నత్తనడకన ఇందిరమ్మ
Published Fri, Sep 13 2013 3:08 AM | Last Updated on Fri, Sep 1 2017 10:39 PM
ఖమ్మం ఖిల్లా, న్యూస్‌లైన్: ‘ఇందిరమ్మ రాజ్యం.. ఇంటిం టా సౌభాగ్యం..’ నినాదంతో పేద, మధ్య తరగతి ప్రజలకు సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఇందిరమ్మ పథకం జిల్లాలో నత్తనడకన కొనసాగుతోంది. జిల్లాలో మూడు విడతల్లో 3 లక్షల 829 ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటి వరకు 1,88,142 ఇళ్ల నిర్మాణం మాత్రమే పూర్తయింది. ఇంకా 1,12,687 ఇళ్లు పూర్తి కావాల్సి ంది. పథకం అమల్లోకి వచ్చి తొమ్మిదేళ్లు గడుస్తున్నా.. మొదటి దశలో మంజూరయిన ఇళ్ల నిర్మాణం కూడా పూర్తికాకపోవడం భాధాకరం. కాగా, జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో అసలు ఇంతవరకు నిర్మాణమే ప్రారంభం కాలేదు. ఇళ్లు మంజూరయినప్పటికీ ధ్రువీకరణ పత్రాలు సక్రమంగా లేవంటూ అధికారులు లబ్ధిదారులను ఇబ్బంది పెట్టడం వల్లే ఇంకా నిర్మాణం ప్రారంభించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆన్‌లైన్‌లో పొందుపరచిన వివరాల ప్రకారం.. మొదటి దశలో 13, 644 ఇళ్లు ఇంకా మొదలు పెట్టనేలేదు. రెండో దశలో 24,079, మూడో దశలో 29,589 ఇళ్లు మంజూరుకే పరిమితమయ్యాయి. కొన్ని ప్రాం తాల్లో పునాదిలోనే ఇళ్ల నిర్మాణం ఆగిపోగా, మరికొన్ని ఇళ్లు సన్‌సైడ్, స్లాబ్ లెవెల్లో నిలిచిపోయాయి. అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమనే ఆరోపణలున్నాయి. జిల్లాలో అన్ని ప్రాం తాల్లో ఏఈలతో పాటు అవసరమైన చోట్ల డీఈలు ఉన్నారు. వీరిద్దరూ కలిసి ఆయా ప్రాం తాల్లో ఉన్న వర్క్ ఇన్‌స్పెక్టర్‌లకు ఇళ్ల నిర్మాణం పూర్తి చేయించే బాధ్యతలు అప్పగించాలి. కానీ ఆయా అధికారుల్లో సరైన కమాండింగ్ లేకపోవడంతో వర్క్ ఇన్‌స్పెక్టర్లు ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగుతోంది.
జిల్లాలో వర్క్ ఇన్‌స్పెక్టర్లు ఉండాల్సిన దాని కన్నా 22 మంది ఎక్కువగానే ఉన్నారు. అయినా ఇళ్ల నిర్మాణం ముందుకు సాగకపోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఉదాహరణకు గుండాల మండలంలో పరిశీలిస్తే.. ఒక ఏఈ నెలలో 32 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయించాలనే లక్ష్యం ఉంటే.. ఆయన ఐదు ఇళ్లు మాత్రమే పూర్తి చేయించారు. నిర్మాణానికి అవసరమైన సిమెంట్, ఇటుక, స్టీల్ సకాలంలో సరఫరా కావడం లేదని, అందుకే ఆలస్యమవుతోందని మండల స్థాయి అధికారులు చెపుతున్నప్పటికీ.. తొమ్మిదేళ్ల క్రితం మంజూరైన ఇళ్లకు కూడా ఇంకా సరఫరా కాలేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రచ్చబండ రెండో విడతలోనూ అంతంతమాత్రమే...
రచ్చబండ రెండో విడతలో మంజూరయిన 19, 273 ఇళ్లలో ఇప్పటివరకు 3,454 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా 15,819 ఇళ్లు పూర్తి కావాల్సి ఉంది. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని ఇందిరమ్మ మూడు విడతలతో పాటు రచ్చబండలో మంజూరైన ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చూడాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
Advertisement
Advertisement