ఇబ్రహీంపట్నం : ఫేస్‌బుక్ పరిచయంతో ఓ విద్యార్థినిని హోటల్‌రూమ్‌కు తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన ఇబ్రహీంపట్నంలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. మైలవరంలోని ఓ కళాశాలలో చదువుతున్న అమ్మాయికి ఇబ్రహీంపట్నంకు చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈనెల 11న స్థానికంగా ఉన్న కేవీఆర్ గ్రాండ్ హోటల్ రూమ్‌ను బుక్‌చేసుకుని కారులో ఆ అమ్మాయిని తీసుకువెళ్లాడు. కొంత సమయానికి అతని స్నేహితులు మరో ఇద్దరు ఆ రూమ్‌కు వెళ్లారు. ఆ సమయంలో ముగ్గురూ ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ.. ఆ సన్నివేశాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లినట్లు తెలిసింది.
బెదిరింపులు..
అనంతరం సెల్‌ల్లో చిత్రీకరించిన వ్యక్తులు మొదటి వ్యక్తిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించాలని యత్నించారు. వీడియోను ఫేస్‌బుక్, వాట్సాప్‌లో పెడతామని బెదిరిం చారు. కొండపల్లి గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు ముగ్గురి మధ్య పంచాయతీ నిర్వహించారు. విషయం పోలీసులకు తెలియటంతో ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
లైంగిక దాడి జరగలేదు : సీపీ
ఓ టీవీ చానల్‌లో మంగళవారం ప్రచారమైనట్లుగా ఇబ్రహీంపట్నంలోని కేవీఆర్ గ్రాండ్ హోటల్‌లో యువతిపై గ్యాంగ్ రేప్ జరగలేదని నగర సీపీ ద్వారకా తిరుమల రావు తెలిపారు. చానల్‌లో గ్యాంగ్ రేప్ వార్త చూసిన వెంటనే తాము అప్రమత్తమై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టామన్నారు. హోటల్‌కు వచ్చి వెళ్లిన యువతి ఆచూకి తెలుసుకుని ఆమెతో మాట్లాడామని.. తనపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని ఆమె స్పష్టం చేసిందన్నారు. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన వ్యక్తితో హోటల్‌కు వెళ్లినమాట వాస్తవమేనని.. అతనితోపాటు మిత్రులు ఇద్దరు హోటల్‌రూమ్‌లో తనపై అసభ్యంగా ప్రవర్తించగా.. ప్రతిఘటించి వారి బారి నుంచి బయటపడ్డానని వివరించారని చెప్పారు. ఈ విషయం బయటకు పొక్కితే కుటుంబ పరువు పోతుందని భయపడి కేసు పెట్టలేదని ఆమె వివరించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె నగరానికి దూరంగా ఉన్నారని.. రాగానే కేసు పెట్టమని కోరామని చెప్పారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment