
అనంతవరం, నిడమర్రులో పారిశ్రామిక జోన్లు
సాక్షి, విజయవాడ బ్యూరో: ప్రతిపాదిత ఏపీ రాజధాని నగరంలో రెండు పారిశ్రామిక జోన్లు ఏర్పాటు కానున్నాయి. రాజధాని నగరానికి సమీపంలో గుంటూరు జిల్లాలో ఉన్న అనంతవరం, నిడమర్రు ప్రాంతాల్లో ఇందుకోసం అనువైన భూములు కూడా సిద్ధమయ్యాయి. సింగపూర్ ప్రభుత్వ ఏజెన్సీలు రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌లో ఈ భూములను పారిశ్రామిక జోన్ల కింద పేర్కొంటూ మార్కింగ్ చేశారు.
దీని ప్రకారం తుళ్లూరు మండలం అనంతవరం పరిధిలో రెండు వేల ఎకరాలు, మంగళగిరి మండలం నిడమర్రు ప్రాంతంలో 1,200 ఎకరాల స్థలాలను రిజర్వు చేసిన సీఆర్‌డీఏ అధికారులు అక్కడ ఏ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉందనే విషయాలపై అధ్యయనం చేస్తున్నారు.
సింగపూర్, జపాన్, చైనాతోపాటు స్వదేశీ కార్పొరేట్ కంపెనీలను ఈ జోన్లలో పారిశ్రామిక టౌన్‌షిప్‌లు నిర్మించేందుకు ఆహ్వానిస్తున్నారు. అందులో భాగంగానే గురువారం చైనాకు చెందిన డాలియన్ వాండా గ్రూపునకు ఈ రెండు ప్రదేశాలను చూపించి భవిష్యత్తులో ఇవి ఆకర్షణీయమైన పారిశ్రామిక కేంద్రాలుగా మారతాయని వివరించారు. గతంలో సింగపూర్, జపాన్‌కు చెందిన పలు కంపెనీలు కూడా ఈ స్థలాలను పరిశీలించాయి.
టౌన్‌షిప్‌లు ఏర్పాటు చేసేందుకు విదేశీ కంపెనీలు ముందుకు వస్తే ఈ జోన్లలో వారికి భూమిని లీజుకివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ జోన్లలో కాలుష్య రహిత ప్రాజెక్టులకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. రాజధాని నగరం కాలుష్యం బారిన పడుతుందనే ఉద్దేశంతో కేవలం గ్రీన్ పరిశ్రమలను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.