చదువే లోకమై.. ఆటలకు దూరమై | Increasing pressure in kids | Sakshi
Sakshi News home page

Published Sun, Sep 24 2017 3:36 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

Increasing pressure in kids - Sakshi

నెల్లూరులోని రామ్మూర్తినగర్‌కు చెందిన కృష్ణారెడ్డికి ఒక కుమారుడు. కార్పొరేట్‌ స్కూల్లో చదివిస్తున్నాడు. స్కూల్‌లో క్రీడా మైదానం ఉన్నా యాజమాన్యం ఆటలపై శ్రద్ధ చూపలేదు. రోజూ చదువు పేరుతో ఇటు తల్లిదండ్రులు.. అటు ఉపాధ్యాయులు ఒత్తిడి పెంచడంతో తరచూ అనారోగ్యం బారిన పడుతున్నాడు. దీంతో 12 ఏళ్ల వయసు ఉన్నప్పటికీ బాడీ మాస్‌ ఇండెక్స్‌ (బీఎంఐ)కు తగ్గట్టు 37 కేజీల బరువు ఉండాల్సి ఉండగా 28 కిలోలు, 147 సెం.మీ ఎత్తు ఉండాల్సి ఉండగా 138 సెం.మీ మాత్రమే ఉన్నాడు. ప్రస్తుతం కంటి చూపు కూడా మందగించడంతో కళ్లజోడు పెట్టుకుంటే కానీ అక్షరాలు కనిపించని పరిస్థితి. 

సాక్షి, అమరావతి బ్యూరో: ఇది ఒక్క కృష్ణారెడ్డి కుమారుడి సమస్యే కాదు, రాష్ట్రంలో కార్పొరేట్‌ విద్య ముసుగులో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఒత్తిడితో విద్యార్థులు సతమతమవుతున్నారు. ఆటపాటల ఊసేలేదు. తల్లిదండ్రులు కేవలం ర్యాంకుల గురించి ఆలోచిస్తున్నారే తప్ప.. తమ చిన్నారుల మనసు, శరీరాలపై ఏర్పడే దుష్ప్రభావాలపై దృష్టి సారించడం లేదు. ఫలితంగా రెండో తరగతి చదివే విద్యార్థి లోకం చూడాలంటే కళ్లజోడు కావాల్సి వస్తోంది. నాలుగో తరగతి చదివే విద్యార్థి పట్టుమని పది నిమిషాలు కూడా ఆగకుండా పరుగెత్తలేని పరిస్థితి ఉంది. రోజురోజుకీ శారీరక దృఢత్వంతోపాటు బాడీ మాస్‌ ఇండెక్స్‌ (బీఎంఐ) స్థాయి పడిపోయి అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. కాగా, వ్యాయామ విద్య అమల్లో ఉన్న పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు శారీరకంగా, దృఢంగా ఉంటున్నారు. మిగిలినవారు సరైన ఎత్తు, బరువు కూడా లేరని పలు పరిశోధనల్లో తేలింది. ఇందులో భాగంగా పరుగు సామర్థ్యం, శరీరంలో ఎగువ, దిగువ అవయవాల దృఢత్వం, పొత్తి కడుపు బలం, ఎత్తు, బరువుల నిష్పత్తి పరిశీలించారు. 

రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితి ఇలా.. 
రాష్ట్రంలో మొత్తం స్కూళ్లు 61,529 ఉండగా అందులో ప్రైవేటు స్కూళ్లు 16,273, ప్రభుత్వ స్కూళ్లు 642, జెడ్పీ, మండల పరిషత్‌ స్కూళ్లు 38,712 ఉన్నాయి. ఇతర స్కూళ్లు 5900 వరకు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చదివే విద్యార్థులు 34,07,750 మంది ఉండగా, ప్రైవేటు స్కూళ్లలో ప్రాథమిక స్థాయిలో చదివే విద్యార్థులు 26,33,719 మంది ఉన్నారు. అలాగే ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులు 8,63,152 మంది ఉండగా, ప్రైవేటు పాఠశాలల్లో చదివేవారు 5,35,071 మంది ఉన్నారు. చాలా ప్రభుత్వ స్కూళ్లలో, సగానికి పైగా ప్రైవేటు స్కూళ్లలో క్రీడా మైదానాలు లేవు. కొన్ని కార్పొరేట్‌ స్థాయి పాఠశాలల్లో మైదానాలు ఉంటున్నా ఆడుకోనీయడం లేదు. 

