బద్వేలులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(ఫైల్) , స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా కలసపాడు పాఠశాలలో విద్యార్థులకు ఆటలపోటీలు
స్వాతంత్య్ర దినోత్సవం వచ్చిందంటే పాఠశాలలో సందడే సందడి. పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించడం, బహుమతులు అందించడం, మువ్వ నెన్నల జెండాలు ఎగురవేయడం, చాక్లెట్లు, స్వీట్లు అందించడం.. దేశభక్తిని, జాతీయ నాయకులను స్మరించుకునే అంశం. కానీ ఈ ఏడాది ఆటల పోటీల విజేతలకు బహుమతులివ్వాలన్నా, చిన్నారులకు చాక్లెట్లు అందించాలన్నా ప్రధానోపాధ్యాయులు అప్పులు చేయాల్సిందే. సీఎం పర్యటనలు, ఆర్బాటపు కార్యక్రమాల కోసం రూ.కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. పాఠశాలల్లో సంబరాల కోసం నయాపైసా విదల్చలేదు. కానీ స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు.
బద్వేలు : పాఠశాలల నిర్వహణ నిధులు (మెయింటెనెన్స్ గ్రాంట్)ను ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో స్వాతంత్య్ర వేడుకలను ఎలా నిర్వహించాలో తెలియక ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాల బ్యాంకు ఖాతాలో చూస్తే చిల్లిగవ్వ లేదు. ఈ నెల15న 72వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోలేని పరిస్థితిలో ఉన్నామని వారు వాపోతున్నారు. కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వానికి నిధులు ఇవ్వాలనే అంశం గుర్తుకు రాలేదా అంటూ ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
నిధుల మంజూరు ఇలా..
పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం ఏటా సర్వ శిక్ష అభియాన్ ద్వారా నిధులు అందించేది. విద్యా సంవత్సరం ప్రారంభంలో స్కూల్ గ్రాంట్, మెయింటెనెన్స్ గ్రాంట్‌లను పాఠశాల స్థాయిని బట్టి విడుదల చేసి ప్రధానోపాధ్యాయుని ఖాతాకు జమ చేస్తుంటారు. ఈ నిధులతో పాఠశాలకు రంగులు వేయడం, విద్యా బోధనకు అవసరమైన చార్టులు, బొమ్మలు, చాక్‌పీసులు, డస్టర్లు, పాఠశాలకు అవసరమైన రికార్డులు, విద్యార్థుల హాజరు పట్టిలు కొనుగోలు చేస్తారు. విద్యుత్ బిల్లులు, స్వాతంత్య్ర వేడుకలు, ఇతర జాతీయ పండుగలు జరుపుకోవడానికి అవసరమైన చిన్న పాటి ఖర్చులకు వీటిని వినియోగించే వారు. సాధారణంగా జూన్, జులై నెలల్లో విడుదల చేసేవారు. కానీ ప్రస్తుత ఏడాది మూన్నెల్లు గడిచినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. పాఠశాలలో గతేడాది మిగులు నిధులుండగా.. వాటిని కూడా గత నెలలో ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.
రూ.4.60 కోట్ల పైనే..
జిల్లాలో మొత్తం 3,275 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 2,589, ప్రాథమికోన్నత పాఠశాలలు 295, ఉన్నత పాఠశాలలు 391 ఉన్నాయి. వీటిలో 4.16 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటికి స్కూల్ గ్రాంటు కింద ప్రాథమిక పాఠశాలలకు రూ.5 వేలు, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.12 వేలు, ఉన్నత పాఠశాలలకు రూ.7 వేలు ఇవ్వాలి. మెయింటెనెన్స్ గ్రాంట్ క్రింద ప్రాథమిక పాఠశాలలకు రూ.5 వేలు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు రూ.10 వేల వంతున ఇవ్వాల్సి ఉంది.
ఈ నిధుల కింద జిల్లాకు ప్రస్తుతం రూ.4.60 కోట్ల నిధులు అందాల్సి ఉంది. అయితే వీటిలో ఇప్పటి వరకు నయాపైసా కూడా విడుదల కాలేదు. చాలా మంది ఉపాధ్యాయులు సొంత నిధులతో చాక్‌ఫీసులు, డస్టర్లు కొనుగోలు చేస్తున్నారు. కరెంట్ బిల్లులను సైతం చేతి నుంచే కడుతున్నారు. నిధులు లేకుంటే పాఠ్యాంశాల బోధనకు ఉపయోగపడే టీఎల్‌ఎంలను సిద్ధం చేసుకోగలమని వారు ప్రశ్నిస్తున్నారు. దీనికితోడు స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా ఎలా జరపగలమని పేర్కొంటున్నారు.
నిధుల కోసం ఎదురుచూపులు
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు ఇప్పటికే ఆటల పోటీలు, క్విజ్, వ్యాసరచన, డిబేట్ తదితర పోటీలను నిర్వహించడం ఆనవాయితీ. విజేతలకు సైతం బహుమతులు ఇస్తుంటారు. ప్రస్తుతం నిధులు లేకపోవడంతో చాలా మంది హెచ్‌ఎంలు సొంత డబ్బులు వెచ్చిస్తున్నారు. ఎక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలలో వేడుకలకు కనీసం రూ.20 వేల వరకు అవసరమవుతాయి. దాతలు ఎవరైనా ముందుకొస్తారేమోనని వారు ఎదురు చూస్తున్నారు. కొన్ని చోట్ల విద్యార్థులే చందాలు వేసుకుని ఆటల పోటీల్లో పాల్గొంటున్నారు.
చేతి నుంచే ఖర్చు
ప్రస్తుతం స్వాతంత్య్ర దినోత్సవాల కోసం విద్యార్థులకు ఆటలపోటీలు నిర్వహిస్తున్నాం. నిధులు రాకపోవడం ఇబ్బందికరంగా మారింది. చేతి నుంచి ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఈ వేడుకలకు కనీసం రూ.8 వేల వరకు అవసరమవుతాయి.
– ఓబయ్య, హెచ్‌ఎం, ఉన్నత పాఠశాల, కలసపాడు
ఉన్నవే తీసుకున్నారు
ఎస్‌ఎస్‌ఏ నిధులు గతేడాదివి రూ.10 వేలు అకౌంట్‌లో ఉండగా వెనక్కి తీసుకున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు కనీసం ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. ప్రస్తుతం స్వాతంత్య్ర వేడుకలకు కొందరు దాతలు సహకరిస్తుండగా, మిగిలిన నిధులను సొంతంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
– పుల్లయ్య, హెచ్‌ఎం, బాలుర జెడ్పీహెచ్‌ఎస్, బద్వేలు
నిధులను వెంటనే అందించాలి
ప్రభుత్వం పాఠశాలలకు మెయింటెనెన్స్ గ్రాంట్, స్కూల్ గ్రాంట్స్‌ను వెంటనే విడుదల చేయాలి. జెండా ఎగురవేయడం, చిన్నారులకు స్వీట్లు అందించాలంటే సొంతంగా నిధులను వెచ్చించాల్సిన పరిస్థితి రావడం ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. చాక్‌ఫీసులకూ నిధుల్లేని పరిస్థితి.
– సీవీ ప్రసాద్, ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment