతో సెలైంట్ హార్ట్ ఎటాక్
గుండెపోటుకు గురైన ప్రతి పదిమందిలో ఆరుగురు డయాబెటిస్ ఉన్నవారే. అంతేకాక మధుమేహం అదుపులో లేనివారు, దీర్ఘకాలంగా వ్యాధి ఉన్నవారిలో నరాల స్పర్శ జ్ఞానం క్షీణించడంతో గుండెపోటు తీవ్రతను కూడా వీరు గుర్తించే అవకాశాలు చాలా తక్కువ. మహిళల్లో మధుమేహం వల్ల హార్మోనల్ రక్షణ పూర్తిగాపోయి హార్ట్‌ఎటాక్‌కు దారితీస్తుంది. మధుమేహం ఉన్న మహిళల్లో సాధారణ మహిళల్లో కంటే రెండు, మూడు రెట్లు అధికంగా వచ్చే అవకాశం ఉంది. అధునాతన మందులతో మధుమేహానికి దూరంగా ఉండవచ్చు.
ఆహార నియమాలు కచ్చితంగా పాటించాలి
గుండె జబ్బులకు గురికాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ఎంతో అవసరం.పట్టణీకరణ విస్తరిస్తున్న నేపథ్యంలో హృద్రోగాలు ఎక్కువవుతున్నాయి. మధుమేహం, రక్తపోటు, చెడు కొవ్వు అధికంగా ఉండటం, కాలుష్యం వంటి కారణాలతో గుండెజబ్బులకు గురవుతున్నారు. ఆహార నియమాలు కచ్చితంగా పాటించాలి.
- డాక్టర్ ఎం శ్రీనివాస్‌రెడ్డి, మధుమేహవ్యాధి నిపుణుడు
అశ్రద్ధ చేస్తే ప్రాణాపాయం
చక్కెర వ్యాధిపై నిర్లక్ష్యం వీడాలి. వ్యాధిపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. లేకుంటే ప్రాణాపాయం తప్పదు. వ్యాధిని తొలిదశలోనే గుర్తిస్తే అదుపులో ఉంచుకోవచ్చు. ఇతర దుష్ఫలితాలను తగ్గించుకోవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం, ఆహారపు అలవాట్లు మార్చుకుంటే చాలు.
- డాక్టర్ అమరేష్‌రెడ్డి, మధుమేహ వ్యాధి నిపుణుడు,
నారాయణ వైద్యశాల