ఇలా చేస్తే కొంతమెరుగు.. 
రోజూ కనీసం 40 నిమిషాలపాటు విద్యార్థులు వ్యాయామం చేసేలా చూడాలి. వారంలో మూడు, నాలుగుసార్లు క్రీడా మైదానాలకు తీసుకెళ్లాలి. మార్కుల కోసం అర్ధ రాత్రిళ్లు చదివే అలవాటును మానిపించాలి. ప్రశాంత వాతావరణలో కనీసం ఏడెనిమిది గంటలు నిద్రపోయేలా చూడాలి. సరిగా కూర్చోబెట్టడంతోపాటు, దృష్టి లోపాలను గమనించడం, భుజాలను సరైన పద్ధతిలో పెట్టేలా చేయాలి. మంచి శక్తినిచ్చే సమతుల ఆహారాన్ని అందించాలి. జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉంచాలి. తాజా ఆకుకూరలు, ప్రొటీన్స్, పాలు, గుడ్లు, కాల్షియం పదార్థాలతో కూడిన ఆహారం ఇవ్వాలి.

నైపుణ్యాలు పెంపొందించాలి  
నేటి విద్యార్థులు ర్యాంకులు, మార్కులు సాధిస్తున్నారే కానీ, శారీరక వ్యాయామం గురించి పట్టించుకోవడం లేదు. చిన్న వయసు నుంచే మానసిక ఒత్తిడికి గురైతే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వ్యాయామంపై పాఠశాల యాజమాన్యాలు దృష్టి సారించాలి. ప్రతి విద్యార్థిలో నైతిక విలువలు, సమస్యాసాధన పరిష్కార నైపుణ్యాలు, సామాజిక సంబంధాలు పెరిగేలా పాఠశాలలు చర్యలు తీసుకోవాలి. 
– డాక్టర్‌ విశాల్‌రెడ్డి ఇండ్ల, పిల్లల మానసిక వైద్య నిపుణులు  

విద్యలో క్రీడలు భాగం కావాలి 
నేటి కార్పొరేట్‌ విద్యావిధానంలో విద్యార్థులు పూర్తిగా క్రీడలకు దూరమవుతున్నారు. దీంతో వారిలో అనారోగ్య సమస్యలతోపాటు మానసిక సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. చిన్న సమస్య ఎదురైనా పరిష్కరించుకోలేకపోతున్నారు. దీంతో కుంగుబాటుకు గురవుతున్నారు. రోజూ క్రీడలు ఆడే అలవాటు ఉన్న విద్యార్థులకు వ్యాయామంతో మనసు, శరీరం ఉత్తేజితమవుతుంది. వ్యాయామం లేకపోవడంతో చిన్న వయసులోనే విపరీతంగా లావెక్కుతున్నారు. దీని ప్రభావంతో మూడు పదుల వయసులోపే రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులు సోకే అవకాశాలు ఎక్కువవుతాయి.     
– డా‘‘ ఎన్‌ఎస్‌. విఠల్‌రావు, పీడియాట్రిక్‌ ప్రొఫెసర్, సిద్ధార్థ వైద్య కళాశాల, విజయవాడ 

స్పోర్ట్స్‌ ఫర్‌ లైవ్‌ సూచిస్తున్న క్రీడలివే..
రాష్ట్రంలో వ్యాయామ విద్యాభివృద్ధికి కెనడాకు చెందిన స్పోర్ట్స్‌ ఫర్‌ లైవ్‌ సంస్థ కొన్ని సూచనలు చేసింది. అవి.. 6 ఏళ్ల నుంచి 12 ఏళ్లలోపు వయసున్న చిన్నారులకు.. ఈత, సైక్లింగ్, క్యాంపింగ్, రన్నింగ్, జంపింగ్, ఈత, బరువులు ఎత్తడం నేర్పించాలని, 12 నుంచి 13 ఏళ్లలోపు వయసున్న బాలబాలికలకు క్యాంపింగ్, ఈత, సైక్లింగ్, బరువు పరికరాలతో వ్యాయామం, ట్రెక్కింగ్, రన్నింగ్, జంపింగ్, షూటింగ్, ఫిషింగ్‌లలో శిక్షణ ఇవ్వాలని సూచించింది. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement